బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలూ ఇటూ ఇటూ మారుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ హోదా ఆర్జేడీ, బీజేపీల మధ్య మారుతూనే ఉంది.
ప్రస్తుతం అది ఆర్జేడీ చేతిలో ఉంది. ముందజలు, వెనుకంజల నంబర్ల సంగతి కాసేపు పక్కన పెడితే.. ఈ కథనం రాసే సమయానికి బిహార్ లో విజయం ఖరారు అయిన స్థానాలు 74 మాత్రమే. 243 స్థానాలకు గానూ 74 స్థానాల ఫలితాలు అధికారికంగా వెల్లడి అయ్యాయి. ఇంకా 70 లక్షల ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉందని ఈసీ ప్రకటించింది.
ఇక కౌంటింగ్ కొనసాగుతున్న నియోజకవర్గాల విషయానికి వస్తే.. అన్నింటా ముందజలు, వెనుకంజలు మారుతూ ఉన్నాయి. ఎవరు ముందున్నా ఐదొందల ఓట్లు, వెయ్యి ఓట్ల తేడాలే ఉన్నాయని నేషనల్ చానల్స్ చెబుతున్నాయి. ఇంకా లెక్కించాల్సిన ఓట్లు లక్షల్లో ఉండటం, మెజారిటీలూ అటూ ఇటూ మారుతూనే ఉండటంతో.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది ఆఖరి ఓటు లెక్క పూర్తయ్యే వరకూ తేలదని స్పష్టం అవుతోంది.
ఎన్డీయే కూటమి 120 స్థాయి సీట్లలో లీడ్ లో ఉంది. ఆర్జేడీ కూటమి అందుకు ఏడెనిమిది సీట్ల తక్కువ స్థాయిలో లీడ్ లో ఉంది. ఈ లీడింగ్ లు కాస్త ఇటూ ఇటూ అయ్యే అవకాశాలున్నాయి. ఎన్డీయే కూటమికి స్పష్టమైన మెజారిటీ దక్కవచ్చు లేదా.. ఐదారు నియోజకవర్గాల్లో ఫలితాలు అటూటూ అయినా ఆర్జేడీ కూటమి అతి పెద్దదిగా నిలవొచ్చు.
ఎవరికీ స్పష్టమైన మెజారిటీ దక్కకపోతే.. ఎంఐఎం, ఇతరులు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఎంఐఎం బిహార్ లో ఏకంగా ఐదు స్థానాల్లో లీడ్ లో ఉంది. బీఎస్పీ ఒక స్థానం, ఇండిపెండెంట్ లు రెండు చోట్ల ముందంజలో ఉన్నారు. ఆర్జేడీ కూటమి గనుక ముందంజలో నిలిస్తే.. ఎంఐఎం మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉండకపోవు.