గెలిచారా? గెలిపించారా?

దుబ్బాకలో భాజపా గెలిచింది. దుబ్బాకలో జనం భాజపాను గెలిపించారు. దుబ్బాకలో రఘునందన్ గెలిచారు. దుబ్బాకలో భాజపా అభ్యర్థి గెలిచారు Advertisement అన్నీ ఒకటేగా..ఏమిటి తేడా? దూరంగా చూస్తే తేడా అనిపించకపోవచ్చు. కానీ గెలవడానికి, గెలిపించడానికి…

దుబ్బాకలో భాజపా గెలిచింది. దుబ్బాకలో జనం భాజపాను గెలిపించారు. దుబ్బాకలో రఘునందన్ గెలిచారు. దుబ్బాకలో భాజపా అభ్యర్థి గెలిచారు

అన్నీ ఒకటేగా..ఏమిటి తేడా? దూరంగా చూస్తే తేడా అనిపించకపోవచ్చు. కానీ గెలవడానికి, గెలిపించడానికి కొంతయినా తేడా వుంది. 2019లో ఆంధ్రలో జగన్ పార్టీ గెలవలేదు. జనం గెలిపించారు. గెలిచినట్లయితే అంత భారీ స్థానాలు రావు. జనం అవతలి పార్టీ మీద కసితో గెలిపించారు కాబట్టే అన్ని స్థానాలు వచ్చాయి. ఇప్పుడు దుబ్బాక ఫలితం వెనుక అంత కసి అయితే లేదు కానీ భాజపాను జనమే గెలిపించినట్లు స్పష్టమవుతోంది.

పత్రికలు, సోషల్ మీడియా, స్టేట్ మెంట్ లు సంగతి పక్కన పెడితే, కింది స్థాయిలో భాజపాకు ఏ మాత్రం కేడర్ వుంది అన్నది అందరికీ తెలిసిందే. అధికారంలో వున్న తెరాస కు వున్న అడ్వాంటేజ్ లు ఏమిటన్నవీ తెలిసిందే. సాధారణంగా ఉపఎన్నికల్లో అధికార పార్టీకి ఎడ్జ్ వుంటుంది. అది అందరికీ తెలిసిన విషయం. ఆ ఎడ్జ్ సరిపోదని అధికార తెరాస కిందా మీదా పడింది. కేసిఆర్, కేటిఆర్ లాంటి వాళ్లు అక్కడి వెళ్లి ప్రచారం చేయకపోవచ్చు కానీ వారు తెరవెనుక చేసిన కృషి తక్కువ అయి వుంటుంది అని అనుకోవడానికి లేదు. అలాగే ఎన్నికల వ్యవహారాన్ని తన భుజాలపై వేసుకున్న హరీష్ రావు సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడానికీ లేదు.

ఇన్ని ప్లస్ పాయింట్లు వున్న తెరాస ఓడి పోతుందని ఏ రాజకీయ పరిశీలకులు అంచనాలు వేసేయలేదు. ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరుకున్నపుడు కూడా దుబ్బాక వెళ్లి వచ్చిన జర్నలిస్ట్ మిత్రులంతా తెరాసనే గెలుస్తుందని చెప్పుకుంటూ వచ్చారు. రాజకీయ పండితులు అదే పలికారు. హరీష్ రావు సామర్థ్యం మీద నమ్మకం, భాజపాకు వున్న కేడర్ బలహీనత మీద వున్న అంచనాలు, ఇంకా ఇంకా చాలా కలిసి ఇలా ఆలోచించేలా చేసి వుంటాయి. 

అయితే ఇలాంటి పరిస్థితి మారుతూ వస్తోంది అని గమనించింది ఎవరైనా వున్నారు అంటే అది తెరాస అధినేతలు మాత్రమే. అందుకే భాజపాను ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేసారు.  కాంగ్రెస్ తో ప్రమాదం లేదని తెరాస పెద్దలు అనుకున్నంత వరకు అది నిజమే అయింది. భాజపాతో ప్రమాదం అని అనుకున్నదీ కరెక్ట్ నే అయింది.  కానీ భాజపాను డీల్ చేసిన విధానమే సరిగ్గా లేదు. భాజపాను అడ్డదారిలో కట్టడి చేద్దాం అనుకున్నారు. 

అలా కాకుండా భాజపా రాష్ట్రానికి చేయని సాయాన్ని,చేస్తున్న అన్యాయాన్ని మొదటి నుంచి హైలైట్ చేసి వుండాల్సింది.  తెలుగుదేశం అయి వుంటే లోకల్..నాన్ లోకల్ ఫీల్ తెచ్చి వుండేవారు. కానీ రఘునందన్ రావు కేండిడేట్, భాజపా పార్టీ కావడంతో అలాంటి వ్యూహం అమలు చేయలేదు. రఘునందన్ రావును టార్గెట్ చేసేలోగానే, తానుు శాసనసభలో అడుగుపెడితే ఇక తెరాస నేతలకు నిద్ర వుండదనే వ్యవహారాన్ని ముందుగా రఘునందన్ ప్రోజెక్ట్ చేయడం ప్రారంభించేసారు. భాజపాకు కు వున్న కేడర్ కన్నా లీడర్లే కాస్త ఎక్కువ. వారంతా దుబ్బాక మీద మోహరించారు. 

