సంక్రాంతికి విడుదలైన ఒక కుటుంబ కథా చిత్రానికి ఓ బలమైన దర్శకుడు, ఓ పేరున్న కథానాయకుడు జత కలిస్తే ఎలా వుంటుందనేది 'అల వైకుంఠపురములో' నిరూపించింది. మామూలుగా కంటే జనం భారీ స్థాయిలో థియేటర్లకి తరలి వచ్చిన ఈ పండుగ వేళ 'అల వైకుంఠపురములో' ఫస్ట్ ఛాయిస్ సినిమాగా నిలిచింది. దీంతో తొలి వారంలో చాలా చోట్ల నాన్ బాహుబలి రికార్డులు ఆ చిత్రం సొంతమయ్యాయి. అల్లు అర్జున్‌కి కూడా టాప్ 5 చిత్రాల జాబితాలో చోటు కల్పించిన చిత్రమిది.
ఇప్పటికీ స్ట్రాంగ్‌గా నడుస్తోన్న ఈ చిత్రం ఓవరాల్‌గా 'నాన్-బాహుబలి' రికార్డ్ చేరుకునే అవకాశాలున్నాయి. ఇంత పెద్ద హిట్ సినిమాకి పోటీగా విడుదలైనా, కాంటెంట్ పరంగా మిశ్రమ స్పందన వచ్చినా కానీ పండుగ అడ్వాంటేజ్‌కి తోడు మహేష్ తారాబలం జతకలవడంతో 'సరిలేరు నీకెవ్వరు' కూడా ఒడ్డున పడిపోయింది. వంద కోట్ల పైచిలుకు బిజినెస్ చేసిన ఈ చిత్రానికి బయ్యర్లు సేఫ్ అయిపోతున్నారు కనుక ఈ సంక్రాంతి అందరికీ ఆనందదాయకమయింది.
పెద్ద సినిమాలకి ధీటుగా నిలబడగలదన్న ధీమాతో వచ్చిన 'ఎంత మంచివాడవురా' నాసిరకం కథా విలువలతో ప్రేక్షకుల తిరస్కారానికి గురయింది. రజనీకాంత్‌కి కూడా 'దర్బార్'తో చేదు ఫలితం తప్పలేదు. బాలీవుడ్‌నుంచి 'తన్హాజీ' ఘన విజయాన్ని అందుకుని పీరియడ్ డ్రామాల పట్ల సినీ పరిశ్రమకి నమ్మకాన్ని పెంచింది.