ఆనం రాజ‌కీయం…ఊస‌ర‌వెల్లి బెట‌ర్‌!

మాజీ మంత్రి, వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి రాజ‌కీయాల్లో మార్చిన‌న్ని రంగులు… ఊస‌ర‌వెల్లి కూడా మార్చి వుండ‌దేమో! నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబానికి రాజ‌కీయంగా బ‌ల‌మైన పునాదులున్నాయి. నెల్లూరంటే రాజ‌కీయంగా ఆనం అనే పేరున్న…

మాజీ మంత్రి, వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి రాజ‌కీయాల్లో మార్చిన‌న్ని రంగులు… ఊస‌ర‌వెల్లి కూడా మార్చి వుండ‌దేమో! నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబానికి రాజ‌కీయంగా బ‌ల‌మైన పునాదులున్నాయి. నెల్లూరంటే రాజ‌కీయంగా ఆనం అనే పేరున్న త‌న‌కు కాద‌ని, ఎలాంటి అనుభ‌వం లేని అనిల్‌కుమార్ యాద‌వ్‌కు మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డం స‌హ‌జంగానే రామ‌నారాయ‌ణ‌రెడ్డి జీర్ణించుకోలేక‌పోయారు. రెండో విడ‌త కేబినెట్ విస్త‌ర‌ణ‌లో అనిల్‌ను త‌ప్పించి, త‌న శిష్యుడైన కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డికి మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డంతో కొంత‌లో కొంత ఊర‌ట చెందారాయ‌న‌.

నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌డుతూ ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి నెట్టుకుని వ‌చ్చారు. కానీ వైఎస్ జ‌గ‌న్ వ‌ద్ద ఆయ‌న ఆట‌లు సాగ‌లేదు. కేవ‌లం ఎమ్మెల్యే ప‌ద‌వితో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. కొత్త త‌రం నాయ‌కుల‌ను జ‌గ‌న్ ప్రోత్స‌హించారు. రాజ‌కీయంగా త‌ర‌త‌రాలుగా పాతుకుపోయిన ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డికి ఇది గిట్ట‌లేదు. దీంతో వైసీపీలో ఉక్క‌పోత‌కు గుర‌య్యారు. కార‌ణాలేవైనా ఇప్పుడాయ‌న రాజ‌కీయంగా స్వ‌తంత్రుడు.

అయితే త‌న‌ను పార్టీ నుంచి గెంటేయ‌డాన్ని ఆనం జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇటీవ‌ల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క‌నీసం ఆయ‌న్ను అధికార పార్టీ ప‌ట్టించుకున్న పాపాన‌పోలేదు. ఇది ఆయ‌న అహాన్ని దెబ్బ‌తీసింది. మ‌రో ద‌ఫా మాత్ర‌మే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన‌ని ఆయ‌న వారాంత‌పు ప‌లుకుల జ‌ర్న‌లిస్ట్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తాజాగా చెప్పారు. ప్ర‌తి ద‌ఫా పార్టీ మారుతున్న‌ప్పుడ‌ల్లా అధినేత‌ల్ని విమ‌ర్శించ‌డం ఆనం రామనారాయ‌ణ‌రెడ్డికి అల‌వాటైంది.

మొట్ట‌మొద‌ట ఆయ‌న టీడీపీ నుంచి రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లు పెట్టారు. ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రిగా ప‌ని చేశారు. ఆ త‌ర్వాత కాంగ్రెస్‌లో చేరి వైఎస్సార్‌తో స‌న్నిహితంగా ఉన్నారు. వైఎస్సార్ మ‌ర‌ణానంత‌రం టీడీపీలో చేరారు. బాబు పాల‌న‌పై ప్ర‌జావ్య‌తిరేక‌త వుంద‌ని గ్ర‌హించారు. దీంతో బాబుకు దూరంగా ఉంటూ వ‌చ్చారు. 2019లో వైసీపీలో చేరి వెంక‌ట‌గిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2024 ఎన్నిక‌ల స‌మీపిస్తున్న నేప‌థ్యంలో సొంత పార్టీపై అకార‌ణంగా విమ‌ర్శ‌లు.

మ‌ళ్లీ టీడీపీలో చేర‌డానికి ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడ్డం మొద‌లు పెట్టారు. 2014కు ముందు ప‌దేళ్ల‌కు ఒక‌సారి పార్టీ మారిన ఆనం, తాజాగా ఐదేళ్ల‌కో సారి జంప్ కావాల‌ని నిబంధ‌న పెట్టుకున్న‌ట్టున్నారు. ఈయ‌న కూడా రాజ‌కీయంగా సూక్తులు చెబుతున్నారు. రాజ‌కీయ పెద్ద మ‌నిషిగా పేరు పొందిన ఈయ‌న‌గారి హిత‌వ‌చ‌నాలు వినాల్సి రావ‌డం ప్ర‌జ‌ల ఖ‌ర్మ కాక‌పోతే మ‌రేంటి?