రాయలసీమలోని అనంతపురం జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటైన రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన నేత దీపక్ రెడ్డి. వికేంద్రీకరణ బిల్లు చర్చ సందర్భంగా శాసనమండలిలో హల్చల్ చేసిన వారిలో ఈయనా ఒకరు. నారా లోకేష్ తర్వాత గట్టిగా అరిచి నినాదాలు చేసింది ఈయనే అని సమాచారం! ఈ దీపక్ రెడ్డి ఎవరో కాదు.. జేసీ బ్రదర్స్ కు అల్లుడి వరస! అంతే కాదు.. దేశంలోనే అత్యంత రిచెస్ట్ పొలిటీసియన్లలో ఒకరిగా పేర్గాంచారు.
అప్పట్లో జగన్ సొంత పార్టీని పెట్టినప్పుడు వచ్చిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున రాయదుర్గం నుంచి పోటీ చేశారు ఈ దీపక్ రెడ్డి. అప్పుడు తన ఆస్తులు డిక్లేర్డ్ చేయడం ద్వారా ఈయన దేశంలోనే అత్యంత ధనికుల్లో ఒకరిగా నిలిచారు. దేశంలో అత్యంత కరువును ఎదుర్కొనే ప్రాంతాల్లో రాయదుర్గం ఒకటి. అలాంటి చోట దేశంలోనే అత్యంత రిచెస్ట్ పొలిటీషియన్ ఉన్నారు!
మైనింగ్స్ ద్వారా దీపక్ రెడ్డి ఆ స్థాయిలో ఆస్తులు కూడబెట్టినట్టుగా భోగట్టా. ఇప్పుడు మైనింగ్స్ వ్యవహారాలతో సహా అనేక వ్యవహారాల్లో దీపక్ రెడ్డి మామలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో తమ రాజకీయం, తమ ప్రాంతం ఏమై పోయినా ఫర్వాలేదు.. చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా చేయడమే తమ విధి అన్నట్టుగా వీరు వ్యవహరిస్తూ ఉన్నారు. అసెంబ్లీ బయట జేసీ బ్రదర్స్ చిందులు తొక్కుతూ ఉంటే, వీరి అల్లుడు శాసన మండలిలో హల్చల్ చేశారు.
ఇంత చేస్తే వీళ్లకు ఏమొస్తుంది? అంటే.. ఏదో జగన్ మీద కక్ష తప్ప అంతకు మించి వీరిని చంద్రబాబు ఉద్దరించేది ఏమీ లేదు. అందులోనూ వీరి ప్రాంతానికి హై కోర్టు దక్కుతున్నా సహించలేకపోతున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇదీ రాయలసీమ తెలుగుదేశం పార్టీ నేతలకు సీమ మీద ఉన్న నిబద్ధత. హై కోర్టుతో ఏమొస్తుంది? అంటూ ఒక వెకిలి ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఏమీ రాకపోతే మానిలే, అది శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమకు దక్కాల్సింది కాదా? కాదని చెప్పగలరా? వైజాగ్ దూరం అని అంటారా.. అయితే అమరావతి రాయలసీమకు దగ్గరా?
కేవలం తమ వ్యాపార సామ్రాజ్యాలు దెబ్బతినకూడదనే తప్ప.. రాయలసీమ ప్రాంతం నుంచి ఎన్నికైన తెలుగుదేశం నేతలకు.. ఆ ప్రాంతం మీద వీసవెత్తు మమకారం అయినా కనపడటం లేదు. అదే మాత్రం ఉన్నా.. .మరీ ఇలా చంద్రబాబు భక్తుల్లా చెలరేగిపోరు.