సహజంగా మాటకారి, యువకుడు అయిన రఘునందన్ రావు వైపు జనం మొగ్గడం ప్రారంభించారు. తెరాస మహిళా అభ్యర్థికి ఆ తరహా క్రేజ్ కరువైంది. ఇటు తెరాస నే రఘునందన్ రావు తమ బలమైన ప్రత్యర్థిగా గుర్తించి, అతన్ని అడ్డుకునే దిశగా అడ్డదారులు తొక్కడం, అటు రఘునందన్ రావు కూడా ఆ స్థాయిని నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం రెండూ మొత్తం ఎన్నికల సీన్ ను సైలంట్ గా మార్చేసాయి. రఘునందన్ కాకుండా మరెవరు అయినా ఫలితం ఎలా వుండేది అన్న అనుమానాలు ఇప్పుడు వినిపిస్తున్నాయంటే కారణం అదే. 

ఎన్నికల ఓటింగ్ ఫలితాలు ఎప్పుడు సర్వేయర్ల నాడికి అందుతాయి అంటే, పార్టీల బలం బట్టే, దాన్ని బట్టే సర్వేలు అంచనా వుంటుంది. కానీ జనం డిసైడ్ అయితే అది సర్వేలకు అంతగా అందదు. 2019లో ఆంధ్రలో జరిగింది అదే. అక్కడ ఓ చాన్స్ జగన్ కు ఇవ్వాలని జనం డిసైడ్ అయ్యారు. ఇప్పుడు దుబ్బాకలో కూడా రఘునందన్ రావును గెలిపించాలని డిసైడ్ అయ్యారు. అందువల్లే తెరాసకు అన్ని ప్లస్ పాయింట్లు వుండడంతో, హోరాహోరీగా మారి కొద్ది పాటి మెజార్టీతో భాజపా నెగ్గింది. 

అందువల్లే జనం భాజపాను గెలిపించారా? లేక భాజపా కష్టపడి గెలవగలిగిందా? అన్న అనుమానం తలెత్తుతోంది. అంతే కాదు, ఈ విజయం భాజపా దా? రఘనందన్ దా? అన్న మరో సప్లిమెంటరీ పరీక్ష కూడా వుండనే వుంది.

ఏది ఏమైనా తెరాస పట్ల జనం కాస్త విముఖతతో వున్నారన్న క్లారిటీ వచ్చేసింది. మీడియా మొత్తం కంట్రోల్ లో వున్నా, జనం మన కంట్రోల్ లో వుంటారనుకుంటే పొరపాటే. రెండు పర్యాయాల పాలన అంటే యాంటీ ఓటు కొంతయినా జనరేట్ కాకతప్పదు. హైదరాబాద్ ను పట్టించుకున్నంతగా తెలంగాణ మిగిలిన ఏరియాలను పట్టించుకోవడం లేదన్న విమర్శ ఒకటి వుంది. అలాగే పాలన అంతా ఓ దగ్గరకే కేంద్రీకృతమైపోయిందన్న విమర్శ కూడా వుంది. 

కేసిఆర్ పాలన ఎంత బాగుందో? ఎంత బాగాలేదో? అన్న దానిపైన జనాల్లో రకరకాల డిస్కషన్లు వున్నాయి. ఇప్పుడు ఈ డిస్కషన్లు మరింతగా చెలరేగుతాయి. ఎందుకంటే ఏం జరుగుతుందో ఊహించడం కన్నా, జరిగిందానిని పోస్ట్ మార్టమ్ చేయడం అంటే హుషారే కదా? ముఖ్యంగా జిహెచ్ ఎంసి ఎన్నికల్లో ఈ ఓటమి ప్రభావం ఏమేరకు వుంటుంది అన్నది కూడా తెగ వినిపించే పాయింట్ అవుతుంది. 

నిజానికి జిహెచ్ఎంసి లో భాజపా ప్రభావం చూపించాలంటే దుబ్బాక తరహా స్కీము రిపీట్ కావాల్సి వుంటుంది. అంటే సరైన, బలమైన అభ్యర్థులు, బలమైన ప్రచారం. కానీ ఇక్కడ తెరాసకే ఎక్కువ అనుకూలతలు వుంటాయి. ఎందుకంటే హైదరాబాద్ వరదల వ్యవహారం పక్కన పెడితే నగర అభివృద్ది విషయంలో తెరాస తక్కువేమీ చేయలేదు. అది క్లారిటీగా కనిపిస్తూనే వుంది. 

అందువల్ల భాజపాకు దుబ్బాక ఎన్నిక తాత్కాలిక రెడ్ బుల్ డ్రింక్ లా పని చేస్తే చేయొచ్చు కానీ, అంత మాత్రం చేత తెరాస కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయిందనే అనేసుకోవడానికి వీల్లేదు. కానీ ప్రజలు ఇచ్చిన ఆరంభాన్ని కొనసాగించుకునే ప్రయత్నం మాత్రం భాజపా చేతుల్లో వుంది. అది ఏమేరకు కొనసాగిస్తుందో చూడాలి. 

ఆర్వీ