వరుసగా ఫ్లాపులిస్తున్న ఆది సాయికుమార్, తాజాగా మరో డిజాస్టర్ అందుకున్నాడు. అతడు నటించిన అతిథి దేవోభవ చిత్రం విడుదలైన వారం రోజులకే దుకాణం సర్దేసింది. విడుదలైన అన్ని ఏరియాల్లో ఈ సినిమాకు నష్టాలు వచ్చాయి. ఇంకా చెప్పాలంటే.. కోటి 30 లక్షల రూపాయలకు సినిమా అమ్మితే, అటుఇటుగా 25 లక్షలు కూడా రాలేదు.
ఆది సాయికుమార్ చేస్తున్న ప్రతి సినిమాకు అంతోఇంతో బజ్ వస్తోంది. ఏదో ఒక పాట హిట్టవ్వడమో, ట్రయిలర్ క్లిక్ అవ్వడమో, హీరోయిన్ అందంగా ఉండడమో.. ఇలా ఏదో ఒకటి జరుగుతోంది. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత తన కంటెంట్ తో ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోలేకపోతున్నాడు ఆది సాయికుమార్.
అతిథి దేవోభవ సినిమాను చాలా చోట్ల నిర్మాతలే సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. ఈ నష్టంలో ఎక్కువ శాతం వాళ్లే భరించాల్సి వస్తోంది. అటు ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ కూడా అమ్ముడుపోలేదు. ఈ సినిమానే కాదు, గడిచిన మూడేళ్లుగా ఆది సాయికుమార్ నటించిన చాలా సినిమాల శాటిలైట్, డిజిటల్ రైట్స్ అమ్ముడుపోవడం లేదు.
ఈమధ్య కథల ఎంపిక పరంగా ట్రాక్ మార్చానని ప్రకటించుకున్నాడు ఆది సాయికుమార్. డిఫరెంట్ సబ్జెక్టుల్ని సెలక్ట్ చేసుకుంటున్నానని అన్నాడు. అది నిజమే. కానీ దాన్ని బాగా ఎగ్జిక్యూట్ చేసే టీమ్ ను ఎంపిక చేసుకోవడంలో అతడు ఫెయిల్ అవుతున్నాడు. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ, నెరేషన్ సరిగ్గా లేక చాలా సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి. ఈ కోణంలో అతడు గట్టిగా దృష్టిపెడితే పోగొట్టుకున్న మార్కెట్ ను తిరిగి సంపాదించుకోవడం ఏమంత కష్టం కాదు.