తన అనుభవమంత వయస్సు వైఎస్ జగన్‌కు లేదని చంద్రబాబు పదేపదే అంటుంటారు. నిజమే, జగన్ చిన్నవాడే. అయితే వైఎస్ జగన్ రాజకీయంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ఒక్కసారి ఏదైనా అంశంపై ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత, ఇక రెండో ఆలోచన చేయరు. లాభమో, నష్టమో ముందుకెళ్లడమే. టికెట్ల విషయంలోనూ జగన్ అదే రీతిలో వ్యవహరిస్తున్నారు.
జగన్‌లా నిర్ణయాలు తీసుకునే దమ్ము చంద్రబాబుకు ఉందా? అనే చర్చకు తెరలేచింది. ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, కోఆర్డినేటర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం అవుతున్నారు. ముందస్తు ఎన్నికలపై విస్తృతంగా ప్రచారం అవుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ముందస్తు ఎన్నికలొస్తాయన్న ప్రచారాన్ని వైసీపీ కొట్టిపారేస్తోంది. ఇదంతా తన కేడర్‌ను కాపాడుకునేందుకు టీడీపీ ఆడుతున్న నాటకమని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.
ఇదిలా వుండగా సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధం కావడంపై జగన్ మరోసారి దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే పలు దఫాలు సమావేశాలు నిర్వహించి, రానున్న ఎన్నికలకు ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ఆయన తన అభిప్రాయాల్ని ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లతో పంచుకున్నారు. సర్వే నివేదికల ఆధారంగా టికెట్లు ఇస్తానని స్పష్టం చేశారు. గెలుపే ప్రామాణికంగా టికెట్లు ఇస్తానని, ఇందులో మరో మాటకు తావులేదని తేల్చి చెప్పారు.
ప్రజల ఆదరణ చూరగొనని వారిలో సన్నిహితులున్నా పక్కన పెడతానని జగన్ గట్టిగానే చెప్పారు. ఇప్పటికే పలువురికి టికెట్ల ఇవ్వననే సంగతిని కూడా సదరు ఎమ్మెల్యేలకు జగన్ తేల్చి చెప్పారు. టికెట్లు దక్కవనే అసంతృప్తి, ఆగ్రహంతోనే ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీకి మద్దతు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తలపడే అభ్యర్థులను ఎంతో ముందుగా ప్రకటించాలనే ఆలోచనలో జగన్ ఉన్నారు. టికెట్లు దక్కిన వారు నియోజకవర్గాల్లో నిత్యం ప్రజల్లో ఉంటారని, దక్కని వారు తమ దారేదో చూసుకుంటారని జగన్ అనుకుంటున్నారు.
టికెట్లు దక్కని వారి వల్ల నష్టమేదో ఎన్నికలకు ముందే జరిగిపోతుందని జగన్ ఆలోచిస్తున్నారని సమాచారం. ఎన్నికల సమయానికి టికెట్లు దక్కని నేతల వల్ల పెద్దగా నష్టం ఉండదనే అంచనాలో జగన్ ఉన్నారు. అయితే జగన్‌లా చంద్రబాబు చేయగలరా? అనేది ప్రశ్న. టీడీపీకి ఇప్పటికీ సరైన అభ్యర్థులు లేరు. చంద్రబాబు చూపంతా వైసీపీ అసంతృప్తులపై వుంది. వారెంత మంది వుంటారనేది అంతు చిక్కడం లేదు.
ఇప్పుడున్న వారిలో సీటు ఇవ్వనని చెప్పే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేదు. ఎందుకంటే చిన్న వ్యతిరేకతను కూడా చంద్ర బాబు తట్టుకోలేరు. భయాందోళనకు గురవుతారు. ఏమవుతుందోననే ఆందోళనకు గురవుతుంటారు. బాబు మొహమాటమే టీడీపీకి రాజకీయంగా నష్టం చేస్తోంది. దాని నుంచి ఆయన బయటపడడం అసాధ్యం. గతంలో కాపుల రిజర్వేషన్‌పై జగన్ వారి అడ్డాకే వాళ్లే ఇవ్వలేనని తేల్చి చెప్పారు. ఇలా చంద్రబాబు చెప్పలేకపోయారు.
పైగా ఇస్తానని నమ్మబలికి మోసగించారనే చెడ్డపేరును సంపాదించుకుని, ఎన్నికల్లో మూల్యం చెల్లించుకున్నారు. జగన్ నిర్వహిస్తున్న వరుస సమావేశాలు… అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోడానికే అని అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ, లేదా మరో ఒకట్రెండు సమావేశాలకు వైసీపీ అభ్యర్థులపై ఒక క్లారిటీ రానుంది. ఇదే టీడీపీ విషయానికి వస్తే… నామినేషన్లు వేసే చివరి నిమిషం వరకూ స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఇదే జగన్, చంద్రబాబు మధ్య తేడా.