ఈ సంక్రాంతికి నిజమైన విన్నర్, లాభాలు ఆర్జించిన వ్యాపారి ఎవరు అంటే దిల్ రాజే. దాదాపు ఈ సంక్రాంతికి ఆయనకు ఇరవై కోట్ల మేరకు లాభాలు వస్తున్నాయి. ఇందులో సరిలేరు సినిమా ఇచ్చిన లాభాలు వున్నాయి. అల వైకుంఠపురములో సినిమా లాభాలు వున్నాయి. అయితే టెక్నికల్ గా సరిలేరు సినిమా నిర్మాతగా దిల్ రాజు పేరు కూడా వుంది. కానీ వాస్తవానికి ఆ సినిమా నిర్మాణ వ్యవహారాలతో కానీ, పెట్టుబడి, జమా ఖర్చులతో కానీ ఆయనకు ఏ సంబంధం లేదు. అనిల్ సుంకర నే సోలో నిర్మాత.
అయితే బుధవారం జరిగిన సరిలేరు మీట్ లో దిల్ రాజు , అల వైకుంఠపురములో వేరే వాళ్ల సినిమా అయినట్లు, ఆయనకు ఏ బంధం లేనట్లు మాట్లాడడం విశేషం. కలెక్షన్ల గురించి మీడియా జనాలు ప్రస్తావిస్తే 'ఇది సరిలేరు సమావేశం, మా సినిమా గురించి, మా సక్సెస్ గురించే మాట్లాడతా..డీవియేషన్ వద్దు' అంటూ తప్పించుకోవడం విశేషం.
నిజానికి అల వైకుంఠపురములో సినిమా మీదనే దిల్ రాజు ఎక్కువ లాభాలను కమిషన్ రూపంలో ఆర్జిస్తున్నట్లు బోగట్టా. అలాంటి నేపథ్యంలో రెండూ మన సినిమాలే, మన టాలీవుడ్ సినిమాలే. రెండూ మంచిగా ఆడుతున్నాయి అని చెప్పకుండా, మేము, మా సినిమా అంటూ సరిలేరు తో మాత్రమే తనకు బంధాలు వున్నట్లు మాట్లాడడం ఏమిటో?
డిస్ట్రిబ్యూటర్ గా, మహేష్ తో తరువాత సినిమా నిర్మించబోతున్న నిర్మాతగా దిల్ రాజుకు ఇలా ఏరోటి దగ్గర ఆ పాట పాడక తప్పదేమో?