చావు తప్పి కన్ను లొట్టబోయిన తరహాలో బిహార్ లో ఎన్డీయే కూటమి విజయం సాధించింది. 122 మ్యాజిక్ ఫిగర్ కాగా, 125 సీట్లను సాధించింది ఎన్డీయే కూటమి. ఈ కూటమిలో పలు పార్టీలు. బీజేపీ అతి పెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీకి 75 సీట్లు రాగా, జేడీయూకు 43 సీట్లు, హెచ్ఐఎం 4, వీఐపీ 3 సీట్లు సాధించాయి.
జేడీయూ ముఖ్యనేత నితీష్ కుమార్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా మొదటి నుంచి బీజేపీ చెప్పుకుంటూ వచ్చింది. తమకు ఎన్ని సీట్లు వచ్చినా, జేడీయూకు ఎన్ని సీట్లు వచ్చినా నితీషే ముఖ్యమంత్రి అని బీజేపీ ప్రచారం చేసింది. అయితే ప్రజలు నితీష్ ను తిరస్కరించిన వైనం స్పష్టం అవుతోంది. బీజేపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో దాదాపు సగం సీట్లకు జేడీయూ పోటీ చేయగా.. వచ్చింది 43 సీట్లు మాత్రమే. జేడీయూ పోటీ చేసిన సీట్లో మూడో వంతు చోట్ల మాత్రమే నెగ్గింది.
ఎన్డీయే కూటమికే ప్రజలు నామమాత్రపు మద్దతును ఇచ్చారు. ఒకవేళ అలాంటి నామమాత్రపు మెజారిటీ ఏ ఆర్జేడీ కూటమికో దక్కి ఉంటే.. వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టం అయ్యేది, ఒకవేళ ఏర్పాటు చేసినా మధ్యప్రదేశ్ తరహాలో బీజేపీ వాళ్లు కూలగొట్టే వారు కూడా!
నితీష్ కు 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. పదవి కోసం ఆయన ఇప్పుడు పాకులాడకూడదు అనుకుంటే.. ప్రజాతీర్పు ప్రకారం సీఎం పదవిని తీసుకోరు. బీజేపీ-జేడీయూల కూటమి ప్రభుత్వం ఏర్పడినా.. మరొకరిని ముఖ్యమంత్రిగా ఎంచుకొమ్మని ఆయన తప్పుకోవచ్చు. ఆల్రెడీ ఇవే తన చివరి ఎన్నికలు అని ఆయన ప్రకటించుకున్నారు. అలాంటప్పుడు తన పార్టీ చిన్న పార్టీ అయ్యాకా ఈ కూటమిలో ఆయన సీఎం అయినా, కాకపోయినా పెద్ద తేడా లేదు. తప్పుకుంటే గౌరవప్రదంగా ఉంటుందేమో!
ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడినా.. బీజేపీ పెద్ద పార్టీ కావడంతో పాలన అంతా ఢిల్లీ నుంచినే సాగే పరిస్థితి ఏర్పడవచ్చునేమో! బీజేపీ నేతలు మాత్రం తాము నితీష్ నే సీఎంగా చేస్తామంటూ ప్రకటిస్తున్నారు. మోడీ, అమిత్ షా, నడ్డాలు ఎన్నికల ముందు చెప్పిన మేరకు నితీష్ కుమార్ ఇప్పుడు సీఎం అవుతారనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. నితీష్ కుమార్ నుంచి కూడా సీఎం పీఠాన్ని అధిష్టించే ఆసక్తే వ్యక్తం అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.