దేవుడు మంచివాడు అయితే సరిపోదు.. పూజారి దుర్మార్గుడు అయినా సరే అందరూ ఆ దేవుడిని తిట్టుకుంటారు. మంత్రులు దుర్బుద్ధి గలవారు అయ్యుండగా మంచి పేరు తెచ్చుకున్న మహారాజు కథ మనకు ఏ ‘చందమామ’లోనూ కనిపించదు. సహాయకులు సలహాదారులు అసమర్థులు అయితే రాణించిన వ్యాపార సామ్రాజ్యం మనకు కనిపించదు.
ఈ ఉదాహరణలన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే.. మన చుట్టూ ఎవరు ఉన్నారు, మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం అనేదాన్ని బట్టి మనలోని ప్రతిభాసామర్థ్యాలు మన్నన పొందుతాయి. ఈ సిద్ధాంతాన్ని ఆకళింపు చేసుకోవడం మనబోటి మామూలు మనుషుల కంటే, జగన్ వంటి ప్రజా నాయకులకు అవసరం. సుదీర్ఘకాలం ప్రజాజీవితంలోనే- అధికారంలోనే ఉండాలని అనుకుంటున్న వారికి అత్యవసరం. ఆయన ఎలాంటి విషవలయం నడుమ చిక్కుకొని ఉన్నారో తెలియజెప్పే ప్రయత్నమే ఈ వారం కవర్ స్టోరీ.
‘రాష్ట్రంలో ఏ ఒక్క పేద కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బంది కారణంగా మెరుగైన జీవితానికి దూరం కాకూడదు’ అనేది ఒక్కటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎజెండా. అందుకు జగన్ ఎంచుకున్న మార్గం.. నవరత్నాలు! నవరత్నాల రూపేణా ప్రజల ఆర్థిక అవసరాలకు ప్రభుత్వం దన్నుగా నిలవడం. నిత్యావసరాల పంపిణీ ద్వారా.. పేద ప్రజల దైనందిన జీవితానికి ప్రభుత్వం అండగా నిలుస్తూనే ఉంది. అయితే.. వారి సాధారణ జీవనగమనానికి అదనంగా పడే ప్రతి భారాన్ని ఇవాళ ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం పంచుకుంటోంది. పిల్లలను చదివిస్తున్న వారి ఫీజులు, చిన్న చిన్న వ్యాపారాల ద్వారా ఉపాధి పొందుతున్న వారికి పెట్టుబడి ఖర్చులు, అన్నదాతలకు సేద్యపు ఖర్చులు, విదేశాల్లో ఉన్నత విద్యకు కాగల ఖర్చులు.. ఇలా అనేక రూపాల్లో ప్రభుత్వం ఆర్థిక సహాయాలను అందిస్తోంది. రాష్ట్రంలో కోట్ల మంది ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. నాలుగేళ్లలో వేల నుంచి లక్షల రూపాయల వరకు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు అనేకం ఉన్నాయి.
ఇదంతా ఎందుకు ప్రస్తావించవలసి వస్తున్నదంటే.. పేదల పట్ల ఇంతగా శ్రద్ధ చూపించే ముఖ్యమంత్రికి తన సొంత పార్టీ మీద, సొంత పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఫోకస్ ఉండదా? అనేది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న! ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో జగన్మోహన్ రెడ్డి గానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగానీ పెద్దగా కంగారు పడలేదు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో అది రాజకీయ సర్కస్ లాగా జరిగిన తంతులో తెలుగుదేశం ఒక సీటు దక్కించుకుంది. ఇప్పటికే వైసీపీ పక్కన పెట్టిన, వచ్చే ఎన్నికల్లో టికెట్ నిరాకరించిన- గతిలేని ఎమ్మెల్యేలను- నలుగురిని పోగేసుకుని గట్టున పడింది. వారి ద్రోహం గురించి జగన్ కు పట్టింపులేదు. అదే సమయంలో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలకపక్షాన్ని కంగారు పెడుతుందని అందరూ అనుకున్నారు.
