శాసన మండలిలో జగన్ సర్కార్కు అండగా నిలిచిన టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత గురువారం జగన్ సమక్షంలో తన భర్త పోతుల సురేష్తో కలసి వైసీపీలో చేరారు. పోతుల సునీతతో పాటు మండలిలో జగన్ సర్కార్కు కడప జిల్లాకు చెందిన దేవగుడి శివనాథరెడ్డి కూడా అండగా నిలిచాడు. పార్టీ విఫ్ను ధిక్కరించి వైసీపీకి అనుకూలంగా ఓటు వేశాడు.
ఈ నేపథ్యంలో వైసీపీలో దేవగుడి శివనాథరెడ్డి ఎప్పుడు చేరుతారనే ప్రశ్న వినిపిస్తోంది. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడే శివనాథరెడ్డి. మాజీ మంత్రి ఆదికి, జగన్కు మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వైసీపీ తరపున జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణరెడ్డి, ఆ తర్వాత టీడీపీలోకి జంప్ అయ్యాడు. అంతేకాదు , మంత్రి పదవి కూడా దక్కించుకున్నాడు. అసెంబ్లీలో జగన్పై ఇష్టానుసారం మాట్లాడాడు.
ఆదిని పార్టీలో చేర్చుకోవడంతో, అదే నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవిని చంద్రబాబు కట్టబెట్టాడు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కడప పార్లమెంట్ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి, జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థిగా రామసుబ్బారెడ్డి నిలిచారు. ఈ సందర్భంలో రామసుబ్బారెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాడు. ఆ పదవిని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడైన శివనాథరెడ్డికి కట్టబెట్టారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి ఓడిపోయాడు. అలాగే రాష్ట్రంలో టీడీపీ అధికారం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రాజకీయంగా బీజేపీ సురక్షితమని భావించిన ఆదినారాయణరెడ్డి, ఇటీవల ఆ పార్టీలో చేరాడు. కానీ ఆదినారాయణరెడ్డి సోదరులు మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ శివనాథరెడ్డి మాత్రం చేరలేదు. అంతేకాకుండా ఇటీవల ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన సీఎం జగన్ను దేవగుడి సోదరులు పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో అప్పటి నుంచి దేవగుడి సోదరులు వైసీపీలో చేరుతారనే విస్తృత ప్రచారం సాగుతోంది.
మూడు రోజుల క్రితం శాసనమండలిలో శివనాథరెడ్డి వైసీపీకి మద్దతుగా నిలిచాడు. పార్టీ విఫ్ను ధిక్కరించిన శివనాథరెడ్డి, పోతుల సునీతపై చర్య తీసుకోవాలని టీడీపీ నోటీస్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోతుల సునీత్ వైసీపీలో చేరారు. ఇక శివనాథరెడ్డి వంతు మిగిలింది. ఆయన చేరిక ఎప్పుడనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది.