ఎమ్బీయస్‌: మండలిలో టిడిపి గెలిచినట్లా?

మూడు రాజధానుల బిల్లుకి మండలిలో బ్రేక్‌ పడింది. సెలక్టు కమిటీకి పంపబడింది. ఆ కమిటీ సవరణలు సూచించగలదు తప్ప బిల్లును తిరస్కరించలేదు. కనీసం మూడు నెలలు కాలయాపన జరుగుతుంది. సమయాన్ని పొడిగిస్తే మరో నెల!…

మూడు రాజధానుల బిల్లుకి మండలిలో బ్రేక్‌ పడింది. సెలక్టు కమిటీకి పంపబడింది. ఆ కమిటీ సవరణలు సూచించగలదు తప్ప బిల్లును తిరస్కరించలేదు. కనీసం మూడు నెలలు కాలయాపన జరుగుతుంది. సమయాన్ని పొడిగిస్తే మరో నెల! తిరస్కరించగల అధికారం మండలికే ఉంది. ఇవాళ తిరస్కరించి ఉంటే, మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టి, మళ్లీ మండలికి పంపితే వాళ్లు నెల రోజులు తీసుకుని మళ్లీ తిరస్కరించవచ్చు. అయినా అసెంబ్లీ మూడోసారి ఆమోదించి, గవర్నరు ఆమోదముద్రకు పంపగలదు. మండలి అభ్యంతర పెట్టింది అనే విషయాన్ని గుర్తు పెట్టుకుని గవర్నరు ఆమోదముద్ర వేయడంలో తటపటాయిస్తే తటపటాయించవచ్చు.

అసెంబ్లీలో అధికారపక్షానికి, మండలిలో ప్రతిపక్షానికి మెజారిటీ ఉన్నపుడు బిల్లు ఆమోదంలో ఆలస్యం తప్పదు. సెలక్టు కమిటీకి పంపకుండా ఉంటే నెల ఆలస్యం అయేది, పంపారు కాబట్టి యింకో మూడు నెలలు ఎక్కువగా అవుతుంది. సెలక్టు కమిటీకి నివేదించడమంటే మండలి పరిశీలనలో ఉన్నట్టే లెక్క కాబట్టి, యీలోగా ఆర్డినెన్సు జారీ చేయలేరు.

ఈ విధంగా బిల్లును జాప్యం చేయించడం తమ విజయంగా టిడిపి చెప్పుకోవచ్చు. రైతులు బాబుపై పూలవర్షం కురిపిస్తున్నారని ఎబిఎన్‌ రిపోర్టు చేస్తోంది. కానీ కాస్త తరచి చూస్తే టిడిపి పడుతున్న యిబ్బంది అర్థమౌతుంది. సెలక్టు కమిటీకి నివేదించడం లేదా బిల్లును తిరస్కరించడం – యీ రెండిటిలో ఏదో ఒకదాన్ని టిడిపి ఓటింగు ద్వారా సాధించవచ్చు. ఎందుకంటే మండలిలో దానికి మెజారిటీ ఉంది. 58 మంది సభ్యులుండగా  26 మంది ఆ పార్టీ వాళ్లే, బిల్లును వ్యతిరేకిస్తున్న బిజెపికి 3 ఉన్నాయి. స్వతంత్రులు 3, నామినేటెడ్‌ 8, పిడిఎఫ్‌ 5, నాలుగు ఖాళీలు. వైసిపి బలం 9 మాత్రమే. ఓటింగు పెట్టించి తమ తడాఖా చూపింవచ్చు. కానీ వాళ్లు కావలసినది సాధించుకోవడానికి చైర్మన్‌ను ఉపయోగించుకోవడం అనుమానాలు రేకెత్తిస్తోంది. ఓటింగుకి పెడితే తమకు పడాల్సినన్ని ఓట్లు పడవని లోకానికి తెలిసిపోతుందని టిడిపి భయపడినట్లుంది.

మూడు రాజధానుల అంశం చర్చకు వచ్చిన దగ్గర్నుంచి టిడిపి 'జై అమరావతి' నినాదం ఎత్తుకుంది – బిజెపి వాళ్ల జై శ్రీరామ్‌లా! అధికారంలో ఉన్నా, విపక్షానికి వచ్చినా వాళ్లకు అమరావతి తప్ప వేరేదీ ఆనటం లేదు. కృష్ణా, గుంటూరు జిల్లాల సంక్షేమం తప్ప తమకు వేరేదీ పట్టదన్నట్లు ప్రవరిస్తోంది. రాజధాని ముక్కలు కాకూడదు అనడం వరకు అర్థం చేసుకోవచ్చు. సెక్రటేరియట్‌ కూడా అమరావతిలో ఉండాలనడం వరకు అర్థం చేసుకోవచ్చు. కానీ హైకోర్టు కూడా తరలకూడదనడం అర్థం చేసుకోలేం. హైకోర్టు వస్తే ఏముంది? నాలుగు జిరాక్స్‌ సెంటర్లు వస్తాయి అని రాయలసీమ టిడిపి నాయకులు యీసడించారు. కనీసం ఆ నాలుగు జిరాక్స్‌ సెంటర్లు కూడా వదులుకోవడానికి గుంటూరు వాళ్లు సిద్ధంగా లేరా? గుంటూరు బార్‌ అసోసియేషన్‌ వాళ్లు హైకోర్టు కదల్చరాదని సమ్మె చేస్తుంటే వాళ్లకు 4 జిల్లాల వారు మాత్రమే దన్నుగా నిలబడ్డారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, నెల్లూరు కలిసి రావటం లేదు. 

ఒక రాష్ట్రం – ఒక రాజధాని అంటున్నారు బాబు. మరి ఒక దేశం – ఒక రాజధాని అనకుండా హైదరాబాదును దేెశానికి రెండో రాజధానిగా చేస్తామని బిజెపి అంటే బాబు అడ్డుపడతారా? అమరావతిలో ఎయిమ్స్‌ పెట్టారు, బిట్స్‌ పెట్టారు, యింకా బోల్డు సంస్థలు తెచ్చుకున్నారు. రాయలసీమకు కనీసం జిరాక్స్‌ సెంటర్ల హైకోర్టు కూడా యివ్వలేరా? టిడిపి మొండి వైఖరి వలన ఆ పార్టీ ఆ రెండు జిల్లాల వారికోసమే పని చేస్తోందన్న భావన కలుగుతోంది. అందువలననే ఉత్తరాంధ్ర, రాయలసీమ టిడిపి నాయకులు స్థానిక ఓటర్లకు ఎలా నచ్చచెప్పుకోవాలో తెలియక తబ్బిబ్బు పడుతున్నారు. మన ప్రాంతం కంటె అమరావతే ముఖ్యమా నీకు? అని ప్రజలు అడిగితే వాళ్లు ఏం సమాధానం చెప్తారు? అమరావతి ప్రాధాన్యతను తగ్గించడం ద్వారా కృష్ణా గుంటూరు జిల్లాలలో వైసిపి రిస్కు తీసుకుంటోంది. అసెంబ్లీలో ఆ జిల్లా నాయకులు మా రాజకీయ భవిష్యత్తు ఏమైనా సరే, రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం అన్నారు. 

అలాటి రిస్కు టిడిపి కూడా తీసుకుంటోంది – ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో! బుగ్గన చదివి వినిపించిన దాని ప్రకారం అన్ని పెరామీటర్లలో ఆ జిల్లాలే వెనకబడి ఉన్నాయి. అనంతపురం వాళ్లు బెంగుళూరుకు, శ్రీకాకుళం వాళ్లు హైదరాబాదుకి వలస వెళ్లి కూలీలుగా చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు వాళ్లు వలస వెళ్లేది అమెరికాకు డాలర్లు సంపాదించడానికి అనేది టెల్లింగ్‌ గా ఉంది. ఇది చివరకు ఉన్నవారికి, లేనివారికి మధ్య యుద్ధంలా తయారైంది. మా ప్రాంతాలు ఎప్పటికీ బాగుపడకూడదని బాబు ఆలోచనా? అనే ఆలోచన వెనుకబడిన జిల్లాల వాళ్లకు వచ్చిందంటే స్థానిక ఎన్నికలలో టిడిపికి దెబ్బ  టిడిపి విధానానికి కట్టుబడితే ఉత్తరాంధ్ర, రాయలసీమ, నెల్లూరులలోని ఆ పార్టీ నాయకులకు సంకటం తప్పదు. అందువలన మండలిలో వాళ్లు తమ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడమో, తటస్థంగా ఉండడమో చేస్తారని టిడిపి భయపడి వుండవచ్చు. అందుకే ఓటింగు జరగకుండా చూసింది.

టిడిపి పార్టీకి చెందిన నాయకుడు, ప్రస్తుత మండలి చైర్మన్‌గా ఉన్న ఎంఎ షరీఫ్‌ చాలా వింతగా ప్రవర్తించారు. రూలు ప్రకారం చేయకుండా మర్చిపోయానన్నారు. సెలక్టు కమిటీకి పంపాలని యనమల రామకృష్ణుడు చేసిన సూచనపై ఓటింగు నిర్వహించకుండా రూలు 154 కింద తన విచక్షణాధికారం ఉపయోగించి సెలక్టు కమిటీకి పంపుతున్నాను అన్నారు. ఆ మాట అనేముందు 'ఈ బిల్లును దానికి పంపకూడదు, అయినా నా విచక్షణాధికారం ఉపయోగించి పంపుతున్నాను' అని అన్నారని అంబటి రాంబాబు అంటున్నారు. ఎగ్జాక్ట్‌గా ఏమన్నారో రేపు పేపర్లు చూస్తే తప్ప తెలియదు. ఎందుకంటే వైసిపి ప్రత్యక్ష ప్రసారాలు ఆపేసింది. కాంగ్రెసు పార్టీ ఆంధ్ర విభజన బిల్లును పార్లమెంటులో పాస్‌ చేయించినప్పుడు యిలాటి వేషాలే వేసింది. ఆ పార్టీ నుంచి పుట్టినదే కాబట్టి ఆ వారసత్వమే వచ్చినట్లుంది. 

ఇలాటి అప్రజాస్వామిక పద్ధతులు దారుణం. 'స్పీకరు గారు తలెత్తి గ్యాలరీలో ఉన్న బాబు వైపు చూశారు. ఆయన చెయ్యి వూపాడు, యీయన తల వూపాడు' యిలాటి కథనాలు వైసిపి వాళ్లు చెప్పడం కంటె ఏం జరిగిందో మనల్నే చూడనివ్వాల్సింది. ఈ చర్యకు ఫలితం అనుభవించింది వైసిపి. మంత్రులంతా కంగు తిన్నారు. నిన్న రూలు నెం. 71 దగ్గర తిన్నారు, యివాళ చైర్మన్‌ చేతిలో తిన్నారు. వైసిపి అనుకున్నది అనుకున్నట్లు జరగలేదు. ఈ మూడు నెలల వ్యవధి మంచిదే. మన ప్రజాస్వామ్యంలో నిక్షేపించిన చెక్స్‌ అండ్‌ బాలన్సెస్‌ విలువ తెలుస్తోంది. ఈ వ్యవధిలో వాళ్లు తక్కినవారిని ఒప్పించే ప్రయత్నం చేస్తే ప్రతికూలత తగ్గవచ్చు. సెక్రటేరియట్‌ కూడా వైజాగ్‌కు తరలించాలా లేదా అన్నదానిపై పునరాలోచించుకోవచ్చు. 

ఇక టిడిపి సంగతికి వస్తే – దానికి కష్టకాలం దాపురించినట్లే. రెండు జిల్లాలలో తమ ముఖ్యనాయుకులు పెట్టిన పెట్టుబడులు కాపాడుకోవడానికి తక్కిన 11 జిల్లాలలో పార్టీ బలాన్ని పరీక్షకు గురి చేసుకుంటోంది. తన నాయకవర్గాన్ని, తన క్యాడర్‌ను తనే నమ్మలేని స్థితికి వచ్చింది. ఈ విషయం జనాలకు అర్థమైతే కౌన్సిల్‌లో విజయం కంటె రాజకీయంగా అపజయం కలిగిందనిపిస్తుంది.

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2020)
[email protected]