పవన్ కల్యాణ్ సినిమా ఎంట్రీతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. జగన్ పాలన బాగుండటం వల్లే పవన్ సినిమాల్లోకి వెళ్లిపోయారని, బీజేపీతో లాలూచీ పడి, పార్టీని పక్కనపెట్టి సినిమా దారి పట్టారని రకరకాలుగా సెటైర్లు పేలుతున్నాయి. దీంతో జనసైనికులు కూడా బాగానే హర్ట్ అయినట్టున్నారు. స్వయంగా వాళ్లే పవన్ మళ్లీ సినిమాల్లోకి వెళ్లడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
కొంతకాలంగా పింక్ రీమేక్ గురించి వార్తలొస్తున్నా.. పాతికేళ్ల పోరాటం అంటూ పవన్ చెప్పిన కబుర్లు జనసైనికులకు బాగానే రుచించాయి. తీరా ఇప్పుడు పవన్ ప్లేటు ఫిరాయించేసరికి కార్యకర్తలు కూడా దిగులు పడ్డారు. అమరావతి ప్రాంత రైతులతో జరిగిన సమావేశంలో కొంతమంది జనసేన మహిళా కార్యకర్తలు ఇదే విషయంపై తెగ ఇదైపోయారు. అందరూ వస్తున్నారు పోతున్నారు, నువ్వు మాత్రం మాతోనే ఉండయ్యా, నువ్వెక్కడికీ పోవద్దు.. అంటూ ఓ మహిళ పవన్ ని తెగబతిమిలాడింది. పరోక్షంగా ప్రజారాజ్యం ప్రస్తావన కూడా చేసింది.
మీకోసం ఎవరూ రారు, వచ్చినా మీతో ఉండరు.. అని అందరూ అంటుంటే బాధగా ఉంది, నువ్వయినా మాతోనే ఉండయ్యా, కాపుల పేరు నిలబెట్టాలయ్యా అని పవన్ చేయి పట్టుకుని మరీ బతిమిలాడింది. ఇక పవన్ సీట్లు, ఓట్లు, వైసీపీని తాట తీస్తామంటూ.. తన సహజ సిద్ధమైన ధోరణిలో రెచ్చిపోయి అభయహస్తం ప్రసాదించారు, అనునయించారు.
మొత్తమ్మీద పవన్ సినిమా రీఎంట్రీ.. డైహార్డ్ ఫ్యాన్స్ కి తప్ప, ఆయన్ను రాజకీయ నాయకుడిగా చూడాలనుకుంటున్నవారికి మాత్రం ఇష్టం లేదని అర్థమవుతోంది. పవన్ రాజకీయాల్లో రాణించలేకే సినిమాల్లోకి వెళ్తున్నారనే విమర్శను వారు తట్టుకోలేకపోతున్నారు. పాతికేళ్ల భవిష్యత్ కోసం రాజకీయం అని చెప్పే పవన్ కనీసం పాతిక నెలలు కూడా వెయిట్ చేయలేకపోవడం ఏంటా అని బాధపడుతున్నారు.
ఇలాంటి కన్నీళ్లు, సెంటిమెంట్ డైలాగుల్ని చూసి పవన్ వెనకడుగేసే రకం కాదు. అన్నీ ఆలోచించుకునే ఆయన సినిమా వైపు అడుగేశారు. తన మీటింగ్ లకి వచ్చి సీఎం సీఎం అని అరుస్తారే కానీ, ఎన్నికల్లో పోటీ చేస్తే రెండు చోట్లా ఓడించి పంపించారనే బాధ పవన్ లో చాలా ఉంది. ఆ బాధ కంటే.. అధ్యక్షుడినైన తను ఓడిపోవడం, తమ పార్టీ తరపున రాపాక ఎమ్మెల్యే కావడం ఇంకా క్షోభపెట్టే విషయం. అందుకే పవన్ కాస్త ఉపశమనం కోసం రాజకీయాలకు విరామం ఇచ్చి సినిమాలవైపు వెళ్తున్నారు. ప్రస్తుతానికి రెండూ బ్యాలెన్స్ చేస్తానంటూ అటూ ఇటూ తిరుగుతున్నా.. రాబోయే రోజుల్లో పవన్ వారానికోసారి, లేదా నెలకోసారి మాత్రమే జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.