మనకు ఒక ముతక సామెత ఉంది. ఉపకారికి అపకకారం చేసిన వారిని తిన్న ఇంటి వాసాలు లెక్కపెడుతున్నారని అంటారు. అంటే అన్నం విస్తరి వేసిన వారికే వెన్నుపోట్లు పొడవడం అన్న మాట. ఈ సామెత ఇపుడు అచ్చంగా విశాఖ నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే తమ్ముళ్లకు సరిపోతుందని అంటున్నారు వైసీపీ నేతలు.
విశాఖ తూర్పు నుంచి గెలిచిన బుర్ర మీసాల ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు అసెంబ్లీలో అమరావతి రాజధాని కావాలంటూ ఏకంగా స్పీకర్ కుర్చీ పక్కన నిలబడి నానా యాగీ చేశారు.
మరో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసవారు ఈ మొత్తం ఎపిసోడ్ లో అసెంబ్లీలో మౌన వ్రతమే పట్టారు. ఆయన విశాఖ రాజధాని కావాలంటూ వైజాగ్ గల్లీలో గట్టిగానే చెప్పారు. తీరా చట్టాలే చోట, తన మాట ఎక్కడ రికార్డ్ అవుతుందో అక్కడ మాత్రం నోరు మెదపలేకపోతున్నారు. కారణమేంటో ఆయనకే తెలియాలని అంటున్నారు.
ఈ మొత్తం తతంగం చూసిన విశాఖ జిల్లా వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి కడుపు మండిపోయిట్లుంది. ఎక్కడ నుంచో విశాఖ వచ్చి వ్యాపారాలు చేసుకుంటామన్నారు, తరువాత ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కూడా అయ్యారు. ఇపుడు అదే విశాఖపైన విషం కక్కుతున్నారంటూ నిండుసభలోనే ఆయన పెద్ద నోరు చేశారు.
అంతటితో ఆగని ఆయన వంగవీటి రంగా హత్య కేసులో ఏ 5 నిందితుడుగా ఉన్న వెలగపూడిని భారీ మెజారిటీతో మూడు మార్లు విశాఖ తూర్పు ప్రజలు ఎమ్మెల్యేను చేస్తే ఆయన స్పీకర్ పోడియం ఎక్కి రభస చేయడం కంటే దారుణం ఉంటుందా అని ప్రశ్నించారు.
విశాఖ రాజకీయ బిక్ష పెడితే అమరావతి కావాలని సభలో గందరగోళం చేస్తున్న తమ్ముళ్ల తీరు మరి లోకల్ జనమే చూసుకోవాలేమో. ఆయన విశాఖ జనానికి ఈ వెన్నుపోట్లు కొత్తేమీ కాదు. విశాఖలో రెండవ పోర్టుని ఏర్పాటు కాకుండా ఈ నాన్ లోకల్ పొలిటీషియన్లే అడ్డుకున్నారు. విశాఖలో రైల్వే జోన్ వద్దు, విజయవాడ ముద్దు అన్నది కూడా ఈ బాపతే మరి.
ఏది ఏమైనా విశాఖ రాజధాని ఇస్తామని వైసీపీ అంటే ధిక్కరించి మరీ స్పీకర్ వేదికనే ఎక్కిన ఈ తమ్ముళ్ళ కధ తేల్చేందుకు జనం ఇప్పటికైనా రెడీనా మరి.