అదేంటో గానీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు విచారణ పేరెత్తితే చాలు జబ్బు పుట్టుకొస్తోంది. అంత వరకూ ఎంతో యాక్టీవ్‌గా ఉంటూ, తన రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే రఘురామకు విచారణ ఫోబియా పట్టుకున్నట్టుంది.
మానసికంగా, శారీరకంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటూ… తన సొంత ప్రభుత్వం తప్పిదాలన్నింటికి లోకానికి చాటి చెబుతూ, ప్రతిపక్షాలకు ఊపిరి పోసే రఘురామ… విచారణ అంటే ఎందుకంతగా భయపడతారో అంతుచిక్కడం లేదు.
అంతేకాదు, ఏపీ సీఐడీ విచారణ పేరెత్తితే పరుగో పరుగు అంటూ ఢిల్లీకి ప్లైట్ ఎక్కడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా ఆయన ఏపీ సీఐడీ అధికారులకు ప్రేమ లేఖ రాయడం చర్చకు దారి తీసింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అవాకులు చెవాకులు పేలినందుకు ఈ నెల 12న ఏపీ సీఐడీ అధికారులు ఆయనకు ఓ నోటీసు ఇచ్చారు. ఈ నెల 17న విచారణకు రావాలనేది ఆ నోటీస్ సారాంశం.
తాను విచారణకు హాజరవుతానంటూనే…చలో ఢిల్లీ అనడం విశేషం. ఏదైతే చెబుతారో, అందుకు విరుద్ధంగా వ్యవహరించడం సదరు ఎంపీ గారి నైజమని ఇటీవలి ఆయన అడుగులు చెప్పకనే చెబుతున్నాయి. ఇవాళ సీఐడీ విచారణకు వెళ్లాల్సిన పెద్ద మనిషి… అందుకు విరుద్ధంగా ఓ లేఖ రాయడం గమనార్హం.
తాను అత్యవసర పనిపై ఢిల్లీ వెళ్లాల్సి వచ్చిందని, అనారోగ్య కారణాలతో డాక్టర్స్‌ను సంప్రదించాల్సి ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే తనకు సీఐడీ నోటీసులు ఇవ్వడంపై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు నాలుగు వారాల పాటు సమయం ఇవ్వాలని అందులో అభ్యర్థించారు.
గతంలో ఆయన మిలటరీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న నేపథ్యం తెలిసిందే. ఆ తర్వాత ఢిల్లీ ఎయిమ్స్‌కు వెళ్లి ఒళ్లంతా కట్టు కట్టించుకుని , కొత్త రూపంలో కనిపించడం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏపీ సీఐడీ, రఘురామ, విచారణ, రోగం మధ్య అవినాభావ సంబంధం ఏదో ఉన్నట్టుంది.
లేదంటే సీఐడీ విచారణకు నోటీసు ఇచ్చినపుడే ఎందుకు ఆయన అనారోగ్యం పాలవుతున్నారో ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం కూడా ఉందని రఘురామ పార్టీకి చెందిన వాళ్లే అంటుండం విశేషం.