చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి కొడాలి నాని. బాబు, లోకేష్ పై ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పించే నాని, ఈసారి చంద్రబాబుతో పాటు అతడి అనుకూల మీడియాను చాకిరేవు పెట్టారు. ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే.. బాబు, అతడి మీడియా గుడ్డివాళ్లుగా మారారని ఎద్దేవా చేశారు.
“120 కోట్లతో గుడివాడలో హాస్పిటల్ నిర్మిస్తున్నాం. వెయ్యి రూపాయల ఖర్చు దాటిన ప్రతి వైద్యానికీ ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నాం. ఇవేవీ గుడ్డి చంద్రబాబుకు, గుడ్డి చంద్రబాబు మీడియాకు కనిపించవు.
పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి సిద్ధమౌతున్నాం. వాళ్లకు ఇల్లు కూడా నిర్మించి ఇస్తాం. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కావా? చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు కనిపించదా?”
తన జీవితంలో ఆటోడ్రైవర్లను ఆదుకున్న నాయకుడ్ని చూడలేదని, ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి జగన్.. ఆటోడ్రైవర్లను ఆదుకుంటున్నారని అన్నారు నాని.
రెండో విడత వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించిన మంత్రి.. అర్హత ఉండి వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం ప్రయోజనం పొందని లబ్దిదారుల్ని గుర్తించి, వాళ్ల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమచేశారు.
గతేడాది అక్టోబర్ 4న వైఎస్ఆర్ వాహనమిత్ర నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించారు. ఇక ఈ ఏడాది కరోనా కారణంగా 4 నెలల ముందే, అంటే జూన్ నెలలోనే లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారు.
సాంకేతిక కారణాల వల్ల మిస్సయిన వాళ్లకు, కొత్తగా పథకంలోకి చేరిన వాళ్లకు ఈరోజు నగదు బదిలీ జరిగింది. అలా గతేడాది 2,24,219 మంది లబ్ది పొందగా, ఈ ఏడాది కొత్తగా మరో 49,257 మంది ఈ పథకం కింద లబ్దిపొందారు.