ఆవేశంలో కేటీఆర్.. ఆలోచనలో కేసీఆర్

తెలంగాణ రాజకీయాల్లో దుబ్బాక ఎన్నికల ఫలితం పెద్ద సంచలనం. తల ఎగరేసిన టీఆర్ఎస్ శ్రేణులకి దిమ్మ తిరిగింది, అనుమానంతో భయం భయంగా ఉన్న బీజేపీకి కొత్త ధైర్యం వచ్చింది. బీజేపీ హవా చూసి కాంగ్రెస్…

తెలంగాణ రాజకీయాల్లో దుబ్బాక ఎన్నికల ఫలితం పెద్ద సంచలనం. తల ఎగరేసిన టీఆర్ఎస్ శ్రేణులకి దిమ్మ తిరిగింది, అనుమానంతో భయం భయంగా ఉన్న బీజేపీకి కొత్త ధైర్యం వచ్చింది. బీజేపీ హవా చూసి కాంగ్రెస్ మూర్ఛపోయింది. ఇక ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల రణరంగం ముందుంది.

2021 ఫిబ్రవరి వరకు ప్రస్తుత పాలకమండలికి గడువు ఉంది. ఈలోగా ఎన్నికలు నిర్వహించి సత్తా చాటాలని సెంచరీ దాటేయాలని టీఆర్ఎస్ శ్రేణులు కలలుకంటున్నాయి. దుబ్బాక రిజల్ట్ తో  సెంచరీ సంగతి దేవుడెరుగు.. అసలు ఎన్నికల్లో మెజార్టీ సీట్లు వస్తాయా లేదా అనే అనుమానం కూడా పట్టుకుంది.

ఈ నేపథ్యంలో ఎన్నికలకు తొందరపడటం కంటే.. కొన్నాళ్లు వేచి చూడటం మంచిదని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కేటీఆర్ మాత్రం దూకుడుగానే ఉన్నారు. ఎన్నికలకు తాము సర్వం సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. వరద రాజకీయాలు, బురద రాజకీయాలు, నిస్సహాయ మంత్రి అంటూ.. బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. 

ఇవన్నీ దుబ్బాక రిజల్ట్ కి ముందు జరిగిన సంఘటనలు. సింపతీతో గెలవాల్సిన ఎన్నికల్ని కూడా చేజార్చుకునే సరికి.. కేటీఆర్ కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. అయితే ఎన్నికల నుంచి వెనకడుగు వేద్దామని మాత్రం కేటీఆర్ అనుకోవట్లేదట.

కీలకంగా మారిన ఎస్ఈసీ మీటింగ్..

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలతో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈరోజు సమావేశమవుతుంది. 11 రాజకీయ పార్టీలు ఈ సమావేశానికి హాజరై తమ సన్నద్ధత తెలియజేస్తారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎస్ఈసీ ఏర్పాటు చేసిన సమావేశంలో అన్ని పార్టీలు వేర్వేరు సమాధానాలిచ్చాయి. గ్రేటర్ ఎన్నికల విషయం ఈరోజు తేలుతుంది.

జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్నికలకు పార్టీలన్నీ సిద్ధంగా ఉన్నాయా.. కరోనా పేరు చెప్పి వాయిదా కోరతాయా అనేది తేలాల్సి ఉంది. మిగతా పార్టీల విషయం పక్కనపెడితే టీఆర్ఎస్ ఏం చెప్పబోతుందనేదే ఆసక్తికర అంశం.

కేసీఆర్ మీటింగ్ తో మరింత స్పష్టత..

మరోవైపు కేసీఆర్ కూడా ఈరోజు మంత్రులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల విషయమై ఆయన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ మీటింగ్ తర్వాత బల్దియా పోరుపై స్పష్టత వస్తుందని అంటున్నారు.

కేటీఆర్ ఆవేశంలో ఉన్నా.. కేసీఆర్ మాత్రం ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. మిగతా మంత్రులతో కూడా చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు కేసీఆర్.

ఆ మూడే కీలకం..

దుబ్బాక ఫలితం, కార్పొరేటర్ల అవినీతి, హైదరాబాద్ వరదలు.. ఈ మూడూ కేసీఆర్ సన్నద్ధతను ప్రభావితం చేస్తాయని తెలుస్తోంది. కేసీఆర్ వెనకడుగు వేస్తే.. అనివార్యంగా బల్దియా ఎన్నికల షెడ్యూల్ కూడా వాయిదా పడుతుంది.

వేడిలో వేడి.. దుబ్బాక ఫలితంతో జీహెచ్ఎంసీపై జెండా ఎగరేద్దామనుకుంటున్న బీజేపీకి ఇది కచ్చితంగా ఓ స్పీడ్ బ్రేకర్ గా మారుతుంది. 

మన ప్రతాపం అంతా ఆంధ్రలోనే