గృహసారథులు మొక్కుబడి అనుకోకూడదు!

ప్రజల కోసం ప్రతి ప్రభుత్వమూ ఎంతో కొంత పనిచేస్తూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో లో చెప్పిన దానికంటె ఎక్కువ సంక్షేమం చేపడుతున్నాం అని కూడా అంటూ ఉంటారు. అయితే ప్రజల కోసం పనిచేసే…

ప్రజల కోసం ప్రతి ప్రభుత్వమూ ఎంతో కొంత పనిచేస్తూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో లో చెప్పిన దానికంటె ఎక్కువ సంక్షేమం చేపడుతున్నాం అని కూడా అంటూ ఉంటారు. అయితే ప్రజల కోసం పనిచేసే ప్రతి ప్రభుత్వమూ చిరస్థాయిగా మిగిలిపోవడం అంటూ జరగదు. 

ప్రతివారికీ వచ్చే ఏకైక సమస్య.. ప్రభుత్వంగా పనిచేయడంతో పాటు, పార్టీని ప్రజలతో అనుసంధానం చేయడం. ప్రజలతో పార్టీ కూడా మమేకం అయిఉండేలా, ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పథకం గురించి, చేసే ప్రతి పని గురించి ప్రజల్లో నిత్యం చైతన్యం కలిగించేలా యాక్టివ్‌గా ఉంచడంలో చాలా పార్టీలు విఫలం అవుతుంటాయి. ఈ దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అద్భుతమైన నిర్ణయం గృహసారథుల సేవలను వినియోగించుకోవడం.

మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో ఓ సరికొత్త కార్యక్రమానికి అధికార పార్టీ శ్రీకారం చుడుతోంది. ఈ కార్యక్రమం కింద గృహసారథులను రాష్ట్రంలోని ప్రతి ఇంటికి పంపనున్నారు. ప్రభుత్వ పనితీరుగురించి వారిద్వారా ప్రతి ఇంటికి వివరించనున్నారు. ఒక సర్వే వంటి ఫారం ద్వారా.. వారి అభిప్రాయాలను కూడా తెలుసుకోనున్నారు. ఇలాంటి ప్రయత్నం పార్టీని శాశ్వతంగా అధికారంలో కూర్చోబెట్టేదిశగా చాలా గట్టిది. 

కాకపోతే, ప్రతి ఇంటికి గృహసారథి వెళ్లి కరపత్రం చదివి వినిపించి, సర్వే ఫాం నింపి, ఫోటో తీసుకుని వెళ్లిపోవడమే ప్రస్తుత కార్యక్రమంగా ఉంది. ఇలా ఒక కార్యక్రమంలాగా కాకుండా ప్రతినిత్యం తన పరిధిలోని అన్ని కుటుంబాలతో మాట్లాడుతూ కలివిడిగా ఉంటూ, సర్కారు పనులు గురించి చెబుతూ ఉండడం అనేది గృహసారథి విధిగా ఏర్పాటుచేసి ఉంటే బాగుండేది. 

ఎటూ ప్రతి యాభై ఇళ్లకు ఒక గృహసారథిని నియమించారు. అంటే.. చాలా చిన్న పరిధి. ఇంట్లోంచి బయటకు వస్తే.. ఇరుగు పొరుగు ఇళ్లలోని వారంతా కనిపిస్తూనే ఉంటారు. వారితో నిత్యం మాట్లాడుతూ ఉండేలా.. సర్కారు సంగతులను చర్చల్లోకి తెస్తూ ఉండేలా చేసి ఉంటే బాగుండేది. కాస్త ఆలస్యం అయితే అయింది గానీ, మొత్తానికి ఈ ప్రయత్నం జరుగుతోంది. 

పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే.. తమ మీద ఉన్నది మామూలు బాధ్యత కాదు అనే సంగతి గృహసారథులు గుర్తుంచుకోవాలి. ఈ కార్యక్రమం కింద ఇల్లిల్లూ తిరిగిన తర్వాత కూడా.. రాబోయే ఏడాది రోజుల పాటూ తమ తమ పరిధిలోని ప్రజలతో మమేకమై మెలగాలి. అలా చేస్తేనే సత్పలితాలు దక్కుతాయి. ఏదో పార్టీ నిర్దేశించింది కదా అని కార్యక్రమాన్ని మొక్కుబడిగా చేస్తే పెద్ద ఉపయోగం ఉండదని తెలుసుకోవాలి.