ఇదేం సిగ్గులేని డిమాండ్.. బోండా గారూ!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాల మీద పచ్చ మీడియా మరియు తెలుగుదేశం పార్టీ తమకు తోచిన రీతిలో ముమ్మరమైన విషప్రచారం చిరకాలంగా సాగిస్తోంది. అయితే తమ ప్రచారం ఫలించడం లేదని, పాచిక పారడం…

వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాల మీద పచ్చ మీడియా మరియు తెలుగుదేశం పార్టీ తమకు తోచిన రీతిలో ముమ్మరమైన విషప్రచారం చిరకాలంగా సాగిస్తోంది. అయితే తమ ప్రచారం ఫలించడం లేదని, పాచిక పారడం లేదని అర్థమైనప్పుడు.. వారు బాధపడడం సహజం. అయితే తాము చెబుతున్న మాటలు, చేస్తున్న దుష్ప్రచారాలు అబద్ధాలు అని తేలిపోతున్న కొద్దీ ఆ పార్టీ వారిలో అసహనం పెరిగిపోతున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే టీడీపీ కీలకనేతల్లో ఒకరైన బోండా ఉమా..  అర్థంపర్థంలేని, అసంబద్ధమైన ఒక సిగ్గులేని డిమాండ్ తో తాజాగా జగన్ ను సవాలు చేస్తున్నారు. 

‘తాము ఇచ్చిన హామీల్లో 87 శాతం అమలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న జగన్ రెడ్డికి ఉన్నపళంగా ఎన్నికలకు వెళ్లే దమ్ముందా’ అని బోండా ఉమా సవాలు చేస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో నిలబెట్టడానికి అభ్యర్థులు లేకపోవడం వల్లనే తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారంటూ తన స్థాయి తెలివితేటలతో కూడిన విశ్లేషణలు చేస్తున్నారు. 

ఇక్కడ తమాషా ఏంటంటే.. ప్రజలకు ఇచ్చిన హామీల్లో 87 శాతం నెరవేరిస్తే.. ఆ ప్రభుత్వం వెంటనే ఎన్నికలకు వెళ్లాలా? ఇచ్చిన మాట నూరుశాతం నిలబెట్టుకున్న సర్కారు.. వెంటనే ఎన్నికలకు వెళ్లాలన్నట్టుగా బోండా డిమాండు కామెడీగా ఉంది. ప్రజలు జగన్ కు అయిదేళ్లు పాలన సాగించడానికి అవకాశం ఇచ్చారు. హామీలు నెరవేర్చిన వాళ్లు ప్రజల తీర్పును అగౌరవించాలని, తిప్పికొట్టాలని బోండా తలపోస్తున్నారో ఏమో తెలియదు. 

తెలుగుదేశం పార్టీ కట్టు తప్పిపోతోంటే.. నాయకులు పార్టీని వీడిపోకుండా జాగ్రత్త పడడానికి చంద్రబాబునాయుడు రెండు సంవత్సరాలుగా ముందస్తు ఎన్నికల పాట పాడుతున్నారు. జగన్ ముందస్తుకు వస్తారంటూ పార్టీని హెచ్చరిస్తున్నారు. అయితే తొలినుంచి .. ముందస్తు అన్నది లేనేలేదని వైసీపీ నాయకులు అంటూనే ఉన్నారు. 

తాజాగా చంద్రబాబునాయుడు ముందస్తు ప్రచారాలకు కూడా ఇలాంటి ప్రతిస్పందనే వచ్చింది. ఎన్నికలు షెడ్యూలు ప్రకారమే జరుగుతాయని జగన్ విస్పష్టంగా ప్రకటించారు. దీంతో తెలుగుదేశం బోల్తా పడింది. తమ ముందస్తు పాచిక ఇక పారదని తెలుసుకుంది. 

తామే ఒక అబద్ధాన్ని ప్రచారంలో పెట్టి, అది అబద్ధం అని నిరూపణ అయిన తర్వాత.. దాన్ని నిజం చేయడం కోసం ముందస్తుకు వచ్చే దమ్ముందా అని సవాళ్లు విసరడం సిగ్గులేని డిమాండ్ కాక మరేమిటి? బోండా ఉమా పిచ్చిమాటలు చూసి జనం నవ్వుకుంటున్నారు.