2014లో రింగ్ మాస్టర్ అవుతానని కలలుగన్నారు. కానీ చంద్రబాబు దెబ్బకు సైడ్ అయిపోయారు. 2019లో ఎలాగైనా రింగ్ మాస్టర్ అవ్వాలనుకున్నారు. ఏకంగా తనే ఓడిపోయారు. అయితే ఇప్పుడు నిజంగానే పవన్ కు రింగ్ మాస్టర్ అయ్యే అవకాశం వచ్చింది. అదెలాగో చూద్దాం.
బీజేపీతో అధికారికంగా పొత్తు పెట్టుకున్న పవన్ ను స్థానిక బీజేపీ నేతలు హీరోగా చూస్తున్నారు. ఏపీ బీజేపీలో చెప్పుకోదగ్గ నాయకులు లేరు. మరీముఖ్యంగా ఫేస్ వాల్యూ ఉన్న నేతలు అస్సలుకే లేరు. అలాంటి కాంపౌండ్ లోకి పవన్ ప్రవేశించారు. దీంతో ఆటోమేటిగ్గా పవన్ అక్కడ హీరో అయిపోయారు.
ప్రస్తుతం ఏపీ బీజేపీ మొత్తం పవన్ చుట్టూ తిరుగుతోంది. ఏం చేయాలన్నా, ఎలాంటి ఆలోచననైనా పవన్ తో పంచుకున్న తర్వాతే ముందుకెళ్లాలని నిర్ణయించుకుంది. పైగా కేంద్రం నుంచి ఆదేశాలు కూడా అలానే ఉండడంతో పవన్ మాట శాసనం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలా ఏపీలో తాడు-బొంగరం లేని పార్టీకి రింగ్ మాస్టర్ అయ్యారు పవన్ కల్యాణ్.
ప్రస్తుతం వ్యవహారం ఎంతవరకు వచ్చిందంటే.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎవర్ని నియమిస్తే బాగుంటుందనే అంతర్గత చర్చ కూడా పవన్ వద్దకే వచ్చింది. ప్రస్తుతం ఏపీ బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉన్నారు. అతడి స్థానంలో మరో వ్యక్తిని నియమించాలని అధిష్టానం భావిస్తోంది. ఈ విషయంలో పవన్ సూచనలు-సలహాలు తీసుకోవాలని భావిస్తోంది.
సో.. ఈసారి పవన్ చెప్పే వ్యక్తే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాంగ్ మార్చ్ తర్వాత దీనిపై పవన్ కల్యాణ్ కసరత్తు చేయబోతున్నారు. తన సామాజిక వర్గానికి చెందిన కన్నానే కొనసాగించాలా లేక మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ప్రాధాన్యం ఇవ్వాలా అనే అంశంపై అధిష్టానానికి నివేదిక ఇస్తారు.
ఇవన్నీ చూస్తుంటే.. రాష్ట్ర బీజేపీలో పవన్ రింగ్ మాస్టర్ అయ్యారనే విషయం అర్థమౌతూనే ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన కీలక విషయం ఒకటుంది. బీజేపీ వ్యవహారం ప్రారంభంలో ఇలానే ఉంటుంది. అంతా మన చేతిలోనే పెట్టినట్టు అనిపిస్తుంది. కొన్నాళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే మన చేతిలోనిదే కాదు, వెనకేసుకున్నది కూడా ఉండదు. మహారాష్ట్రతో పాటు ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీ ఇలానే ఏకులా వచ్చి మేకులా మారింది.
ప్రస్తుతం మన రింగు మాస్టర్ పులిపై సవారీ చేస్తున్నారు. కొన్నాళ్లు గడిచిన తర్వాత తెలుస్తుంది ఎవరు ఎవరిపై ఎక్కి సవారీ చేస్తున్నారో!