ఇగ్నోరెన్స్ ఈస్ ది బెస్ట్ మెడిసిన్ అనేది ఇంగ్లిష్ నానుడి. కొన్ని సార్లు మన చుట్టూ జరుగుతున్న విషయాలను పట్టించుకోకపోవడమే, ఆయా సమస్యలు పెరగకుండా ఉండేందుకు దోహదపడుతుంది. సరిగ్గా సీఎం జగన్ ఇప్పుడు అదే పనిచేస్తున్నట్టు అనిపిస్తోంది. తన పార్టీలో రోజురోజుకు పెరుగుతున్న గిల్లికజ్జాల్ని ఆయన ప్రస్తుతానికి చూసీచూడనట్టు వదిలేస్తున్నారు.
ముందుగా మంత్రిపదవుల పంపకంతోనే వైసీపీలో అసమ్మతి స్వరం బైటకొచ్చింది. వైఎస్సార్ హయాంలో కీలక శాఖల్లో పనిచేసిన ఆనం రామనారాయణ రెడ్డి, జగన్ కేబినెట్ లో కూడా మంచి పోర్ట్ ఫోలియో ఆశించారు. చివరకు అసలు బెర్తే ఖాళీలేదని తెలిసి డీలా పడ్డారు.
తన జిల్లాల్లో తమ కుంటుంబం రాజకీయాల్లోకి తెచ్చిన జూనియర్లకు పదవులిచ్చి, తనని కించపరిచారనే ఉద్దేశంతో అలిగారు. నేరుగా మంత్రులపైనే విమర్శనాస్త్రాలు సంధించారు. తీరా జగన్ ఆగ్రహ జ్వాలకు బలయ్యే ప్రమాదం ఉందని తెలిసి వెనక్కి తగ్గారు.
ఆ తర్వాత ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరీ ఓవరాక్షన్ చేస్తున్నారు. అసలు జగన్ ఫొటోతోటే తాను గెలవలేదని కాలరెగరేశారు. అయితే జగన్ రాజుగారిని కనీసం పట్టించుకోలేదు, పలకరించలేదు. దీంతో.. పచ్చమీడియా అండతో తనకి తాను సామంతరాజుగా ప్రకటించుకుని జగన్ పై అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు.
ఇక తనకు అనుకూలంగా మారిన టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మొదలైన గొడవల్ని కూడా జగన్ చూసీ చూడనట్టు వదిలేశారు. గన్నవరంలో వంశీ వ్యవహారంలో కలుగజేసుకున్నా.. అది సర్దుబాటు కాలేదని తెలుస్తోంది. చీరాలలో కరణం, ఆమంచి గొడవ ముదిరి పాకాన పడింది. ఇరువర్గాలు బాహాబాహీకి దిగినా అధిష్టానం పిలిపించి పంచాయితీ పెట్టలేదు, జస్ట్ పట్టించుకోలేదంతే.
అటు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కూడా తమకు నియోజకవర్గాల్లో గుర్తింపు కావాలని కోరుతున్నారట. ఇంచార్జిలతో తలనొప్పిగా ఉందని, తమకు కూడా కరణంలాగే పవర్ చేతిలో పెట్టాలని అభ్యర్థిస్తున్నారట.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి వ్యవహారం మరో ఎత్తు. ఏకంగా వైసీపీ కార్యకర్తలే ఆమెపై ఆరోపణలు చేస్తున్నారు. ఇక గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వ్యవహారం కూడా ముదిరి పాకాన పడుతోంది. స్థానిక కార్యకర్తలు, నాయకులతో ఆయనకు పొసగడంలేదు. అవసరమైతే బీజేపీలోకి పోతానంటూ ఆయన హెచ్చరించినట్టు వార్తలొస్తున్నాయి.
మొత్తమ్మీద 151 సీట్ల నిండుకుండ ఇప్పుడిప్పుడే తొణుకుతోంది. జగన్ ఇప్పుడు ఈ పంచాయితీలు పెట్టుకుంటే కష్టమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలనను పరుగులు పెట్టిస్తున్న జగన్.. ఇప్పుడీ తేనెతుట్టెను కదిపితే టీడీపీకి ఏరికోరి ఆయుధం అందించినట్టవుతుందని చెబుతున్నారు. మరో ఏడాది పాటు ఇలాంటి వ్యవహారాల్ని జగన్ చూసీచూడనట్టు ఊరుకోవడమే మంచిదని సూచిస్తున్నారు.
అయితే జగన్ కూడా ఇవేవీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. పట్టించుకుంటే గొడవలు మరీ పెద్దవి అవుతాయనే ఉద్దేశంతో.. వేటినీ పట్టించుకోనట్టే పక్కనపెట్టేస్తున్నారు. తన పేరుతో చక్కదిద్దే బాధ్యత పార్టీ పెద్దలకు అప్పగించారు.