అన‌గ‌న‌గా ఒక ఎలుక‌

ఎలుక ఒక చిన్న ప్రాణం. వినాయ‌క విగ్ర‌హం ద‌గ్గ‌రుంటే దండం పెడ‌తాం. ఇంట్లో వుంటే బోను పెడ‌తాం. టామ్ అండ్ జెర్రీ షోలో పిల్ల‌ల‌కే కాదు, పెద్ద వాళ్ల‌కి కూడా చిట్టెలుక అంటే ఇష్టం.…

ఎలుక ఒక చిన్న ప్రాణం. వినాయ‌క విగ్ర‌హం ద‌గ్గ‌రుంటే దండం పెడ‌తాం. ఇంట్లో వుంటే బోను పెడ‌తాం. టామ్ అండ్ జెర్రీ షోలో పిల్ల‌ల‌కే కాదు, పెద్ద వాళ్ల‌కి కూడా చిట్టెలుక అంటే ఇష్టం. దాని ప్ర‌స్తావ‌న ఇప్పుడెందుకంటే ఏప్రిల్ 4, ప్ర‌పంచ ఎలుక‌ల దినం. ప్ర‌కృతిలోని అన్ని ప్రాణులు బ‌తికితేనే స‌మ‌తుల్య‌త‌. ఎలుక‌ని కూడా ప్రేమించి, సంర‌క్షించాల‌ని ఈ ఎలుక‌ల దినం జ‌రుపుతారు.

గ‌తంలో చైనాలో ఎలుక‌ల్ని శ‌త్రువులుగా చూసి పంట‌ల్ని తినేస్తున్నాయ‌నే కోపంతో మూకుమ్మ‌డిగా చంప‌డం స్టార్ట్ చేశారు. దాంతో తిండి లేక పాములు అంత‌రించిపోవ‌డం మొద‌లైంది. పాముల్ని తినాలంటే ఎలుక‌లు బ‌తికి వుండాల‌ని త‌ప్పు దిద్దుకున్నారు. వాళ్ల సంగ‌తి స‌రే కానీ, మ‌న‌కి మాత్రం ఎలుక లివింగ్ టుగెద‌ర్‌.

పిల్లికి చెల‌గాటం, ఎలుక‌కి ప్రాణ సంక‌టం అనేది సామెత‌. గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీసుల్లో అధికారులు  పిల్లులు, గుమాస్తాలు ఎలుక‌లు. కాలేజీలో సీనియ‌ర్లు పిల్లులు. జూనియ‌ర్లు ఎలుక‌లు. డైరెక్ష‌న్ డిపార్ట్‌మెంట్‌లో డైరెక్ట‌ర్ పిల్లి, అసిస్టెంట్ డైరెక్ట‌ర్లు ఎలుక‌లు.

ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా, అంటారు కానీ, అద‌స‌లే ఎలుక‌, దాని తోలు తెచ్చి ఉత‌కాల్సిన అవ‌స‌రం ఏంటి? ఎలుక‌ని ప్రేమించ‌డం న్యాయ‌మే. అదేం టూత్‌పేస్ట్ వాడుతుందో తెలియ‌దు కానీ, దంత‌బ‌లం ఎక్కువ‌. మ‌న కొత్త చొక్కాని కొరికి రంధ్రాన్వేష‌ణ చేస్తుంది. పొలిటీషియ‌న్ కంటే వేగంగా న‌మిలేస్తుంది. కొన్ని జ్ఞాన ఎలుక‌లుంటాయి. అవి మ‌న‌కంటే ఎక్కువ చ‌దువుతాయి. భారం ఎక్కువై చ‌ర్చ‌ల‌కు కూడా దిగుతాయి.

ఒక‌సారి టీవీ చాన‌ల్ వాళ్లు అవినీతిపై చ‌ర్చ పెట్టి ఒక ఎలుక‌ని గెస్ట్‌గా పిలిచారు. అది త‌న వాద‌న‌ని ఇలా వినిపించింది.

“సార్, తిన‌డం వేరు, ఆర‌గించి అరిగించుకోవ‌డం వేరు. మేం కేవ‌లం తింటాం. నాయ‌కులు ఆర‌గిస్తారు. గోదాముల్లో మేము తినేదానికంటే, మా పేరుతో తినేదే ఎక్కువ‌. రైతులు ఎప్పుడైతే వ్య‌వ‌సాయం మానేసారో, మాకూ గిట్టుబాటుకాక ప‌ట్నాలు చేరిపోయాం. చ‌దువూసంద్య నేర్చుకుని గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీసుల్లో కుదురుకున్నాం. ఒక స‌ర్వే ప్ర‌కారం చాలా కార్యాల‌యాల్లో మ‌నుషుల కంటే మా ఎలుక‌లే ఎక్కువ ఉన్నాయ‌ట‌. మాకు అమ్యామ్యా అంటే అస‌హ్యం. మ్యామ్యా అనేది మా శ‌త్రువు పిల్లి భాష‌. జ‌స్ట్‌ చేతిని త‌డుపుకుంటాం అంతే. కొన్ని ప్ర‌భుత్వ ఎలుక‌లు జీర్ణ‌శ‌క్తిని పెంపొందించుకుని ఏనుగులుగా కూడా రూపాంత‌రం చెందాయ‌ని తెలిసింది. డార్విన్‌కి మ‌నుషుల గురించే తెలుసు కానీ, ఎలుక‌ల గురించి తెలియ‌దు. తెలిస్తే ప‌రిణామ సిద్ధాంతాన్ని మార్చుకునే వాడు.

డిజిట‌ల్ యుగంలో మౌస్‌కి ఉన్న ప్రాముఖ్య‌త మీకు తెలుసు. కంప్యూట‌ర్ ద్వారా రాజ‌కీయాలు నేర్చుకుని అన్ని పార్టీల్లో మా వాళ్లున్నారు. మా న‌డ‌క‌ని ర్యాట్‌వాక్ అంటారు” మాట్లాడ్డం ఆపిన ఎలుక కాసిన్ని మంచి నీళ్లు తాగి అక్క‌డున్న “రేటింగ్ విత్ ర్యాట్స్” అనే పుస్త‌కాన్ని న‌మిలి తినేసింది.

ఆ యాంక‌ర్ ఆశ్చ‌ర్య‌పోయి ఎలుక‌కి పోటీగా పిల్లిని డిస్క‌ష‌న్‌కి పిలిచి గొడ‌వ పెట్టాల‌నుకుంది. ఈ కుట్ర గ్ర‌హించిన ఎలుక మైకుని కొరికి పారిపోయింది.

వ్య‌వ‌స్థ‌లో ఎలుక‌లు భాగ‌మైన‌ప్పుడు పిల్లులు మాయ‌మైపోతాయి. పిల్లే ఎలుక‌ మెడ‌లో గంట క‌ట్టి, ఆ శ‌బ్దానికి పారిపోతుంది. ఎలుక‌ల దినోత్స‌వానికి అభినంద‌న‌లు.

జీఆర్ మ‌హ‌ర్షి