బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అనేక అంశాలను ప్రస్తావించారు. అందులో తమ ప్రభుత్వ ఘనతలుగా ఆయన ప్రచారం చేసుకున్న అంశాలూ ఉన్నాయి. ఆర్టికల్ 370 రద్దును బిహార్ ఎన్నికల్లో ప్రముఖంగా ప్రస్తావించారు మోడీ.
కశ్మీర్ లో తాము ఆర్టికల్ 370ని రద్దు చేస్తే, బిహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కొన్ని పార్టీలు దాన్ని పునరుద్ధరిస్తామని అంటున్నాయని మోడీ ఎన్నికల ప్రచార సభల్లో పేర్కొన్నారు. కశ్మీర్ కు సంబంధించిన అంశాన్ని బిహార్ ఎన్నికల ప్రచారంలో అలా బాగా వాడారు మోడీ. సరిహద్దుల్లో మరణించిన బిహార్ సైనికులను ఆ పార్టీలు అవమానిస్తున్నాయని మోడీ విమర్శించారు.
ఆర్జేడీ అధికారంలోకి వస్తే మళ్లీ ఆటవిక పాలన అన్నారు, తమది డబుల్ ఇంజన్ సామర్థ్యమున్న బండి అన్నారు…ఎప్పుడో ముగిసిన లాలూ పాలన గురించి అనేక సార్లు ప్రస్తావించారు. అటు భావోద్వేగాలను రేపే ప్రసంగాలను, ఇటు అభివృద్ధి అనే మాటలను మోడీ మాట్లాడారు. గతంలో బిహార్ ఎన్నికల ప్రచారంలో ఎప్పుడూ తమకు కనిపించనంత జోష్ ఇప్పుడు కనిపిస్తోందని మోడీ చెప్పుకున్నారు.
ఇలా బీజేపీ సెంటిమెంట్ మార్కు అన్ని అస్త్రాలనూ మోడీ బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సంధించారు. అయితే.. ఫలితాలు మాత్రం ఆ సెంటిమెంట్ స్థాయిలో రాకపోవడం గమనార్హం!
తను రెండోసారి ప్రధానమంత్రి అయ్యాకా తీసుకున్న అనేక నిర్ణయాలను ఆయన ప్రస్తావించి ఓటడిగారు. అయితే.. బిహారీల స్పందన మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ప్రత్యేకించి మోడీ ముందు పిల్లికూనలాంటి వ్యక్తి తేజస్వి యాదవ్.
వయసు, రాజకీయ అనుభవం, మీడియా ప్రొజెక్షన్.. ఇలా ఏ రకంగానూ తేజస్వి యాదవ్ మోడీ ముందు, నితీష్ ముందు పనికిరాడు! అసలు మెజారిటీ మీడియా వర్గాలు తేజస్విని చూపించడానికి కూడా ఆసక్తి చూపలేదు! పోలింగ్ ఆఖరి దశకు వచ్చే వరకూ.. కూడా తేజస్వి యాదవ్ ను సత్తా చూపిస్తాడనే మాట కూడా వినపడలేదు. ప్రీ పోల్ సర్వేలన్నీ.. ఎన్డీయేకు రికార్డు స్థాయి మెజారిటీ అని ప్రచారం చేసి పెట్టాయి!
ఇలా పై పై మేనేజ్ మెంట్ లో తేజస్వి ఎవరి ప్రాధాన్యతనూ సంపాదించుకోలేకపోయాడు. దానికి తోడు 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆర్జేడీకి ఎదురైన ఘోర పరాజయం. ప్రస్తుతం లోక్ సభలో ఆ పార్టీకి ప్రాతినిధ్యమే లేదు!
ఆర్జేడీ తన రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేనంత దారుణమైన స్థితిలో ఈ ఎన్నికలను ఎదుర్కొంటే, బీజేపీ తన చరిత్రలో ఎన్నడూ లేనంత గొప్ప స్థితిలో ఉండి ఈ ఎన్నికలను ఎదుర్కొంది! కట్ చేస్తే.. పోటీ మాత్రం ఈ రెండు కూటముల మధ్యనా నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. మోడీ, నితీష్ లాంటి ఉద్ధండులను, తన తండ్రి ప్రత్యర్థులను, తనకంటూ ఎలాంటి బ్యాకప్ లేకుండా తేజస్వి యాదవ్ ఎదుర్కొన్నాడు.
అంతిమంగా విజయం సాధించలేకపోయినా.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆర్జేడీనే నిలిచింది! మోడీ అన్ని మాటలు చెప్పినా, నితీష్ ను అంతగా చూపించినా.. జనం మాత్రం తేజస్విపై వైపే నిలిచారు. ఓట్ల శాతంలో కూడా ఆర్జేడీతో బీజేపీ-జేడీయూలు సోలోగా పోటీ పడలేకపోయాయి! కూటమిగా మాత్రం ఎన్డీయే 40 శాతం ఓట్లను పొందగా, ఆర్జేడీ కూటమి 37 శాతం ఓట్లను పొందింది.
ఆర్జేడీ ఫెయిల్యూర్స్ లో ఒక ప్రధాన కారణం కాంగ్రెస్ కు అన్ని సీట్లను కేటాయించడం అనే మాట వినిపిస్తూ ఉంది. కమ్యూనిస్టులైనా ఆర్జేడీ మద్దతుతో సీట్లను నెగ్గగలిగారు. కానీ కాంగ్రెస్ తమ గత నంబర్ మేరకు కూడా సీట్లను సంపాదించలేకపోయింది.
ఒకవేళ కాంగ్రెస్ ను పూర్తిగా పక్కన పెట్టి ఉన్నా, సీట్లను తగ్గించి ఉన్నా.. ఆ స్థానాల్లో ఆర్జేడీనే పోటీకి దిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో! డెబ్బై స్థానాల వరకూ పోటీ చేసిన కాంగ్రెస్ 20 సీట్లను కూడా నెగ్గలేక కూటమి అవకాశాలను దెబ్బ తీసింది.