తెలంగాణలో ఉప ఎన్నికలు అంటే.. గత కొన్నేళ్లలో వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగింది. 2014లో టీఆర్ఎస్ గెలిచిన దగ్గర నుంచి ఏ ఉప ఎన్నిక వచ్చినా.. కారు పార్టీకి వచ్చే మెజారిటీ మాత్రమే వార్తల్లోని అంశంగా నిలిచింది. ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు.. ఇలా వేటికి ఉప ఎన్నికలు వచ్చినా ప్రత్యర్థి పార్టీలకు షాకులు ఇచ్చే స్థాయి విజయాలను సాధించింది టీఆర్ఎస్.
ఇలాంటి క్రమంలో.. వచ్చిన దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో కూడా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందనే అభిప్రాయాలే సహజంగా వ్యక్తం అయ్యాయి. అయితే గ్రౌండ్ లెవల్లో మాత్రం కథ మొత్తం వేరేలా ఉందని విషయాన్ని స్పష్టతను ఇస్తోంది దుబ్బాక రిజల్ట్.
రౌండ్ రౌండ్ కూ ఆధిక్యం మారుతూ ఉంది. మరో నాలుగు రౌండ్ల కౌంటింగ్ మిగిలిన నేపథ్యంలో.. టీఆర్ఎస్ కు కాస్త ఎడ్జ్ కనిపిస్తూ ఉంది. అయితే ఈ ఆధిక్యం చివరి వరకూ ఉంటుందా? అనేది మాత్రం ప్రశ్నార్థకమే..
ప్రారంభ రౌండ్స్ లో భారతీయ జనతా పార్టీ మెజారిటీని సాధించింది. తొలి రౌండ్ తో మొదలుకుని, రెండు, మూడు రౌండ్స్ లో బీజేపీ మెజారిటీ సాధించింది. అలా సంచలన ప్రారంభంతో మొదలైన కౌంటింగ్ లో మలుపులు కొనసాగుతూ ఉన్నాయి.
పది రౌండ్ల కౌంటింగ్ ముగిసే సరికి 3,734 మెజారిటీని సాధించి విజయం దిశగా సాగుతున్నట్టుగా కనిపించింది బీజేపీ. అయితే ఆ తర్వాత రౌండ్ రౌండ్ కూ సీన్ మారుతూ వచ్చింది.
12వ రౌండ్ కౌంటింగ్ ముగిసే సమయానికి బీజేపీ ఆధిక్యం నాలుగు వేలను దాటింది. 13, 14 వ రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. మధ్యలో కాంగ్రెస్ కూడా కాస్త ఉనికిని చాటింది.
15 రౌండ్ లో టీఆర్ఎస్ దాదాపు వెయ్యి ఓట్ల మెజారిటీని సాధించింది. దీంతో బీజేపీ జోరు తగ్గింది. అప్పటికి బీజేపీ ఆధిక్యం 2,483కు తగ్గింది.
16వ రౌండ్లో కూడా టీఆర్ఎస్ మరో ఏడు వందలకు పైగా ఓట్ల మెజారిటీని సాధించింది. 17వ రౌండ్లో మరో ఎనిమిది వందల ఓట్లను మెజారిటీని సాధించి బీజేపీకి చెక్ పెట్టింది టీఆర్ఎస్. 18వ రౌండ్లో కూడా ఆధిక్యం సాధించింది బీజేపీ ఆధిక్యాన్ని రెండు వందల లోపుకు తీసుకొచ్చింది టీఆర్ఎస్. 19వ రౌండ్ లో సాధించిన ఆధిక్యంతో టీఆర్ఎస్ మొత్తం ఓట్లతో లీడ్ లోకి వచ్చింది. స్థూలంగా 19వ రౌండ్ కౌంటింగ్ ముగిసే సమయానికి 251 ఓట్ల ఆధిక్యంలో నిలిచింది. 20వ రౌండ్ కౌంటింగ్ తో కథ మళ్లీ మారింది. బీజేపీ దాదాపు 240 ఓట్ల ఆధిక్యంలో నిలుస్తోంది.