సాధారణంగా వివేకం, మేధస్సు కలిగిన వారిని పెద్ద మనుషులు అంటారు. వారికి బుర్ర చురుకుగా ఉన్నా జనంలో నెగ్గుకురాలేదు. అందుకే వారి సేవలను వాడుకోవడానికి పెద్దల సభను ఒకటి మన రాజ్యాంగంలో స్రుష్టించుకున్నాం.
చాలా కాలం పాటు పెద్దల సభ అంటే అచ్చం అలాగే సాగి మర్యాద కాపాడింది. అయితే కొన్ని దశాబ్దాలుగా పెద్దలసభలో చేరుతున్న వారు చిన్న బుద్దుల ఆసాములేనని విమర్శలు కూడా ఉన్నాయి.
ఇక తాజాగా అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను శాసనమండలిలో ప్రవేశపెట్టనీయకుండా చంద్రబాబు గబ్బు రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అంటున్నారు.
బాబు తన సంకుచిత రాజకీయాలకు చట్ట సభలను కూడా వాడుకోవడం దారుణమని ఆయన ఘాటు కామెంట్స్ చేస్తున్నారు. దీనివల్ల రాజ్యాంగ ఘర్షణ తలెత్తాలన్నది బాబు కుటిల వ్యూహమని ఆయన ఆరోపిస్తున్నారు.
ఇక శాసనమండలి ఎలా రద్దు చేస్తారని అడుగుతున్న నారా లోకేష్ ని మీ తాత ఎన్టీయార్ 1985లో ఎలా రద్దు చేశారో తెలుసుకోమని సెటైర్లు వేశారు. శాసనమండలి రద్దుకు రెండేళ్ళ సమయం పడుతుందన్న మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు మాటలను కూడా దాడి కొట్టిపారేశారు.
కేవలం నెల రోజుల సమయం చాలు, మండలి రద్దు అయి కూర్చుంటుందని, ఒక్క దెబ్బకు అంతా మాజీలు అవుతారని కూడా పంచులు వేస్తున్నారు. మొత్తానికి శాసనమండలి విషయంలో బాబు చేస్తున్న రాజకీయం పెద్దల సభనే పర్మనెంట్ గా తీసేసేలా ఉందని దాడి మాటల బట్టి అర్ధమవుతోంది.
ఇప్పటికి దేశంలో కేవలం ఏడు రాష్ట్రాల్లో తప్ప ఎక్కడా మండలి లేదని కూడా దాడి అంటున్నారు. ప్రధాని మోడీ సైతం మండలి రద్దుకు అసెంబ్లీ సిఫార్స్ చేస్తే తప్పక ఆమోదిస్తారని కూడా ఆయన సలహా ఇస్తున్నారు. మరి వైసీపీ సర్కార్ ని తెగ చికాకు పెడుతున్న టీడీపీ ఎమ్మెల్సీల విషయంలో జగన్ మూడో కన్ను తెరుస్తారా.. చూడాలి మరి.