సహజంగా రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో విజయం కిక్ ఇస్తుంది. ఎన్నిక అంటే సమరోత్సాహంతో దూసుకెళ్లాలనే ఊపు ఇస్తుంది. తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం రెండు తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ నాయకులతో పాటు శ్రేణులకు ఓ కిక్ ఇచ్చిందంటే అతిశయోక్తి కాదు.
దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ జయకేతనం ఎగుర వేసిన నేపథ్యంలో ఆ స్ఫూర్తితో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి ఉప ఎన్నికలో విజయం సాధించి సత్తా చాటాలని ఆ రాష్ట్ర బీజేపీ శాఖ పట్టుదలతో ఉంది.
తిరుపతి వైసీపీ బల్లి దుర్గాప్రసాద్‌రావు ఆకస్మిక మృతితో ఆ పార్లమెంట్ స్థానానికి ఎన్నిక అనివార్యం కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నిక జరగనుందని సమాచారం. ఎవరైనా ప్రజాప్రతినిధి ఆకస్మిక మృతి చెందితో, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆంధ్రప్రదేశ్‌లో సంప్రదాయంగా వస్తోంది. అయితే టీడీపీ, వైసీపీ ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ వచ్చాయి.
గతంలో తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ ఆకస్మిక మృతితో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడింది. అప్పట్లో జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ పోటీ చేయలేదు. కానీ కాంగ్రెస్ బరిలో నిలబడడంతో ఎన్నిక అనివార్యమైంది. నేడు బీజేపీ -జనసేన, కాంగ్రెస్ అత్యుత్సాహంతో ఎన్నిక తప్పేలా లేదు.
రాజకీయ పార్టీ అన్న తర్వాత ఎన్నికల్లో విజయం సాధించాలని ఆశించడం ఎవరూ కాదనలేనిది. అయితే ఊరికే కలలు కంటే చాలదు. ఆ కలను సాకారం చేసుకోవాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది. దుబ్బాకలో బీజేపీ విజయం సాధించడం వెనుక అనేక అంశాలు ఆ పార్టీకి కలిసి వచ్చాయి.
కానీ తిరుపతి ఉప ఎన్నికలో విజయం సాధించడం ఆషామాషీ కాదు. ఎందుకంటే తెలంగాణలో క్షేత్రస్థాయిలో ఢీ అంటే ఢీ అని తలపడే శ్రేణులు, నాయకత్వం ఉంది. ఇదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అందుకు పూర్తి భిన్నమైన వాతావరణం బీజేపీలో ఉంది.
తిరుపతి లోక్‌సభ నియోజక వర్గం నుంచి గెలుపొందేందుకు బీజేపీ ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా గురువారం తిరుపతిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ దియోదర్ సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో తిరుపతి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల నేతలు పాల్గొననున్నారు.
తిరుపతి పార్లమెంట్ పరిధిలోకి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. వీటిలో చిత్తూరు జిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి వస్తాయి. ఈ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులే గెలుపొందారు.
తిరుపతి పార్లమెంట్ స్థానం నుంచి మిత్రపక్షమైన జనసేనతో కలిసి పోటీ చేయనున్నట్టు బీజేపీ స్పష్టత ఇవ్వనుంది. ఇందులో భాగంగా జనసేన నాయకులు, శ్రేణులతో సమన్వయం చేసుకుని ఎలా వెళ్లాలనే అంశంపై తమ నాయకులకు బీజేపీ నాయ కత్వం దిశానిర్దేశం చేసేందుకు సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
అయితే తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గంలో బీజేపీలో చెప్పుకోదగ్గ ప్రజానేత ఎవరైనా ఉన్నారా అంటే …శ్రీకాళహస్తికి చెందిన కోలా ఆనంద్ పేరు మాత్రమే వినిపిస్తుంది. ప్రధానంగా రాజకీయ కేంద్రమైన తిరుపతిలో కొంత కాలం క్రితం వరకు శాంతారెడ్డి పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ప్రజా సమస్యలపై వీధి పోరాటాలు చేసిన మహిళా నేతగా ఆమెకు గౌరవం ఉంది.
అయితే వయస్సు రీత్యా ప్రస్తుతం ఆమె యాక్టీవ్‌గా లేరు. ఇక మిగిలిన నేతల విషయానికి వస్తే ఎక్కువగా తిరుపతి విమానాశ్రయంలోనూ, లేదంటే తిరుమల ఆలయం ఎదుట కనిపిస్తారనే విమర్శలున్నాయి. ఆ నాయకులు ప్రస్తుతం రాజ్యాంగ వ్యవస్థలో ఓ కీలక పదవిలో ఉన్న నాయకుడి అనుచరులుగా చెలామణి అవుతున్నారు. పార్టీ అండతో గత ప్రభుత్వంలో టీటీడీలో కీలక పదవిని దక్కించుకున్నారు.
