దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు క్షణక్షణానికి మలుపు తిరుగుతోంది. ఈ ఓట్ల లెక్కింపు టీ20 క్రికెట్ మ్యాచ్‌ను తలపిస్తోంది. 16వ రౌండ్ ఫలితాలు వెల్లడయ్యే సరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు దాదాపు 1700 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు.
ఇంకా 7 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరిగాల్సి ఉంది. ప్రతి రౌండ్‌లోనూ స్వల్ప మెజార్టీ వస్తుండడంతో బీజేపీ -టీఆర్ఎస్ మధ్య విజయం దోబూచులాడుతోంది.
ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల స్పెషలిస్ట్ మంత్రి హరీష్‌రావు దుబ్బాకలో మకాం వేసి అన్నీ తానై టీఆర్ఎస్ శ్రేణుల్ని ముందుకు నడిపించారు. హరీష్‌రావుకు ఆయన దత్తత గ్రామస్తులు షాక్ ఇచ్చారు. హరీష్‌రావు దత్తత తీసుకున్న చీకోడు గ్రామంలో బీజేపీ 22 ఓట్ల మెజార్టీ సాధించింది. దీంతో మంత్రికి షాక్ ఇచ్చినట్టైంది.
అలాగే మెదక్ టీఆర్ఎస్ ఎంపీ కొత్తకోట ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామమైన పోతారంలో కూడా బీజేపీకి 110 ఓట్ల మెజార్టీ లభించింది. ఇక్కడ కూడా టీఆర్ఎస్‌కు ఆ గ్రామస్తులు షాక్ ఇచ్చారు. దీన్ని బట్టి సొంత గ్రామస్తులతో అగ్ర నాయకుల సంబంధ బాంధవ్యాలు ఏంటో అర్థం చేసుకోవచ్చు.