రాజకీయం మాది, అనుభవం మాది అని ఈ రోజుల్లో ఎవరైనా గట్టిగా చెప్పుకుంటే నగుబాటే మరి. ఇది ఇంటర్నెట్ యుగం. ఎక్కడ ఏ రకమైన పాలిట్రిక్స్ సాగుతోందో ఇట్టే పసిగట్టేసే తరం నడుస్తోంది.
పూసపాటి వారికి విజయనగరంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. రాజులుగా పాలించారు. ప్రజాస్వామ్యంలో మంత్రులుగానూ అలరించారు. ఎన్ని చేసినా మాత్రం విజయనగరాన్ని పెద్ద పల్లెటూరు కంటే ముందుకు తీసుకెళ్ళలేకపోయారు.
ఇవన్నీ ఇలా ఉంటే వైసీపీ సర్కార్ ప్రతిపాదించిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా అధినేత చంద్రబాబు మాటే వేదం అన్నారు అశోక్ గజపతిరాజు. తమ ప్రాంతాలు బాగుపడకపోయినా ఫరవాలేదు, పార్టీయే బాగుండాలన్న థియరీ ఇదన్నమాట.
దీనికోసం రాజావారు విజయనగరంలో సంతకాల సేకరణ అమరవతికి అనుకూలంగా చేశారు. ఎందరు అమరావరికి జై అన్నారో తెలియదు కానీ ఆయన సొంత కుటుంబంలో మాత్రం జగన్ కి జై అన్న నినాదం వినిపించడమే విచిత్రమూ, విడ్డూరమూనూ.
మూడు రాజధానులు ఏపీలో ఉండాలని, ప్రత్యేకంగా విశాఖను పాలనా రాజధానిగా చేస్తూ జగన్ తీసుకున్న ఈ నిర్ణయం శభాష్ అంటూ పొగిడేసారు అశోక్ గజపతి రాజు అన్న కూతురు సంచిత.
ఆమె ఎవరో కాదు, మంత్రిగా, ఎంపీగా పనిచేసిన ఆనందగజపతిరాజు కుమార్తె. ఆమె బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు కూడా. అధికార వికేంద్రీకరణకు బీజేపీ కట్టుబడిఉందని కూడా ఆమె చెప్పారు.
వెనకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు న్యాయం జరగాలంటే ఈ మూడు రాజధానులతో ముందుకు వెళ్ళాలని కూడా ఆమె అనడం విశేషం. మరి ఎంతో అనుభవం ఉన్న బాబాయి అశోక్ మాటను అడ్డంగా కొట్టేస్తూ అమ్మాయి చేసిన ఈ ప్రకటన ఇపుడు సంచలనంగా ఉంది.