అబ్బే.. బీజేపీవి వార‌స‌త్వ రాజ‌కీయాలు అనకూడ‌దు!

క‌ర్ణాట‌క భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎన్నిక‌ల అభ్య‌ర్థుల జాబితా ఏదీ ఇప్ప‌టి వ‌ర‌కూ విడుద‌ల కాలేదు. ఎందుకో బీజేపీ ఈ విష‌యంలో తొంద‌ర‌ప‌డ‌టం లేదు. అంతా ఢిల్లీ క‌నుస‌న్న‌ల్లో జ‌రుగుతున్న త‌తంగంలో అభ్య‌ర్థుల జాబితాల‌ను…

క‌ర్ణాట‌క భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎన్నిక‌ల అభ్య‌ర్థుల జాబితా ఏదీ ఇప్ప‌టి వ‌ర‌కూ విడుద‌ల కాలేదు. ఎందుకో బీజేపీ ఈ విష‌యంలో తొంద‌ర‌ప‌డ‌టం లేదు. అంతా ఢిల్లీ క‌నుస‌న్న‌ల్లో జ‌రుగుతున్న త‌తంగంలో అభ్య‌ర్థుల జాబితాల‌ను ఇంకా ఫైన‌లైజ్ చేసిన‌ట్టుగా లేరు. అవ‌త‌ల కాంగ్రెస్, జేడీఎస్ లు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేసి ప్ర‌చారంలోకి వెళ్లిపోతున్నాయి. అయితే బీజేపీ హై క‌మాండ్ మాత్రం ఇంకా తొలి జాబితాను కూడా విడుద‌ల చేయ‌లేదు!

అయితే.. బీజేపీ వాళ్లు ఇంకా అభ్య‌ర్థుల జాబితాను విడుద‌ల చేయ‌క‌పోయినా, షికారిపుర నుంచి త‌న త‌న‌యుడు బీవై విజ‌యేంద్ర‌ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా పోటీలో ఉంటాడంలూ య‌డియూర‌ప్ప ప్ర‌క‌టించేసుకున్నారు. ప్ర‌చారం కూడా మొద‌లుపెట్టేశారు! ఈ నియోజ‌క‌వ‌ర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు య‌డియూర‌ప్ప‌. 

ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లోనూ, ఉప ఎన్నిక‌ల్లోనూ క‌లిపి క‌నీసం తొమ్మిది సార్లు ఈయ‌న గెలిచారు. 1982 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక‌టీ రెండు సార్లు మిన‌హా మిగ‌తా స‌మ‌యం అంతా షికారిపుర ఎమ్మెల్యేగా య‌డియూర‌ప్ప వ్య‌వ‌హ‌రించారు. ఒక్కసారి సొంత పార్టీ నుంచి, మిగిలిన స‌మ‌య‌మంతా బీజేపీ త‌ర‌ఫు నుంచి ఆయ‌న గెలిచారు. 

మ‌ధ్య‌లో ఒక‌సారి ఆయ‌న త‌న‌యుడు బీవై రాఘ‌వేంద్ర ఇక్క‌డ నుంచి నెగ్గారు. అయితే ఈ సారి య‌డియూర‌ప్ప త‌న మ‌రో కుమారుడు విజ‌యేంద్ర‌ను షికారిపుర అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు. బీజేపీ అభ్య‌ర్థుల జాబితా ఏదీ విడుద‌ల కాక‌పోయినా.. య‌డియూర‌ప్ప ఇలా త‌న త‌న‌యుడిని అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించేసి ప్ర‌చారం కూడా మొద‌లుపెట్టేయ‌డం ఆస‌క్తిదాయ‌కంగా మారింది.

మ‌రి వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకం అంటూ బీజేపీ నేత‌లు రోజుకు ప‌ది సార్లు ప్ర‌క‌టిస్తారు. వార‌స‌త్వ పార్టీల‌పై త‌మ పోరు అని ప్ర‌క‌టిస్తూ ఉంటారు. క‌ట్ చేస్తే.. క‌నీసం బీజేపీ అభ్య‌ర్థుల జాబితా కూడా వెల్ల‌డికాకుండానే య‌డియూర‌ప్ప త‌న త‌న‌యుడు తన స్థానంలో పోటీ చేస్తారంటూ ప్ర‌క‌టించేసుకుని ప్ర‌చారం కూడా మొద‌లుపెట్టేశారు. మ‌రి ఇలాంటి దృశ్య‌మే మ‌రో పార్టీలో ఉండి ఉంటే.. బీజేపీ ఎద్దేవా మామూలుగా ఉండేది కాదు.