ఛీ కొట్టినా ‘ఆంధ్రజ్యోతి’ సిగ్గులేని రాతలు రాస్తూనే ఉంది. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ తన ఆరాధ్య దైవం చంద్రబాబుకు అక్షర పూజ చేస్తోంది. కులం, మతాలకు సంబంధించిన సున్నిత విషయాలను రాసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలనేది జర్నలిజంలో ప్రాథమికంగా పాటించాల్సిన నైతిక విలువ. కానీ ఆంధ్రజ్యోతికి ఇవేవీ పట్టనట్టుంది. అయినా ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ అనే సామెత చందానా , ప్రతి వారం కులం ప్రస్తావన లేని ‘కొత్త పలుకు’ రాస్తున్న తమ ఎండీ ఆర్‌కేను ఆ పత్రికా ప్రతినిధులు ఆదర్శంగా తీసుకున్నట్టున్నారు.
శాసనమండలి చైర్మన్ షరీఫ్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ శాసనమండలిలో ‘నువ్వు సాయిబుకే పుట్టావా?’ అనే శీర్షిక, ‘నీ అంతు చూస్తా ’ ఉపశీర్షికతో ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ఓ వార్తను గురువారం క్యారీ చేసింది. దీనిపై షరీఫ్ స్పందిస్తూ ‘శాసనమండలిలో నాపై ఎవరి ప్రలోభాలు లేవు. మంత్రులు, ఇతర సభ్యులు నన్ను వ్యక్తిగతంగా దూషించారని అనుకోవడం లేదు. కొంత ఆవేశంలో మాట్లాడినవే తప్ప…ఉద్దేశ పూర్వకంగా చేసినవి కావు’ అని స్పష్టంగా చెప్పారు.
షరీఫ్ చెప్పిన నిజం అలా ఉంటే, ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా వచ్చిన వార్తపై కొందరు మైనార్టీలు స్పందించారు. దీనిపై ఇదే ఆంధ్రజ్యోతిలో ‘బొత్సపై భగ్గు’ అనే శీర్షిక కింద మరో వార్తను ముందురోజు ప్రచురితమైన కథనానికి రియాక్షన్ ఏంటో ఇచ్చారు. ఈ కథనానికి ‘షరీఫ్‌ను మంత్రి దుర్భాషలాడటంపై రాష్ట్రమంతా రోడ్డెక్కిన ముస్లిం సంఘాలు’ అనే ఉపశీర్షిక ఇచ్చారు.
‘రాజధాని బిల్లుపై శాసనమండలిలో చర్చ సందర్భంగా మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ దుర్భాషలాడడంపై ముస్లిం మైనార్టీలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. నువ్వు సాయిబుకే పుట్టావా? నీ అంతు చూస్తా అని టీడీపీ ఎమ్మెల్సీలు వెల్లడించారు. దీనిపై రాష్ట్ర మంతా బొత్సకు వ్యతిరేకంగా ముస్లిం మైనార్టీలు, టీడీపీ నేతలు ఎక్కడికక్కడ నిరసనలు తెలిపారు. తుళ్లూరులో మంత్రి దిష్టిబొమ్మను ఊరేగించారు’ ……ఇలా సాగింది కధనం.
ఒకవైపు షరీఫ్ తనను ఎవరూ దూషించలేదని నెత్తీనోరూ కొట్టుకుని చెబుతుంటే, మరోవైపు అనని విషయాన్ని అన్నారని, టీడీపీ ఎమ్మెల్సీలు చెప్పారని సున్నితమైన అంశాన్ని రాసి, మతం ప్రాతిపదికన విద్వేషాలు రెచ్చగొట్టడం ఎలాంటి నైతికతో ఆంధ్రజ్యోతి చెప్పాలి? ఏపీలో రీడర్‌షిప్‌లో ఆంధ్రజ్యోతి 20 శాతం పతనం చెందింది. ఇలాంటి సిగ్గుమాలిన, నీతిలేని రాతల వల్లే పతనం ప్రారంభమైందనే విషయాన్ని గుర్తిస్తే మంచిది. కనీసం ఇప్పటికైనా కుల, మత సామరస్యాన్ని కాపాడాల్సిన మీడియా, విద్వేషాలను రెచ్చగొట్టడం తలదించుకోవాల్సిన పని గమనించాల్సి ఉంది.