పవన్ కల్యాణ్ ‘పక్క చూపుల’ రాజకీయం

పవన్ కల్యాణ్ ఆలోచనలు ఆకాశమంత ఎత్తులో ఉంటాయి.. ఆచరణ మాత్రం అట్టడుగు స్థాయిలో ఉంటుంది. ఇది ఆరోపణ కాదు, జనసైనికులు భావన. పాతికేళ్ల ప్రస్థానం అంటూ రాజకీయం మొదలుపెట్టిన పవన్, సీజనల్ పొలిటీషియనే కానీ…

పవన్ కల్యాణ్ ఆలోచనలు ఆకాశమంత ఎత్తులో ఉంటాయి.. ఆచరణ మాత్రం అట్టడుగు స్థాయిలో ఉంటుంది. ఇది ఆరోపణ కాదు, జనసైనికులు భావన. పాతికేళ్ల ప్రస్థానం అంటూ రాజకీయం మొదలుపెట్టిన పవన్, సీజనల్ పొలిటీషియనే కానీ సీరియస్ పొలిటీషియన్ కాదని ఇప్పటికే పలుమార్లు రూఢీ అయింది.

నిన్నమొన్నటి వరకు పవన్ కల్యాణ్ దుబ్బాక పేరెత్తడానికే భయపడ్డారు, ప్రచారం చేయడానికి కూడా వెనకాడారు. తీరా ఇప్పుడు విజయం బీజేపీని వరించడంతో పట్టలేనంత సంతోషంతో ప్రెస్ నోట్లు విడుదల చేస్తున్నారు, చంకలు గుద్దుకుంటున్నారు. 

బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచే సరికి పవన్ లో కొత్త జోష్ వచ్చింది. రాబోయే రోజుల్లో ఏపీలో కూడా బీజేపీ-జనసేనదే అధికారం అన్నంత స్థాయిలో ఉన్నాయి పవన్ మాటలు.

పక్క రాష్ట్రాల ఫలితాలు చూసి పవన్ ఇక్కడ పొంగిపోవడం ఇదే తొలిసారి కాదు. 2018లో కర్నాటకలో వచ్చిన హంగ్ ఫలితాలు ఏపీలో కూడా వస్తాయని జోస్యం చెప్పారు జనసేనాని. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీని కాదని.. మూడో స్థానంలో నిలిచిన కుమారస్వామికి ముఖ్యమంత్రి పీఠం దక్కడంతో పవన్ కల్యాణ్ కూడా తాను ఏపీకి ముఖ్యమంత్రిని అయినట్టు ఫీలయ్యారు.

ఏపీలో కూడా వైసీపీ, టీడీపీ కుమ్ములాటలో తనకి తక్కువ సీట్లు వచ్చినా.. కర్నాటకలో లాగా మేజిక్ జరిగి తానే ముఖ్యమంత్రి అవుతాననుకున్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా కర్నాటక ప్రస్తావన తెచ్చారంటే.. అధికారంపై, ముఖ్యమంత్రి పీఠంపై ఆయన ఎన్ని ఆశలు పెట్టుకున్నారో అర్థమవుతుంది. అయితే సీఎం కావాలనుకున్న పవన్ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోవడం ఆయన స్వయంకృతాపరాధం.

ఇప్పడు మరోసారి పవన్ కల్యాణ్ పక్కచూపులు చూస్తున్నారు. ఈసారి ఆయన బిహార్ జపం అందుకున్నారు. బిహార్ లో బీజేపీ గెలిచింది. సో.. రాబోయే ఎన్నికల్లో ఏపీలో కూడా బీజేపీతో కలిసి జనసేన గెలిచేస్తుందని ఇప్పట్నుంచే చంకలు గుద్దుకుంటున్నారు. 

దుబ్బాకలో బీజేపీ అనూహ్య విజయం కూడా పవన్ ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది. బీజేపీ విజయంపై పవన్ విడుదల చేసిన ప్రెస్ నోట్లు, సన్నిహితుల దగ్గర ఆయన అంటున్న మాటలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

రాబోయే రోజుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ఏపీలో కూడా బీజేపీ, జనసేన కూటమిదే విజయం అని అంటున్నారట పవన్. ఆయన విశ్లేషణలు వినడానికి బాగుంటాయి కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ పరిస్థితేంటని ఒకసారి ఆలోచిస్తే అసలు విషయం బోధపడుతుంది. కేవలం జనసేన పార్టీకే కాదు.. బీజేపీకి కూడా ఇదే వర్తిస్తుంది. ఎక్కడో గెలిచామని ఆంధ్రాలో కూడా గెలిచేస్తామని అనుకోవడం భ్రమే అవుతుంది.

బీహార్ లో ఎన్డీఏ కూటమి, అధికారాన్ని నిలబెట్టుకోవడం పెద్ద విశేషమేమీ కాదు. టీఆర్ఎస్ శ్రేణుల అత్యుత్యాహం.. దుబ్బాకలో బీజేపీకి అనూహ్య విజయాన్ని అందించింది. ఇలా ఎక్కడికక్కడ స్థానిక పరిస్థితులు కమలదళానికి కలిసొచ్చాయి. మరి ఏపీలో అలాంటి రాజకీయ శూన్యత ఉందా? 

రాష్ట్రాన్ని విభజించిన పాపానికి కాంగ్రెస్ ని బంగాళాఖాతంలో కలిపేసిన ఏపీ ప్రజలు, ప్రత్యేక హోదాపై మోసం చేసిన బీజేపీని అప్పుడే క్షమిస్తారా? పాచిపోయిన లడ్డూల్ని జేబులో దాచేసుకున్న జనసేనానికి పట్టం కడతారా? ఇవన్నీ అత్యాశలు, అతిశయోక్తులు మాత్రమే. పక్క రాష్ట్రాల ఫలితాల్ని చూసి జనసేనాని చంకలు గుద్దుకోవడం ఆపేస్తే మంచిది. 

మన ప్రతాపం అంతా ఆంధ్రలోనే