ఆంధ్రా గో బ్యాక్ అన్న బీజేపీ మంత్రి

బీజేపీకి సౌతిండియాలో కర్నాటక తప్ప ఎక్కడా అధికారం  లేదు. తెలంగాణాలో కాలూనుకోవడానికి ట్రై చేస్తోంది. తమిళనాడు, కేరళ, ఏపీల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఏపీకి పొరుగున ఉన్న ఒడిషాలో బిజూ…

బీజేపీకి సౌతిండియాలో కర్నాటక తప్ప ఎక్కడా అధికారం  లేదు. తెలంగాణాలో కాలూనుకోవడానికి ట్రై చేస్తోంది. తమిళనాడు, కేరళ, ఏపీల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఏపీకి పొరుగున ఉన్న ఒడిషాలో బిజూ జనతాదళ్ అన్న ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంది. గతంలో ఆ పార్టీకి ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉండేది

ఆ ప్లేస్ ని బీజేపీ ఆక్రమించింది. 2024లో జరిగే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చూస్తోంది. కానీ సీఎం నవీన్ పట్నాయక్ ని తట్టుకుని గెలవడం అంత ఈజీ కాదు. నవీన్ పట్నాయక్ కేంద్రంతో అవసరాల మేరకు మాత్రమే సయోధ్యతో ఉంటూ తన ప్రభుత్వాన్ని తన పార్టీని జాగ్రత్తగా చూసుకుంటున్నారు.

ఒడిషాకు ఏపీకి సరిహద్దు గ్రామాలు కొన్ని ఉన్నాయి. అవి శ్రీకాళం విజయనగరం జిల్లాలలను తాకి ఉన్నాయి . సమస్య అయితే కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంది. అక్కడ సాలూరు నియోజకవర్గంలోని ఇరవై కొటియా గ్రామాలు ఉన్నాయి. ఇవి ఒడిషాను ఆనుకుని ఉన్నాయి.

ఈ గ్రామాల ప్రజలు అయితే తాము ఏపీతోనే ఉండాలని స్పష్టంగా చెబుతున్నారు. కానీ ఒడిషా ప్రభుత్వం మాత్రం ఈ గ్రామాలు తమవే అంటోంది. ఇది ఈనాటి సమస్య కాదు దశాబ్దాల నాటిది. ప్రస్తుతం ఈ గ్రామాలు ఏ రాష్ట్రానికి చెందుతాయన్న దాని మీద సుప్రీం కోర్టులో కేసు ఉంది. ఆ విచారణ పూర్తి అయి తీర్పు వచ్చేవరకూ ఈ ఇరవై గ్రామాల ప్రజలు రెండు రాష్ట్రాలకూ చెందిన వారే.

ఇంత చిన్న విషయం కూడా తెలియదా  లేక అహంకార పూరిత వైఖరా అన్నది తెలియదు కానీ ఒడిషాకు చెందిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొటియా గ్రామాలకు వచ్చే ఆంధ్రా నాయకులను గో బ్యాక్ అని పెద్ద మాటే వాడేశారు. దీని మీద ఏపీకి చెందిన ఉప ముఖ్యమంత్రి సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రిగా దేశానికి బాధ్యత వహిస్తున్న వ్యక్తి ఇలా గో బ్యాక్ ఆంధ్రా అని మాట్లాడమేంటి అని రాజన్న దొర మండిపడ్డారు. ఇది మీకు తగని పని అని హితవు చెప్పారు. కొటియా గ్రామాల సమస్య సుప్రీం కోర్టులో ఉందని అందరికీ తెలుసు. అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా గౌరవించని తీరులో కేంద్ర మంత్రి ఉన్నారా అని ప్రశ్నించారు.

ఈ సమస్య సామరస్యంగా న్యాయసమ్మతంగా తీరే వరకూ ఓపిక పట్టాలని అన్నారు. అప్పటిదాకా కొటియా గ్రామాల మీద ఏపీ ఒడిషా రాష్ట్రాలకు ఈ గ్రామాల మీద హక్కు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఒడిషాలో చూస్తే బిజూ జనతాదళ్ అధికారంలో ఉంది. అయినా సహనంతోనే ఆ పార్టీ మంత్రులు నేతలు ఉన్నారు. అదే ఒడిషాలో అధికారంలోకి వద్దామనుకుంటున్న బీజేపీ పెద్దలు ఇపుడే ఇలా మాట్లాడితే రేపు పోలవరం ఇష్యూ కానీ వంశధార సమస్య కానీ సరిహద్దుల సమస్యలు ఏవైనా ఇలాగే ఆంధ్రా గో బ్యాక్ అంటారా. జాతీయ పార్టీ అని చెప్పుకుంటూ ఇలాగేనా వ్యవహరించేది అని ప్రజా సంఘాల నేతలు మేధావులు ప్రశ్నిస్తున్నారు.