యువగళం పాదయాత్రతో తన నాయకత్వ సమర్థతను నిరూపించుకోవాలని తపన పడుతున్న నారా లోకేశ్ పరువు పోయింది. చంద్రబాబు అంటే విపరీతమైన ఇష్టాన్ని పెంచుకున్న మీడియాధిపతి వేమూరి రాధాకృష్ణనే లోకేశ్‌కు టీడీపీని నడపగలిగే శక్తి లేదని పరోక్షంగా చెప్పకనే చెప్పారు. ఆర్కే అమాయకత్వం ఒక్కోసారి టీడీపీ కొంప ముంచుతోంది. ఇటీవల జనసేనాని పవన్‌కల్యాణ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.1000 కోట్ల ఆఫర్ ఇచ్చారని ఆర్కే రాసి, ఆ తర్వాత నష్టనివారణ చర్యలకు దిగారు. అయితే ఈ లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
తాజాగా ‘చక్రం తిప్పేదెవరు?’ శీర్షికతో రాసిన వ్యాసంలో ఆర్కే తనదైన శైలిలో టీడీపీ భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘జాతీయ స్థాయిలో ఏ పదవీ కోరుకోకుండా తలో దారిలో పయనించే ప్రతిపక్షాల నాయకులను సంఘటితం చేయడంలో చంద్రబాబుకు నేర్పరితనం ఉంది. అయితే ఆయన ఇప్పుడు అస్త్ర సన్యాసం చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాలేకపోతే తన రాజకీయ జీవితం ముగుస్తుందన్న భయంతో పాటు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందన్న ఆందోళనతో కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించడానికి చంద్రబాబు ఇష్టపడటం లేదు’ అని రాసుకొచ్చారు.
చంద్రబాబుతోనే టీడీపీ ప్రస్థానం ముగుస్తుందని ఆర్కే తన వ్యాసంలో పరోక్షంగా రాసారు. అలాగే టీడీపీని సమర్థవంతంగా నడిపే వారసుడు లేడని ఆర్కే తన రాతలతో లోకానికి ఓ సందేశాన్ని ఇచ్చారు. అసలు లోకేశ్‌ను ఆర్కే పరిగణలోకి తీసుకోకపోవడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
లోకేశ్‌కు అంత సీన్ లేదని ప్రత్యర్థులు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. ప్రత్యర్థుల విమర్శలను సీరియస్‌గా తీసుకోనవసరం లేదు. కానీ ఎల్లో పత్రికాధిపతే స్వయంగా తన వ్యాసంలో టీడీపీ భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందన్న ఆందోళనతో కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు ఎదిరించడానికి ఇష్టపడడం లేదని రాయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబు తర్వాత లోకేశ్ చేతిలో పార్టీకి భవిష్యత్ లేదని ఆ పార్టీని మోస్తున్న మీడియా కూడా భావిస్తుందనేందుకు ఆర్కే తాజా రాతలే నిదర్శనంగా చెబుతున్నారు. అసలే అంతంత మాత్రమే ప్రజాదరణ కలిగిన నారా లోకేశ్‌కు సొంత మీడియాలో వచ్చే ఇలాంటి రాతలు మరింత నష్టం కలిగిస్తాయనే చర్చకు తెరలేచింది. కానీ చంద్రబాబు తర్వాత టీడీపీ అనేది కాలగర్భంలో కలిసిపోతుందనే ప్రచారానికి ఆర్కే రాతలు బలం కలిగిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మొత్తానికి ఆర్కే తన అభిమాన నాయకుడికి వారసుడైన లోకేశ్‌కు టీడీపీని నడిపించే తెలివితేటలు లేవని తేల్చి చెప్పారనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.