అనంత‌లోనూ అంతంత మాత్ర‌మేనా లోకేషూ!

తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారం చేప‌ట్టాలంటే అందుకు ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా నుంచి పూర్తి స‌హ‌కారం అందాలి! చ‌రిత్ర‌ను బ‌ట్టి చూస్తే.. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే 14 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోని పూర్వ…

తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారం చేప‌ట్టాలంటే అందుకు ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా నుంచి పూర్తి స‌హ‌కారం అందాలి! చ‌రిత్ర‌ను బ‌ట్టి చూస్తే.. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే 14 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోని పూర్వ అనంత జిల్లాలో క‌నీసం 10 సీట్లు ద‌క్కించుకోవాలి! అనంత‌పురం ప‌రిధిలో 14కు గానూ ప‌ది ఒక‌టీ, రెండు త‌క్కువైనా తెలుగుదేశం పార్టీకి అధికారం క‌లే! తెలుగుదేశం ఏపీలో పూర్తిగా చిత్తైన 2004లోనూ, అధికారం ద‌క్కించుకోలేక‌పోయినా 2009లో కూడా అనంత‌పురం జిల్లా ప‌రిధిలో ఫ‌ర్వాలేద‌నిపించుకునే ఫ‌లితాలే వ‌చ్చాయి!

2004లో టీడీపీ ధ‌ర్మ‌వ‌రం, పెనుకొండ‌, ఉర‌వ‌కొండ‌, హిందూపురం, క‌దిరి ఇలా ఆరు నియోజ‌క‌వ‌ర్గాల్లో నెగ్గింది! అప్పుడు రాష్ట్రం మొత్తం మీదా.. 23 జిల్లాల ప‌రిధిలో టీడీపీకి ద‌క్కింది 47 సీట్లే! అందులో ఆరు సీట్లు ఒక్క అనంత‌పురం జిల్లా నుంచినే వ‌చ్చాయి! అనంత‌పురం స్థాయిలో టీడీపీకి సీట్లు ఇచ్చిన జిల్లా మ‌రోటి లేదు!

ఇక 2009లో తెలుగుదేశం పార్టీకి అనంత‌పురం జిల్లాలో ఆరు సీట్లు ద‌క్కాయి! ఇలా తెలుగుదేశం పార్టీ ప‌రువును నిలబెట్ట‌డంలో పూర్వ అనంత‌పురం జిల్లా ఎప్పుడూ కీల‌క పాత్ర‌ను పోషిస్తూ ఉంటుంది. ఇక 2014లో అయితే తెలుగుదేశం పార్టీకి ఏకంగా 12 సీట్ల‌ను ఇచ్చి అధికారాన్ని చేతికి ఇవ్వ‌డంలో మ‌రింత కీల‌క పాత్ర పోషించింది! అనంత‌పురం జిల్లాలో ఆరేడు ఎమ్మెల్యే సీట్ల‌ను నెగ్గినా టీడీపీకి అధికారం అంద‌దు. టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే అనంత‌పురం నుంచి క‌నీసం ప‌ది, అంత‌కు మించిన సీట్లు వ‌స్తేనే.. ఆ పార్టీకి క‌నీస మెజారిటీతో అయినా అధికారం అందుతుంది. ఈ రాజ‌కీయ చ‌రిత్ర‌ను బ‌ట్టి చూస్తే టీడీపీకి పూర్వ అనంత‌పురం జిల్లానే ఆయువు ప‌ట్టు!

మ‌రి అలాంటి జిల్లాలో ఇప్పుడు తెలుగుదేశం యువ‌కిశోరం నారా లోకేష్ పాద‌యాత్ర సాగుతూ ఉంది! మ‌రి ఈ పాద‌యాత్ర‌కు వ‌స్తున్న స్పంద‌న తెలుగుదేశం పార్టీకి ఆందోళ‌న‌ను మిగిల్చే రీతిలో ఉండ‌టం గ‌మ‌నార్హం. క‌దిరి ప్రాంతంలో లోకేష్ పాద‌యాత్ర చిత్తూరు నుంచి స‌త్య‌సాయి జిల్లాలోకి ఎంట‌ర‌య్యింది. ఆ త‌ర్వాత పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గం దాటుకుని, పెనుకొండ‌, రాప్తాడు ల మీదుగా సాగుతూ ఉంది! ద‌గ్గ‌ర్లోనే ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం కూడా ఉంది.

