నీతిగా రాజకీయాలు చేసే వారెవరైనా ఆదర్శాల గురించి చెబితే వింటారు. రాజకీయాల్లో ఏ ఎండకు ఆ గొడుగు పట్టే కన్నా లక్ష్మీనారాయణ లాంటి నాయకులు కూడా పుట్టుకల గురించి మాట్లాడితే జనం అసహ్యించుకుంటారు. ఎందుకంటే ఒక సిద్ధాంతం, పద్ధతి, నిబద్ధత లేకుండా, అవకాశవాద రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంగా కన్నా లక్ష్మీనారాయణను తెలుగు సమాజం ఉదాహరణగా చెప్పుకుంటున్న పరిస్థితి.
నిన్నమొన్నటి వరకూ బీజేపీలో కొనసాగారు. అంతకు ముందు కాంగ్రెస్‌లో సుదీర్ఘ కాలం పాటు రాజకీయాలు చేశారు. మంత్రి పదవులు అనుభవించారు. తీరా ఆ పార్టీకి ఏపీలో భవిష్యత్ లేదని తెలియగానే ఇతర పార్టీలను వెతుక్కోవడం కన్నాకే చెల్లింది. తాజాగా వైసీపీపై టీడీపీ సీనియర్ నేతల కన్నా లక్ష్మీనారాయణ ఘాటు విమర్శల నేపథ్యంలో ఆయనకు నెటిజన్లు చీవాట్లు పెడుతున్నారు.
కన్నా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పుట్టుకే మోసమని ఘాటు విమర్శ చేశారు. ఆ పార్టీ దురుద్దేశంతో ప్రారంభమైందన్నారు. పార్టీ పేరు వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆచరణ మాత్రం రాజారెడ్డిదని తీవ్ర విమర్శలు చేశారు. ఒక్క అవకాశం అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేసి.. ధనదాహంతో పాలన చేస్తున్నారని కన్నా ఆరోపించారు. మోసపూరితంగా అవతరిం చిన వైసీపీలో చేరాలని కన్నా లక్ష్మీనారాయణ ఎందుకు నిర్ణయించుకున్నారో చెప్పాలని సోషల్ మీడియాలో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అమిత్‌షా నుంచి ఫోన్ కాల్ రావడంతో రాత్రికి రాత్రే ఆస్పత్రిలో చేరి, రాజకీయ నాటకానికి రక్తి కట్టించారనే సంగతి అందరికీ తెలుసనే కామెంట్స్ వస్తున్నాయి. కేవలం ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తామనే హామీతో బీజేపీలో కొనసాగి, ఆ తర్వాత పదవీ కాలం ముగియడంతో రాజకీయంగా కొత్త పార్టీని ఎంచుకోవడాన్ని ఏమంటారని కన్నాను నెటిజన్లు నిలదీస్తున్నారు. అవకాశవాదానికి చొక్కా, ప్యాంట్ తొడిగితే కన్నా అవుతారని, ఆయన కూడా వైసీపీ పుట్టుక గురించి మాట్లాడ్డం విడ్డూరంగా ఉందని ప్రత్యర్థులు మండిపడుతున్నారు.