మాయమైన మొఘల్ సామ్రాజ్యం.. పాఠ్యాంశాల తొలగింపు

మొఘలులు, వాళ్ల పాలన, చేసిన మంచి పనులు, సాగించిన అకృత్యాలు.. ఇలా మంచిచెడు అన్నింటి గురించి చరిత్రలో తెలుసుకున్నాం. ఈ తరం విద్యార్థులకు ఇకపై ఆ సమాచారం అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే, మొఘల్ సామ్రాజ్యానికి…

మొఘలులు, వాళ్ల పాలన, చేసిన మంచి పనులు, సాగించిన అకృత్యాలు.. ఇలా మంచిచెడు అన్నింటి గురించి చరిత్రలో తెలుసుకున్నాం. ఈ తరం విద్యార్థులకు ఇకపై ఆ సమాచారం అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే, మొఘల్ సామ్రాజ్యానికి చెందిన దాదాపు అన్ని పాఠ్యాంశాల్ని తన సిలబస్ నుంచి తొలిగించేస్తోంది ఎన్సీఈఆర్టీ (NCERT). ఇకపై ఈ సిలబస్ లో మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన పాఠాలు కనిపించవు.

12వ తరగతి చరిత్ర పాఠ్యాంశాల నుంచి మొఘల్స్ పాలనను తొలిగించారు. థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పార్ట్-2లో ఉన్న కింగ్స్ అండ్ క్రానికల్స్ ది మొఘల్ కోర్ట్స్ అనే సిలబస్ ను పూర్తిగా తొలిగించింది ఎన్ సీ ఈ ఆర్టీ. అంతేకాదు, వీటికి సంబంధించి హిందీ బుక్స్ నుంచి కొన్ని పద్యాలు, పారాగ్రాఫ్స్ ను కూడా తొలిగించింది.  

హిస్టరీ బుక్స్ తో పాటు.. 12వ తరగతి సివిక్స్ బుక్స్ లో కూడా మార్పులు జరిగాయి. ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ఆధిపత్యం, అంతర్యుద్ధ దశ  అనే పాఠ్యాంశాల్ని కూడా ఎన్ సీ ఈ ఆర్టీ తొలిగించింది. 12వ తరగతి పాఠ్యపుస్తకం 'ఇండియన్ పాలిటిక్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్' నుండి 'రైజ్ ఆఫ్ పాపులర్ మూవ్‌మెంట్స్', 'ఎరా ఆఫ్ వన్ పార్టీ డామినెన్స్' అనే రెండు అధ్యాయాలు కూడా మాయమయ్యాయి.

10వ తరగతి పుస్తకం 'డెమోక్రటిక్ పాలిటిక్స్-2' నుంచి 'ప్రజాస్వామ్యం – వైవిధ్యం', 'ప్రజాపోరాటాలు – ఉద్యమాలు', 'ప్రజాస్వామ్య సవాళ్లు' లాంటి కొన్ని అధ్యాయాలను తొలిగించారు. ఇక 11వ తరగతి పాఠ్యపుస్తకం 'థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ' నుండి 'సెంట్రల్ ఇస్లామిక్ ల్యాండ్స్', 'క్లాష్ ఆఫ్ కల్చర్స్', 'ఇండస్ట్రియల్ రివల్యూషన్' అధ్యాయాల్ని కూడా తొలిగించారు. సిలబస్ లో చేసిన మార్పుచేర్పులు ఈ విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి వస్తాయని అధికారులు ప్రకటించారు.