పవన్ కళ్యాణ్ కు అత్యంత ఆత్మీయుడు దర్శకుడు త్రివిక్రమ్ అన్న సంగతి తెలిసిందే. పవన్ మళ్లీ తెరప్రవేశం చేయడం, దానికి గాను పింక్ సినిమా రీమేక్ ను అనుకోవడం వెనుక కూడా త్రివిక్రమ్ వున్నారని ఇండస్ట్రీలో టాక్ వుంది. దిల్ రాజును, ఈ ప్రాజెక్టును పవన్ దగ్గరకు తీసుకెళ్లడంలో త్రివిక్రమ్ సాయం వుందని కూడా అంటారు. ముందుగా పింక్ రీమేక్ కు స్క్రిప్ట్ త్రివిక్రమ్ నే అందిస్తారని వార్తలు కూడా వచ్చాయి.
ఇవన్నీనిజమో కాదో కానీ, ఆ సినిమా మీద త్రివిక్రమ్ ప్రభావం వుందని మాత్రం ఇప్పుడు బయట పడింది. నిజానికి ఆ సినిమాకు త్రివిక్రమ్ కు సంబంధం లేదు. దానికి నిర్మాత దిల్ రాజు. ఆ బ్యానర్ వేరు. ఆ యూనిట్ వేరు. కానీ ఆ సినిమాకు థమన్ సంగీతం అందిస్తాడని త్రివిక్రమ్ కే ముందు తెలుసంట. ఆ విషయాన్ని ఆయనే ముందుగా త్రివిక్రమ్ కు చెప్పారట. పింక్ రీమేక్ కు నువ్వే మ్యూజిక్ డైరక్టర్ వు అని.
ఈ విషయాన్ని థమన్ నే ఇప్పుడు వెల్లడించేసాడు. అంటే దిల్ రాజు నిర్మాతే అయినా, పింక్ వ్యవహారాలను త్రివిక్రమ్ ప్రభావితం చేస్తున్నారని అనుకోవాల్సి వస్తోంది. అయినా థమన్ మరీ ఏదీ దాచుకోలేకపోతున్నాడు. ఆదికి ముందే తానే మహేష్ బాబు తరువాత సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నా అని చెప్పేసాడు. ఇప్పుడు పింక్ రీమేక్ కు కూడా తానే అని, ఆ విషయం త్రివిక్రమ్ చెప్పారని వెల్లడించేసాడు.
ఇలా అయితే ఎలా థమన్?