ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ట్వీట్ హీటెక్కిస్తోంది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయిన సింగర్ చిన్మయి ఎలాంటి అంశంపై నైనా ధైర్యంగా స్పందిస్తూ… ఒక్కోసారి వివాదాలను కొని తెచ్చుకుంటుంటారు. సినీ అవకాశాల కోసం అన్నీ భరిస్తూ నోర్మూసు కునే తత్వం కాదామెది. తాను చెప్పదలుచుకున్న విషయాన్ని నిర్మొహమాటంగా, ధైర్యంగా సోషల్ మీడియా వేదికగా చెంప పగలగొట్టినట్టు చెప్పడం ఆమె ప్రత్యేకత.
ఈ నేపథ్యంలో మరోసారి తన ట్వీట్ బాణాన్ని సంధించారామె. సమాజంపై ఘాటు వ్యాఖ్యలు చేయడం తాజా ట్వీట్ ప్రత్యేకత. సమాజం రేపిస్టులను మాత్రమే ప్రేమిస్తుందనే తీవ్ర వ్యాఖ్యలు చిన్మయి చేయడానికి దారి తీసిన పరిస్థితులేంటో తెలుసుకుందాం. 2017లో కేరళలో జరిగిన ఓ ఘటనకు సంబంధించి పలువురు సినీ సెలబ్రిటీలు గళం ఎత్తారు.
నటి కిడ్నాప్, అత్యాచార వేధింపుల కేసులో నటుడు దిలీప్ కుమార్ జైలుకు వెళ్లాడు. అనంతరం బెయిల్‌పై బయటికొచ్చాడు. అతనికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిలో ప్రముఖ మలయాల నటి పార్వతి తిరువోత్ ఉన్నారు. మహిళా సంఘాలతో కలిసి బాధిత హీరోయిన్‌కు మద్దతుగా ఆమె పోరాటం చేశారు.
అయితే ఆ పోరాటం మధ్యలోనే ఆగిపోయింది. కానీ బాధిత హీరోయిన్‌కి మద్దతుగా నిలిచి …సినీ అవకాశాలను కోల్పోవాల్సి వచ్చిందని పార్వతి వాపోయారు. తన సినిమాలు హిట్ అయినా సినిమా అవకాశాలు తగ్గాయని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వాపోయింది. నిజాన్ని నిర్భయంగా మాట్లాడ్డమే నేరమైందని ఆమె అన్నారు. ప్రస్తుతం రెండు సినిమాల్లో మాత్రమే నటిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
పార్వతి ఆవేదనపై సింగర్ చిన్మయి ట్విటర్ వేదికగా తనదైన రీతిలో హీటెక్కించే పోస్టు పెట్టారు.
'నిజం మాట్లాడినందుకు పార్వతి వంటి ఒక మంచి నటి పని కోల్పోయింది. అలాంటి నటి, లైంగిక వేధింపుల నుంచి తప్పించుకున్న వారి తరఫున మాట్లాడటం వల్ల మాత్రమే తన పని కోల్పోయిందని చెప్పడం నిజం. చాలా మంది మహిళలు మౌనంగా ఉన్నారు. రేపిస్టులను మాత్రమే సమాజం ప్రేమిస్తుంది' అని చిన్మయి హాట్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.