భార్య అశ్లీల దృశ్యాలు.. భర్త ఆత్మహత్యాయత్నం

పండగ పూట ఊహించని అనుభవం ఎదురైంది ఆ భర్తకి. అంతా సరదాగా సాగిపోతున్న సమయంలో, ఒక్కసారిగా అశ్లీల దృశ్యాల్లో భార్య కనిపించింది. ఆ వీడియోలు చూసిన భర్త తన బాధను ఎవ్వరితో చెప్పుకోలేకపోయాడు. ఆత్మహత్యకు…

పండగ పూట ఊహించని అనుభవం ఎదురైంది ఆ భర్తకి. అంతా సరదాగా సాగిపోతున్న సమయంలో, ఒక్కసారిగా అశ్లీల దృశ్యాల్లో భార్య కనిపించింది. ఆ వీడియోలు చూసిన భర్త తన బాధను ఎవ్వరితో చెప్పుకోలేకపోయాడు. ఆత్మహత్యకు యత్నించాడు. తనతో పాటు పిల్లలకు కూడా పురుగుమందు తాగించాడు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది ఈ ఘటన.

వంగలపూడికి చెందిన ఓ మహిళ ఉద్యోగ నిమిత్తం కువైట్ కు వెళ్లింది. భర్త ఆటోడ్రైవర్ గా పనిచేస్తుంటాడు. వీళ్లకు ముగ్గురు పిల్లలు. భర్త తన స్వగ్రామం గోకవరంలో ఉంటాడు. ముగ్గురు పిల్లలు వంగలపూడిలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు.

పండక్కి మహిళ ఇంటికి రాలేకపోయింది. కరోనా కారణంగా కువైట్ లోనే ఉండిపోయింది. భర్త, పిల్లల్ని చూడడానికి రెడీ అయ్యాడు. అంతలోనే అతడి మొబైల్ కు ఓ వాట్సాప్ వీడియో వచ్చింది. అది ఓపెన్ చేసి చూస్తే, మరో వ్యక్తితో తన భార్య సన్నిహితంగా, అసభ్యకరంగా ఉన్న దృశ్యాలు అందులో కనిపించాయి. దీంతో ఒక్కసారిగా అతడు షాక్ అయ్యాడు.

పండగ కోసం వంగలపూడి వచ్చిన భర్త, తన ముగ్గురు పిల్లల్ని తీసుకొని సమీపంలోని మామిడి తోటలోకి వెళ్లాడు. ముందుగా తను పురుగుల మందు తాగాడు. తర్వాత పిల్లలతో తాగించే ప్రయత్నం చేశాడు. చేదుగా ఉందంటూ ఇద్దరు పిల్లలు తాగడానికి నిరాకరించారు. 10 ఏళ్ల చిన్నోడు మాత్రం అమాయకంగా తాగేశాడు. దీంతో తండ్రి, చిన్నకొడుకు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.

పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తండ్రికొడుకుని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వాళ్ల పరిస్థితి విషమంగా ఉంది. తన సమీప బంధువు నుంచి తనకు ఆ వీడియో వచ్చిందని, అందుకే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించానని ఆటోడ్రైవర్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. అసలు ఆ వీడియో నిజమైనదేనా కాదా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.