పవన్‌ను ‘నీ పని నువ్వు చూస్కో’ అన్నారా?

తాను, తన నెంబర్ టూ నాదెండ్ల మనోహర్ తో కలిసి రెండు రోజుల పాటూ ఢిల్లీలో బిజెపి నాయకుల చుట్టూ తిరిగి సాధించినది ఏమిటో పవన్ కల్యాణ్ స్వయంగా వెల్లడించారు. ‘వైకాపా విముక్త ఏపీ…

తాను, తన నెంబర్ టూ నాదెండ్ల మనోహర్ తో కలిసి రెండు రోజుల పాటూ ఢిల్లీలో బిజెపి నాయకుల చుట్టూ తిరిగి సాధించినది ఏమిటో పవన్ కల్యాణ్ స్వయంగా వెల్లడించారు. ‘వైకాపా విముక్త ఏపీ లక్ష్యంగానే తమ ఎజెండా ఉన్న’దని అన్న పవన్, బిజెపి లక్ష్యం కూడా అదే అంటున్నారే గానీ.. అందుకోసం కలిసి పోరాడబోతున్నాం అనే మాట వాడలేదు. 

రెండు రోజులుగా బిజెపి నాయకులతో జరిగిన చర్చలు రాబోయే రోజుల్లో మంచి సత్ఫలితాలు ఇస్తాయంటూ.. దాని భావం ఏమిటో ఆయనక్కూడా అర్థం కాని రీతిలో ఇంకో డైలాగు సెలవిచ్చారు. పనిలో పనిగా.. ఏపీలో ‘జగన్ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చూడడమే తన జీవితాశయం’ అంటూ.. చంద్రబాబు పల్లకీమోయాలనే పాచిపోయిన లక్ష్యాన్ని మరోమారు ప్రకటించారు పవన్.

రెండురోజుల ఢిల్లీ టూర్ అనంతరం.. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో పవన్ కల్యాణ్ మాటలను గమనిస్తే.. ఎవ్వరికైనా సరే అర్థమయ్యేది ఒక్కటే. తెలుగుదేశంతో కలిసి నడవడానికి, ఆ కూటమిలో చేరడానికి భారతీయ జనతా పార్టీని ఆయన ఒప్పించలేకపోయారు. ఇంకా సూటిగా చెప్పాలంటే.. పవన్ కల్యాణ్ ప్రతిపాదనకు బిజెపి పెద్దలు ‘‘నీ పని నువ్వు చూస్కో’’ అని చాలా మర్యాదగా చెప్పి పంపినట్టుగా కనిపిస్తోంది. 

పవన్ పాపం పార్టీ బలోపేతం గురించిన డైలాగులు కూడా వేశారు. ఏడాదిలో ఎన్నికలు ఉండగా.. ఇప్పటిదాకా నియోజకవర్గాల్లో పార్టీ స్వరూపస్వభావాలు ఎలా ఉన్నయో కూడా తెలియని పవన్.. ‘మమ్మల్ని మేం బలోపేతం చేసుకుంటున్నాం’ అంటూ చెప్పడం ఒక కామెడీ. 

తెలుగుదేశం ఏదో కొన్ని సీట్లు ముష్టిగా పడేస్తే.. చంద్రబాబు పల్లకీ మోసినందుకు ఆ మేరకు కూలీ గిట్టుబాటు అయిందనుకుని ఆసీట్లలో కాలం కలిసొస్తే గెలవాలని ఎదురుచూడడమే తప్ప.. పార్టీని బలోపేతం చేయడం లాంటి పెద్దపెద్ద పదాలు పవన్ కల్యాణ్ ఎందుకు వాడుతున్నారో తెలియదు. మమ్మల్ని మేం బలోపేతం చేసుకుంటున్నాం. బిజెపి బలోపేతం అయ్యేందుకు సంస్థాగతంగా వారే నిర్ణయాలు తీసుకోవాలి.. అంటూ పవన్ చెబుతున్న మాటలు.. ఇద్దరి మధ్య బంధం తెగుతున్నదనడానికి సంకేతాలు. 

మూడు పార్టీలు కలిసి పోటీచేయాలన్నది చంద్రబాబు కోరిక. 2014లో లాగా అధికారంలోకి రావాలని ఆయన ఆశ. అయితే ఆయన స్క్రిప్టును పవన్ కల్యాణ్ తాను కంఠస్థం చేసుకుని వెళ్లి ఢిల్లీ కమలపెద్దల వద్ద అప్పజెప్పారు. ఆ చంద్రస్క్రిప్టును వారు పట్టించుకోలేదు. ఛీ కొట్టారు. 

మా పార్టీ సంగతి మేం చూసుకుంటాం.. నీ పని నువ్వు చూసుకో బాబూ.. ఇప్పుడున్నట్టుగా ఉంటే ఉండు.. లేక‌పోతే నీ ఖర్మ అని అన్యాపదేశంగా సెలవిచ్చారు. అప్పటికీ రెండురోజుల ప్రయత్నాలలో ‘నాకు మొదటినుంచి ఎంతో మంచి మిత్రుడు’ అని పవన్ కల్యాణ్ వర్ణించి వర్ణించి చెప్పుకునే నరేంద్రమోడీని గానీ, అంతే కీలకమైన అమిత్ షా గానీ ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. పవన్ కల్యాణ్ ఎజెండా ఏమిటో, ఎజెండా స్క్రిప్టు రచయిత ఎవరో తెలుసు గనుకనే వారు పవన్ ను కనీసం కలవకుండా దూరం పెట్టారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. 

బిజెపితో చర్చలు భవిష్యత్తులో మంచి చేస్తాయి అంటున్న పవన్ కల్యాణ్ .. ప్రస్తుతానికి వారి చీత్కారం తో తిరిగి హైదరాబాదు చేరుకున్నారు. త్వరలోనే తెలుగుదేశంతో కొత్తబంధాన్ని ప్రకటించి.. ఆ మేరకు ముందుకు పోతారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.