స‌త్య‌సాయి జిల్లా ప‌రిధిలోకి వ‌చ్చే పుట్ట‌ప‌ర్తి, పెనుకొండ‌, హిందూపురం, ధ‌ర్మ‌వ‌రం, రాప్తాడు.. వీట‌న్నింటికీ ద‌గ్గ‌ర‌గా ఉండే నేష‌న‌ల్ హైవే 44కు కాస్త అటూ ఇటూ లోకేష్ పాద‌యాత్ర జ‌రుగుతూ ఉంది. మ‌రి ఇన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు అతి ద‌గ్గ‌ర‌గా పాద‌యాత్ర జ‌రుగుతూ ఉంది. ఒటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల కు అతి చేరువ‌లో పాద‌యాత్ర జ‌రుగుతూ ఉంది. మ‌రి లోకేష్ యాత్ర‌పై ఇలా ఐదు నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌భావం ఉండాల్సింది!

అయితే అలాంటిదేమీ లేక‌పోవ‌డ‌మే విశేషం! లోకేష్ ఎక్క‌డైనా ప‌ట్ట‌ణంలో కాస్త స‌భ‌లాగా పెడితే అక్క‌డ జ‌నాల‌ను స‌మీక‌రిస్తున్నారు తెలుగుదేశం నేత‌లు. ఎటొచ్చీ ఇది పాద‌యాత్ర‌. లోకేష్ తో పాటు జ‌నాలు న‌డిచిన‌ట్టుగా క‌నిపిస్తేనే పాద‌యాత్ర‌కు స్పంద‌న ఉన్న‌ట్టు. రోడ్డు మీద చూస్తే మాత్రం లోకేష్ తో పాటు ప‌ట్టుమ‌ని వంద మంది కూడా న‌డుస్తున్న‌ట్టుగా క‌నిపించ‌దు. లోకేష్ యాత్ర కోసం వెంట ఉండే మందీమార్బ‌లం సంగ‌తిని ప‌క్క‌న పెడితే… సాధార‌ణ జ‌నంతో ఎలాంటి సంబంధం లేకుండా ఈ యాత్ర సాగుతూ ఉంది!

కార్య‌క‌ర్త‌లు, తెలుగుదేశం సానుభూతి ప‌రులు కూడా ఈ యాత్ర‌లో మ‌మేకం కాక‌పోవ‌డ‌మే అస‌లైన విశేషం! ఏ రాజ‌కీయ పార్టీ నేత పాద‌యాత్ర‌ను చేసినా.. క‌నీసం సానుభూతి ప‌రులు న‌డ‌వాలి. కార్య‌క‌ర్త‌లు ఉత్సాహంగా అడుగేయాలి. మొద‌టి నుంచి లోకేష్ పాద‌యాత్ర‌లో లోపిస్తున్న సంగ‌తి ఇదే! పార్టీ సానుభూతి ప‌రులు, కార్య‌క‌ర్త‌లే ఈ యువ‌గ‌ళంతో మ‌మేకం కాక‌పోవ‌డంతో.. ఇక త‌ట‌స్తులు, సామాన్య ప్ర‌జానీకం ఈ యాత్ర‌ను ఇంకెప్ప‌టికి గుర్తించాలి? అనేది ప్ర‌శ్న‌!

ఇప్ప‌టికే ఒక‌టీ రెండు జిల్లాల‌ను దాటేసి, మూడే- నాలుగో జిల్లాల మీదుగా లోకేష్ యాత్ర సాగుతున్నా.. అనంత‌పురం వంటి పార్టీ క్యాడ‌ర్, సానుభూతి ప‌రులున్న జిల్లాలో కూడా ఉండాల్సిన అస‌లైన జోష్ లేక‌పోవ‌డంతో.. లోకేష్ పాద‌యాత్ర నిష్ఫ‌ల‌మైన రీతిలో సాగుతోంద‌ని అనుకోవాల్సి వ‌స్తోంది. స‌భ కోసం స్థానిక నేత‌లు స‌మీక‌రించే కార్య‌క‌ర్త‌లు కాస్త హ‌డావుడి చేస్తున్నారు. పాద‌యాత్ర‌కు ప‌ది అడుగుల దూరంలో కూడా మ‌ళ్లీ ఎలాంటి సంద‌డీ ఉండ‌టం లేదు. 

తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పెరుగుతోంద‌నే ప్ర‌చారం ఏదైనా పుంజుకునేలా ప‌చ్చ‌మీడియా చేయాల‌న్నా.. లోకేష్ పాద‌యాత్ర ఆ అవ‌కాశం వారికి లేకుండా చేస్తోంది. అనంత‌పురం వంటి చోటే లోకేష్ పాద‌యాత్ర‌కు అంత పేల‌వ‌మైన స్పంద‌న వ‌స్తోందంటే.. ఇక తెలుగుదేశం పార్టీ ఎక్క‌డ పుంజుకున్న‌ట్టు?