పనిలేని పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నరూ అంటే.. ఢిల్లీలో ఖాళీగా ఉన్నవారందర్నీ కలుస్తూ బొకేలిస్తున్నారట. హడావిడిగా మంగళగిరిలో పరామర్శలు ఆపేసుకుని పవన్ ఢిల్లీ వెళ్తే.. అక్కడేదో రాచకార్యం ఉందని అనుకున్నారంతా. వైసీపీని గద్దె దించే వరకు నిద్రపోను అంటే.. ఢిల్లీ నుంచి ఏదో పెద్ద బ్రేకింగ్ న్యూసే ఉంటుందని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదు సరికదా.. పవన్ కు ఎక్కే గడప, దిగే గడప అన్నట్టుంది పరిస్థితి.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కలవడం, ఆ తర్వాత కొత్త అధ్యక్షుడు జేపీ నడ్డాకి బొకేలివ్వడంతో ఢిల్లీ టూర్ ని ఓ విహార యాత్రగా మార్చేసుకున్నారు పవన్. అయితే ఓ విషయంలో మాత్రం ఆయన పట్టుదలతో ఉన్నారట. ఢిల్లీ నుంచి తిరిగొచ్చేలోగా ప్రధాని మోడీని కచ్చితంగా కలవాలని అనుకుంటున్నారట. గతంలో టీడీపీ, బీజేపీకి గుడ్ బై చెప్పిన తర్వాత పవన్ ఎప్పుడూ ప్రధానిని ఇంతవరకు కలవలేదు.
తాజా పొత్తు నేపథ్యంలో కూడా పక్క రాష్ట్రాల ఎంపీలతో చర్చలు జరిపారు కానీ, ప్రధాని అపాయింట్ మెంట్ మాత్రం ఆయనకు దొరకడం లేదు. అయితే ఆ మధ్య మోహన్ బాబు కుటుంబ సమేతంగా ప్రధాని మోడీని కలవడంతో.. మోహన్ బాబుకి మోడీ ఇచ్చిన ప్రాధాన్యత, పవన్ కి ఇవ్వలేదేంటని చాలామంది చెవులు కొరుక్కున్నారు. పవన్ కి ఈ విషయం చేరిందో లేదో తెలియదు కానీ.. మోడీని కలవకుండా ఏపీకి వెళ్తే తనకే పరువు తక్కువ అని అనుకుంటున్నారట. అందుకే మోడీ అపాయింట్ మెంట్ ఇప్పించండని అందర్నీ అడుగుతున్నారట.
అసలు విషయం ఏంటంటే.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పెద్దలంతా బిజీగా ఉన్నారు. ఒక్కో రాష్ట్రం చేజారిపోతున్న వేళ, ఢిల్లీలో కూడా ఏమాత్రం అవకాశం లేదని సర్వేలు చెబుతున్న వేళ, హస్తిన రాజకీయాలు రసవత్తరంగా మారాయి. దీంతో పవన్ కి పెద్దాయన అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. అయితే పవర్ స్టార్ మాత్రం ఆశలు చంపుకోలేక, వట్టి చేతుల్తో రాష్ట్రానికి రాలేక సతమతమవుతున్నారట.
ఎలాగోలో ఓ ఫొటో లాగించేసుకుని వెళ్తాను, ఐదు నిముషాలు కనికరిస్తే చాలు అని చెప్పుకుంటూ తిరుగుతున్నారట. అన్ కండిషనల్ గా పొత్తు పెట్టుకున్నామని సగర్వంగా చెప్పుకుంటున్న పవన్, ఇలా ఐదు నిముషాల అపాయింట్ మెంట్ కోసం బాధపడటం ఎందుకో.