దుబ్బాక రిజ‌ల్ట్ః టీడీపీకి దబిడి దబిడే

బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ అద్భుత ఫ‌లితాల‌ను సాధించింది. మ‌రీ ముఖ్యంగా తెలంగాణ‌లోని దుబ్బాక‌లో బీజేపీ అనూహ్య‌, సంచ‌ల‌న విజ‌యం సాధించింది. దీంతో …

బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ అద్భుత ఫ‌లితాల‌ను సాధించింది. మ‌రీ ముఖ్యంగా తెలంగాణ‌లోని దుబ్బాక‌లో బీజేపీ అనూహ్య‌, సంచ‌ల‌న విజ‌యం సాధించింది. దీంతో  తెలంగాణ‌లో  రాజ‌కీయ పెనుమార్పుల‌కు దుబ్బాక గెలుపు నాంది ప‌ల‌క‌నుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

బండి సంజ‌య్ నాయక‌త్వంలో తెలంగాణ‌లో బీజేపీ రాజ‌కీయ బండి అధికారం వైపు న‌డ‌క సాగిస్తుంద‌ని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం తెలంగాణ అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో దుబ్బాక‌లో మూడో స్థానానికి ప‌రిమిత‌మైన బీజేపీ … స్వ‌ల్ప కాల వ్య‌వ‌ధిలో అనూహ్య విజ‌యం సాధించ‌డం నిజంగానే ఆ పార్టీ శ్రేణుల‌కి కొత్త శ‌క్తి ల‌భించిన‌ట్టైంది.

అయితే ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన చందంగా దుబ్బాక గెలుపు ఏపీలో టీడీపీ ప‌త‌నానికి కూడా పునాదులు వేస్తుంద‌నే అభిప్రాయాలు లేక‌పోలేదు. ఎందుకంటే తెలంగాణ‌లో ఏ విధంగానైతే కాంగ్రెస్‌ను పూర్తిగా ప‌త‌నం చేస్తూ, ఆ పునాదుల‌పై బీజేపీ త‌న రాజ‌కీయ సౌధాన్ని నిర్మించుకుంటున్న‌దో, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా అదే ఫార్ములాను బీజేపీ త‌ప్ప‌క అనుస‌రిస్తుంద‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌ధానంగా ప‌త‌నం చేయాల్సిన పార్టీ ఏదైనా ఉందా అంటే …. అది టీడీపీనే అని బీజేపీ భావిస్తోంది. ఈ విష‌య‌మై ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు ఇటీవ‌ల అనేక ఇంట‌ర్వ్యూల్లో స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే. అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవ‌డంలో బీజేపీకి మించిన రాజ‌కీయ పార్టీ మ‌రేది లేద‌ని అంద‌రూ చెప్పే మాట‌.

ఉదాహ‌ర‌ణ‌కు దుబ్బాక‌నే తీసుకుందాం. 2018 ఎన్నిక‌ల్లో దుబ్బాక నుంచి టీఆర్ఎస్ అభ్య‌ర్థి సోలిపేట రామ‌లింగారెడ్డి త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి కాంగ్రెస్ అభ్య‌ర్థి చెరుకు ముత్యంరెడ్డిపై 62,500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ ఎన్నిక‌లో బీజేపీ మూడో స్థానానికి ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది.

2018 ఎన్నిక‌ల్లో దుబ్బాక‌లో టీఆర్ఎస్‌కు 89,299 ఓట్లు, కాంగ్రెస్‌కు 26,799 ఓట్లు, బీజేపీ అభ్య‌ర్థి ఎం.ర‌ఘునంద‌న్‌కు 22,595 ఓట్లు ద‌క్కాయి. కేవ‌లం రెండేళ్ల‌లో ప‌రిస్థితి తారుమారైంది. తాజాగా వెల్ల‌డైన ఫ‌లితాల్లో బీజేపీ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్ సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నిక‌లో బీజేపీకి 62,772 ఓట్లు, టీఆర్ఎస్‌కు 61,302 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 21,819 ఓట్లు ల‌భించాయి.  

కేవ‌లం రెండేళ్లలో మూడోస్థానం నుంచి అమాంతం విజ‌య శిఖ‌రాన్ని బీజేపీ అధిరోహించి రికార్డు సృష్టించింది. దీని వెనుక ఎంతో పోరాట ప‌టిమ దాగి ఉంది. తెలంగాణ‌లో టీఆర్ఎస్ ప్ర‌త్యామ్నాయం తామేన‌ని బీజేపీ మాట‌ల‌తో కాకుండా చేత‌ల‌తో ఈ విజ‌యం ద్వారా చాటి చెప్పింది. ఈ నేప‌థ్యంలో బీజేపీ చూపు స‌హ‌జంగానే మ‌రో తెలుగు రాష్ట్ర‌మైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై త‌ప్ప‌క ప‌డుతుంది. ఏపీలో బ‌ల‌ప‌డేందుకు బీజేపీ ఇప్ప‌టికే ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది.

ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ ఓటు బ్యాంకు ముస్లింలు, క్రిస్టియ‌న్లు, రెడ్లు, ద‌ళితులు, బీసీల్లో 40 శాతం ఉంటుంది. బీజేపీ సిద్ధాంత‌ప‌రంగా వైసీపీ ఓటు బ్యాంకు పూర్తి విరుద్ధం. అందువ‌ల్ల బ‌ల‌ప‌డాలంటే దెబ్బ తీయాల్సింది టీడీపీనే అని బీజేపీ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చింది. అందుకే గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత మిత్ర‌త్వం  కోసం వెంప‌ర్లాడుతున్న టీడీపీని బీజేపీ ఏ మాత్రం ద‌గ్గ‌రికి తీయ‌డం లేదు.

అలాగే పార్టీలో టీడీపీ కోవ‌ర్డుల‌ను గుర్తిస్తూ బ‌య‌టికి పంపే కార్యక్ర‌మాన్ని వేగ‌వంతం చేశారు. మ‌రోవైపు క‌రోనా ఎఫెక్ట్‌తో చంద్ర‌బాబునాయుడు ఇంటి నుంచి బ‌య‌ట అడుగు పెట్ట‌లేని ప‌రిస్థితి.  అలాగే జ‌గ‌న్ స‌ర్కార్ ఉక్కు పాదం మోపుతుండ‌డంతో టీడీపీ నేత‌లు వ‌ణికిపోతున్నారు. 

జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఎదురొడ్డి పోరాడాలంటే చంద్ర‌బాబు నాయ‌క‌త్వం భ‌రోసా ఇవ్వ‌లేద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. వీట‌న్నింటిని అవ‌కాశంగా తీసుకుని బీజేపీ బ‌ల‌ప‌డేందుకు సిద్ధ‌మ‌వుతోంది. 

ఇదే సంద‌ర్భంలో జ‌గ‌న్ కేసుల కార‌ణంగా బీజేపీపై వైసీపీ గ‌ట్టిగా మాట్లాడ‌లేని త‌నాన్ని సొమ్ము చేసుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. ఏది ఏమైనా దుబ్బాక ఇచ్చిన విక్ట‌రీ కిక్ ఏపీలో బ‌ల‌ప‌డేందుకు బీజేపీ త‌హ‌త‌హ‌లాడుతోంద‌న్న‌ది నిజం. అలాగే రానున్న రోజుల్లో బీజేపీ ఎత్తుల‌కు టీడీపీకి ద‌బిడి ద‌బిడే అని చెప్ప‌క త‌ప్ప‌దు. 

ట్రంపుకి చంద్రబాబు జూమ్ పాఠాలు!