ఆ పదవిని అడ్డం పెట్టుకుని సొంతింటిని చక్క దిద్దుకున్నారే తప్ప … పార్టీని బలోపేతం చేసేందుకు ఏనాడూ ప్రయత్నించలేదని సొంత పార్టీ శ్రేణుల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి.
ఇప్పుడు కూడా తిరుమల దర్శనానికి వచ్చే బీజేపీ అగ్రనేతలకు స్వాగతం పలికేందుకు విమానాశ్రయం, ఆ తర్వాత దేవుని దర్శనం పేరుతో వీఐపీలతో కలిసి తిరుమలలో చక్కర్లు కొట్టడం తప్ప తిరుపతి బీజేపీ నాయకులు చేసేదేమీ లేదని ఆ నగర వాసుల అభిప్రాయం.
సామాన్యులకు తిరుపతి బీజేపీ నేతలు దర్శన భాగ్యం గగనమే. వీళ్లను చూడాలంటే టీవీల్లో లేదా పత్రికల్లో తప్ప మామూలుగా కనిపించడం అరుదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో తిరుపతి పార్లమెంట్‌కు సంబంధించి పార్టీల బలాబలాలను ఒకసారి చూద్దాం.
మొట్ట మొదట 1952లో తిరుపతి లోక్‌సభ స్థానానికి ఎన్నిక జరిగింది. అప్పటి నుంచి 2019 వరకు 16 సార్లు తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 11 సార్లు, టీడీపీ 2 సార్లు, బీజేపీ ఒక దఫా , వైసీపీ 2 సార్లు గెలుపొందింది.
తెలుగుదేశం ఆవిర్భావ సమయంలో 1984లోనూ, అలాగే 1998 లో టీడీపీ తరపున చింతా మోహన్ గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా 1999లో బీజేపీ అభ్యర్థి వెంకటస్వామి ఇక్కడి నుంచి గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు వరప్రసాద్, బల్లి దుర్గాప్రసాద్ గెలుపొందారు.
2004 ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా బీజేపీ తరపున డాక్టర్ ఎన్.వెంకటస్వామి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ తన సమీప బీజేపీ అభ్యర్థిపై 1,01,328 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి 3,11,633 ఓట్లు లభించాయి. ఇక 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కారుమంచి జయరాం టీడీపీ పొత్తులో భాగంగా పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్‌రావు 37,425 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
2019 ఎన్నికల విషయానికి వస్తే వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌రావు తన సమీప టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మిపై 2,28,376 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. 2019లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి బి.శ్రీహరిరావుకు వచ్చిన ఓట్లు 16,125. బీజేపీ కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. నోటాకు వచ్చిన ఓట్లు 25,781. బీజేపీ కంటే నాడు జనసేన మిత్రపక్షమైన బీఎస్పీ అభ్యర్థి దగ్గుమాటి శ్రీహరిరావుకు 20,971 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్‌కు 24,039 ఓట్లు రావడం గమనార్హం.
ప్రస్తుతం తిరుపతి పార్లమెంట్ నుంచి బరిలో దిగాలనుకుంటున్న బీజేపీ మొదట క్షేత్రస్థాయిలో తన శక్తి ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వైసీపీ తరపున దివంగత ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ భార్య లేదా ఆయన తనయుడు కల్యాణ్‌ను నిలబెట్టే అవకాశాలున్నాయి. టీడీపీ తరపున కూడా తప్పని సరి పరిస్థితుల్లో పోటీ ఉంటుందనే వాదన వినవస్తోంది. ఎందుకంటే ఎన్నికల బరిలో లేకపోతే కేడర్ ఇతర పార్టీల వైపు వెళుతుందనే భయం ఆ పార్టీని వెంటాడుతోంది.
తిరుపతి స్థానిక బీజేపీ నాయకులను నమ్ముకుని బీజేపీ ఉప ఎన్నికలో విజయం సాధిస్తామనుకుంటే అంత కంటే అజ్ఞానం మరొకటి ఉండదు. కుక్క తోక పట్టుకుని గోదారిని ఈదాలనుకునే చందంగా తిరుపతి బీజేపీ నాయకుల బలాన్ని పరిగణలోకి తీసుకుని ఎన్నికల గోదారిలో దిగినట్టవుతుంది.
అయితే ఒక్కటి మాత్రం నిజం. తిరుపతి ఉప ఎన్నిక బరిలో పోటీ చేయడం ద్వారా బీజేపీది బలమా? వాపా? అనేది తేలిపోతుంది. తిరుపతి ఉప ఎన్నిక ఫలితం రానున్న ఎన్నికలకు ఎలా సమాయత్తం కావాలో అన్ని పార్టీలకు ఓ గుణపాఠం చెబుతుందని చెప్పక తప్పదు.