కానీ వైఎస్సార్ కాంగ్రెస్ లో ఆ కంగారు కూడా లేదు. ఉద్యోగ ఉపాధి అవకాశాల పరంగా పట్టభద్రుల్లో కొంత అసంతృప్తి ఉండవచ్చుననే సంగతి వారికి ఆల్రెడీ తెలుసు. ఎటూ విశాఖ గ్లోబల్ మీట్ తర్వాత, ఎన్నికల్లోగా కొన్ని పరిశ్రమలు కార్యరూపం దాల్చినా.. పట్టభద్రుల్లోని అసంతృప్తి ఆవిరి అయిపోతుందని, ఉద్యోగావకాశాల కల్పనలో జగన్ చిత్తశుద్ధిని రాష్ట్రమంతా అర్థం చేసుకుంటుందని వారు నమ్ముతున్నారు. అదే సమయంలో.. తమ ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులు పట్టభద్రులు కారనే వాదన కూడా వారికి ఉంది. డైరెక్టు లబ్ధిదారులు అయిన పేదల తమ ప్రభుత్వం పట్ల ఆదరణతో జగన్ పట్ల ప్రేమతో ఎప్పటికీ ఉంటారనే నమ్మకం ఉంది.
కేవలం ఓట్లువేసి తనకు అధికారం కట్టబెడుతున్న వారికోసమే ఇంత చేస్తున్నప్పుడు పార్టీ వారికోసం జగన్ ఏమీ చేయలేకపోతున్నారా? ఈ ప్రశ్న పార్టీలో తాజాగా తలెత్తుతున్న చర్చ. క్షేత్రస్థాయికి వెళ్లేకొద్దీ దీనికి ఉపచర్చలు కూడా అనేకం. ఇది నిజమేనా? జగన్మోహన్ రెడ్డి పార్టీని, కార్యకర్తలను పట్టించుకోవడం లేదా? శ్రేణులను విస్మరిస్తున్నారా? అవునో కాదో గానీ.. ఇలాంటి మాటలు చాలా వినిపిస్తుంటాయి. వీటినన్నిటినీ ఏకపక్షంగా నమ్మడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే సోషల్ మీడియా విశృంఖల రూపందాల్చి రాజకీయ పార్టీల చేతిలో వక్రమైన అస్త్రంగా మారిన నేటి రోజుల్లో ఒక పార్టీని బద్నాం చేయడానికి ప్రత్యర్థి పార్టీలు అనుసరించే అనేకానేక దొంగపద్ధతుల్లో ఇది కూడా ఒకటి కావొచ్చు. అలాగని ఆ వాదనను పూర్తిగా కొట్టి పారేయడానికి కూడా వీల్లేదు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటినుంచి ఆయన అపాయంట్మెంట్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా దొరకదని ఒక ప్రచారం నడుస్తూ వచ్చింది. ఇది పూర్తిగా నిజం కాకపోయినప్పటికీ.. అప్పటికే కోవర్టులుగా ముద్రపడి, జగన్ పక్కన పెట్టిన నాయకులు కొందరు ఈ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎంత కాదనుకున్నా నిప్పులేనిదే పొగరాదు. కాబట్టి ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని గమనించడం కూడా అవసరం..
శ్రేణుల విస్మరణ ఆత్మహత్యా సదృశం!
జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్ప ప్రజారంజకుడైన పరిపాలకుడు అయినా కావొచ్చు. కానీ.. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉండేది కార్యకర్తలే అనే ప్రాథమిక సూత్రాన్ని ఆయన విస్మరించడం తగదు. ప్రత్యర్థి పార్టీ అయినా సరే, తెలుగుదేశాన్ని చూసి నేర్చుకోవాల్సిన విషయాల్లో ఇది కూడా ఒకటి. కార్యకర్తలు, శ్రేణులను కాపాడుకోవడంలో ఆ పార్టీ ముందంజలో ఉంటుంది. వారికి ఎప్పటికీ అదే బలం. ఒక్కసీటు కూడా గెలవలేకపోయిన తెలంగాణలో.. మళ్లీ ఆ పార్టీ ఆశలు పెంచుకుంటున్నదంటే కార్యకర్తల బలమే కారణం.
ఏపీలో జగన్ చేతిలో అతిఘోరమైన పరాభవానికి గురై కేవలం 23 సీట్లకు పరిమితమై, నలుగురు పార్టీని వీడిపోగా, మరికొందరు నిశ్శబ్దం వహించగా కునారిల్లిపోయిన పార్టీ ఇప్పుడు అధికారంలోకి రాగలమని ధీమాగా పలుకుతున్నదంటే కార్యకర్తల బలమే కారణం. కార్యకర్తల విలువ గురించి జగన్ కు కూడా తెలుసు. అయితే వారికోసం ఆయన ప్రత్యేకంగా ఏం చేస్తున్నారనేది అర్థం కాని సంగతి.
చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే.. ముందుచేసే పని కార్యకర్తల్ని, శ్రేణుల్ని కింది స్థాయి నాయకుల్ని ఆర్థికంగా పరిపుష్టం చేయడం. కార్యకర్తలు నాయకులు అందరూ ఆర్థికంగా స్థితిమంతులు అయ్యే మార్గాలను సృష్టించడం. ఎన్ని విమర్శలు ఎదురైనా ఆయన కార్యకర్తల కోసం లాకులు తెరిచేవాళ్లు. జగన్ ఆ పనిచేయలేకపోయారన్నది నిజం. కొన్ని చోట్ల అయితే నామినేటెడ్ పోస్టులను కూడా సకాలంలో భర్తీ చేయకుండా జాప్యం చేశారనే నింది ఉంది.
అన్నిటికంటె మించి, జగన్ సర్కారు ఏర్పడిన తర్వాత చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేసిన వారికి బిల్లులు రాకపోవడం కూడా ఒకటి. అంతకంటె ఘోరమైన సంగతి ఏంటంటే.. తెలుగుదేశం హయాంలో కాంట్రాక్టులు చేసిన వారు.. జగన్ కోటరీలోని కొందరు వ్యక్తులను మేనేజ్ చేసి, వారికి వాటాలు ముడుపులు సమర్పించుకుని తమ బిల్లులు పొందేశారనేది.
ఇది ఖచ్చితంగా వైసీపీ సర్కారులో పనులు చేసిన వారికి కడుపుమండించే విషయం. దీనికి సంబంధించిన ఆరోపణలు వైఎస్ జగన్ పేషీలో ఉండే పెద్దలు, ఆయన సొంత మనుషులుగా ప్రభుత్వంలో చక్రం తిప్పే ప్రముఖుల మీదనే ఉండడం విశేషం. వైసీపీ కార్యకర్తలుగా ఉంటూ చిన్న చిన్న కాంట్రాక్టు పనులు తీసుకుని చేసిన వారు బిల్లులు రాక అప్పులపాలై అవస్థలు పడుతున్న ఉదంతాలు ఉన్నాయి. అలాంటి కార్యకర్తల కడుపుమంట పార్టీకి ఎలాంటి ఫలితం ఇస్తుంది? జగన్ దృష్టి సారించాల్సిన విషయం ఇది.
‘వలయం’ మీదనే సమస్త నిందలు!
దేవుడు మంచోడైతే చాలదు.. పూజారి కూడా మంచోడు అయిఉండాలని, తేడా వస్తే చెడ్డ పేరు మాత్రం దేవుడికేనని ముందే చెప్పుకున్నాం. జగన్ పాలనలో ఇంచుమించు అదే పరిస్థితి కనిపిస్తోంది. జగన్ ను మరపించేంతగా ఆయన సర్కారులో చక్రం తిప్పుతున్న ప్రముఖులు ఉన్నారు. ‘ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చి మాట్లాడవలసిన సందర్భం ఇది’ అని అందరూ ఎదురుచూసే, ఊహించే ప్రతి సందర్భంలోనూ మీడియా ముందుకు వచ్చే పెద్దలు, ముఖ్యమంత్రి మాటను మాత్రమే తాను తెలియజేస్తున్నట్టుగా అన్ని శాఖల అధికారుల మీదనూ పెత్తనం చెలాయించే పెద్దలు కొందరు ఉన్నారు. వారిని ముఖ్యమంత్రి ఎంత ఘోరంగా విశ్వసిస్తూ ఉంటారంటే.. వారి చేతలు తన ఇమేజిని దెబ్బతీస్తున్నా యో గమనిచంలేనంత అంధత్వంలోకి ఆయనను నెట్టేసేంత విశ్వాసం. ఉదాహరణకు వ్యవహారం ఇలా ఉంటుంది.
ఏ పార్టీ నాయకుడో జగన్ తో భేటీ కాగల అవకాశం దొరకబుచ్చుకుని వచ్చి కలుస్తారు. అందరూ అనుకునేట్టు అది అసాధ్యం కాదు. అలాంటి భేటీలు వందల మంది పార్టీ నాయకులకు జరుగుతూనే ఉంటాయి. వారు వచ్చి ఏదో తమ కష్టాలు నివేదించుకుంటారు. వాటి విషయంలో వారికి మేలు జరిగేలా జగన్ ఒక నిర్ణయానికి కూడా వస్తారు. తన కోటరీలోని ప్రముఖుడిని పిలిచి.. ఫలానా నాయకుడికి ఫలానా పని చేయాల్సిందే అని పురమాయిస్తారు. ఆయన ఎదుట.. సదరు కోటరీ పెద్ద కూడా తలాడించి, ‘తప్పకుండా సర్’ అనేస్తారు. సదరు కార్యర్థియై వచ్చిన నాయకుడు.. సీఎం జగన్ అంతటి వాడు వరమిచ్చాడు కదా అని మురిసిపోతాడు.
