అయ్యో ఈడీ.. కిందామీద పడుతున్న అధికారులు

మోడీ వచ్చిన తర్వాత ఈడీకి పని పెరిగిందనేది బహిరంగ రహస్యం. ఇప్పుడు దీనికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి తాజా గణాంకాలు. గడిచిన నాలుగేళ్లలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసుల…

మోడీ వచ్చిన తర్వాత ఈడీకి పని పెరిగిందనేది బహిరంగ రహస్యం. ఇప్పుడు దీనికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి తాజా గణాంకాలు. గడిచిన నాలుగేళ్లలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసుల సంఖ్య 500 శాతం పెరిగింది. భారీ కేసులు, తక్కువ మంది సిబ్బందితో ఈడీ అధికారులు కిందామీద పడుతున్నారు.

2018-19, 2021-22 ఆర్థిక సంవత్సరాల మధ్య ఈడీ నమోదు చేసిన కేసుల సంఖ్య 505 శాతం పెరిగాయి. 2018-19లో 195 కేసులు నమోదు చేసిన ఈడీ, 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 1180 కేసులు ఫైల్ చేసింది. ఇవేవో ప్రతిపక్షాలు చెబుతున్న లెక్కలు కావు, స్వయంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాలు.

కేసుల సంఖ్య ఇలా ఉంటే.. ఈడీ దాడులు సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. 2014-22 మధ్య ఈడీ సోదాలు/దాడుల సంఖ్య ఏకంగా 2,555 శాతం పెరిగాయి. 2004-14 మధ్య 112 ఈడీ సోదాలు మాత్రమే జరగ్గా.. 5,346 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఎటాచ్ చేశారు.

అదే 2014-22లో చూసుకుంటే.. 2,974 ఈడీ దాడులు జరిగాయి. 95,432.08 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఎటాచ్ చేశారు. ఈ లెక్కలతో ప్రతిపక్షాలు మరోసారి రెచ్చిపోతున్నాయి.

ఈడీ, సీబీఐని మోడీ ప్రభుత్వం తమ రాజకీయ అస్త్రాలుగా వాడుకుంటోందని ఆరోపణలు చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. అటు అధికార పార్టీ మాత్రం పారదర్శకమైన పాలనలో భాగంగా ఈడీకి పూర్తి స్వతంత్రం ఇచ్చామని, వేల కోట్ల రూపాయల అక్రమ ఆస్తుల్ని ఎటాచ్ చేశామని చెప్పుకుంటోంది.

ప్రతిపక్షాలు, ప్రభుత్వం చేసుకుంటున్న ఆరోపణలు, ప్రత్యారోపణల్ని పక్కనపెడితే.. ఈడీ అధికారులు, సిబ్బంది మాత్రం పని ఒత్తిడితో సతమతమౌతున్నారు. చాలినంత మంది సిబ్బంది లేక ఈడీలో ప్రతి ఒక్కరు కిందామీద పడుతున్నారు. దీంతో పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది.