సినిమా నిర్మాణాలు పక్కన పెట్టి, తన వ్యాపారాలు తను చేసుకుంటున్న బండ్ల గణేష్ ను లాక్కొచ్చి, చాలా ఏళ్ల తరువాత మళ్లీ మొహానికి మేకప్ వేసి, కెమేరా ముందు నిల్చోపెట్టాడు దర్శకుడు అనిల్ రావిపూడి. బండ్ల గణేష్ కూడా తెగ ఉత్సాహ పడ్డాడు. యూ ట్యూబ్ లో ఫుల్ ఫాలోయింగ్ వున్న తనకు ఈ సినిమా టర్నింగ్ అవుతుందని, మనసులో తనకు అంతగా ఇష్టం లేకపోయినా, మళ్లీ నటుడిగా కెరీర్ స్టార్ట్ సినిమా సినిమారంగంలో వుండాలన్న తన కోరిక తీర్చుకుందామని అనుకున్నాడు బండ్ల గణేష్.
ఈ ఆశలు అన్నీ అడియాశలైపోయాయి. సరిలేరు సినిమాలో బండ్ల పాత్ర చాలా దారుణంగా వుందన్న కామెంట్లు వినిపించాయి. దీంతో బండ్లగణేష్ చాలా డీలా పడిపోయాడు. ముఖ్యంగా చుట్టాలు, స్నేహితులు, అతగాడి పిల్లల ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఆ క్యారెక్టర్ చూసి కామెంట్ లు విసురుతున్నారట. బండ్ల పిల్లలు కూడా 'నాన్నా నీకు ఈ వేషం అవసరమా' అని అడిగారట.
దాంతో ఫ్రస్టేట్ అయిన బండ్ల గణేష్ ఇప్పుడు దర్శకుడు అనిల్ రావిపూడి మీద కారాలు మిరియాలు నూరుతున్నాడట. అంతే కాదు అనిల్ రావిపూడి మీద నానా శాపనార్థాలు పెడుతున్నాడట. అనిల్ రావిపూడి చేసిన పని వల్ల తన పరువుపోయిందని, అమ్మ నాన్నల దగ్గర, అన్న, బంధువుల దగ్గర కూడా తలెత్తుకోకుండా చేసాడని బండ్ల వాపోతున్నాడట. తొంభైశాతం క్యారెక్టర్ ను తీసేసే ఉద్దేశం వున్నపుడు, మొత్తం తీసేసినా తాను బాధపడేవాడిని కాదని అంటున్నాడట.
కేవలం బాధపడడం కాదు, బండ్లను పలకరించిన ప్రతి ఒక్కరి దగ్గర అనిల్ రావిపూడిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నాడట బండ్ల గణేష్.