కానీ అసలు కష్టం అప్పుడే మొదలవుతుంది. ఆ మరు రోజునుంచి సదరు ‘కోటరీ పెద్ద’ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆయన పట్టించుకోడు. పదులసార్లు ప్రదక్షిణలు చేసినా పని జరగదు. ఒకే పని మీద రెండోసారి జగన్ వద్దకెళ్లేంత చనువు చాలా మందికి ఉండదు. కోటరీ పెద్ద మీద పితూరీ చెప్పేంత ధైర్యం అసలు ఎవ్వరికీ ఉండదు. దీనిని అడ్డు పెట్టుకుని సదరు కోటరీ పెద్దలు జగన్ ప్రసాదించిన వరాన్ని కూడా అమలు చేయకుండా వేధిస్తుంటారు. ఏతావతా ఏమవుతుందంటే.. ‘‘జగన్మోహన్ రెడ్డి తీరే అంత.. ఆయన మన ముఖప్రీతికోసం వరం ఇస్తారు గానీ.. వాస్తవంలో కార్యకర్తలకు పనిచేయరు’’ అనే చెడ్డపేరు ప్రబలుతుంది. ఈలోగా.. అదే కోటరీ పెద్దలు తెలుగుదేశం నేతల పనులను వాటాలకు, లంచాలకు కక్కుర్తి పడి చక్కబెట్టేస్తుంటారు. ఇది వైసీపీ శ్రేణులకు మరింతగా కడుపు మండిస్తుంటుంది.
వలయం కాదు.. విష‘వల’యం!
జగన్ చుట్టూ కోటరీ రూపంలో నడుస్తున్నది సాధారణమైన వలయం కాదు. అత్యంత హానికారకమైన విషవలయం. జగన్మోహన్ రెడ్డి తన అపురూపమైన సంక్షేమ పథకాల ద్వారా.. ప్రజల్లో అపరిమిత ఆదరణను, ప్రేమను నిర్మించుకుంటూ.. ఈ విషవలయంలోని పెద్దలు.. అదే ప్రేమ ఆదరణలను పార్టీ కార్యకర్తల్లో చంపేస్తుంటారు. రాజకీయపార్టీల్లో ప్రత్యర్థుల కోవర్టులు ఉండడం చాలా సహజం. ప్రతి పార్టీ కూడా ఇలాంటి వారిని పోషిస్తుంటుంది. కానీ.. జగన్ కు అత్యంత విశ్వసనీయమైన, అత్యత సన్నిహితమైన వలయంలో ఉండే.. జగన్ తరఫు సకల నిర్ణయాధికారాలు, సకల అధికార వైభవాలు కలగి ఉండే పెద్దలు కూడా కోవర్టులా అని అనుమానం పుట్టేలాగా వ్యవహారాలు ఉండడం బాధాకరం.
అందుకే జగన్ లో కదలిక రావాలి. సొంతమైన ఆలోచన రావాలి. తాను సలహాదారుల పదవులను సృష్టించినది కేవలం తన ఆప్తులకు అధికార పునరావాసం కల్పించడానికి మాత్రమే తప్ప.. వారు తనకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం మీద పెత్తనం చేయడానికి కాదు అనే స్పృహ ఆయనకు ఉండాలి. పార్టీ కార్యకర్తల్లో స్ఫూర్తి, విశ్వాసం సడలిపోకుండా, పార్టీ పట్ల శ్రేణుల్లో ప్రేమ ఆదరణ సన్నిగిల్లిపోకుండా చూసుకోవడం జగన్ బాధ్యత. అధికార బాద్యతలను, అవసరాన్ని బట్టి ప్రభుత్వం తరఫున చర్చలు జరిపే, సంజాయిషీలు చెప్పే బాద్యతను ఆయన ఇతరుల మీదికి నెట్టేయవచ్చు. కానీ.. పార్టీని కాపాడుకునే బాధ్యత పూర్తిగా తనదే అని ఆయన గ్రహించాలి. అప్పుడే పార్టీకి మంచి రోజులు వస్తాయి.
నిస్సందేహంగా, ఎలాంటి శషబిషలు భయాలు లేకుండా మరోసారి అధికారంలోకి రావడమూ, జగన్ సంకల్పిస్తున్నట్టుగా అదే క్రమంలో మరో ముప్పయ్యేళ్లపాటు ప్రజలకు సేవ చేయగల భాగ్యం దక్కడమూ కూడా సాధ్యమవుతుంది.
.. ఎల్. విజయలక్ష్మి