‘మూడు రాజధానులు’కు కేంద్రం ఆశీస్సులు…!

'మూడు రాజధానులు' ఏర్పాటు చేయాలనే ఏపీ సీఎం జగన్‌ నిర్ణయంలో సగం పూర్తయింది. మిగతా సగం కూడా అయ్యే అవకాశముంది. కాకపోతే కొద్దిగా జాప్యం జరుగుతుండొచ్చు. ఇక మూడు రాజధానుల ఏర్పాటుకు, సీఆర్‌డీఎ రద్దుకు…

'మూడు రాజధానులు' ఏర్పాటు చేయాలనే ఏపీ సీఎం జగన్‌ నిర్ణయంలో సగం పూర్తయింది. మిగతా సగం కూడా అయ్యే అవకాశముంది. కాకపోతే కొద్దిగా జాప్యం జరుగుతుండొచ్చు. ఇక మూడు రాజధానుల ఏర్పాటుకు, సీఆర్‌డీఎ రద్దుకు వ్యతిరేకంగా హైకోర్టులో కేసులు వేయడం ఖాయం. ఇప్పటికే కేసులు వేశారు. నిరసనలు, కేసులు సహజమే. ఇక జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ జనానికి రెండు ముఖ్య విషయాలు చెప్పాడు. చెప్పాడనడం కంటే హామీ ఇచ్చాడని చెప్పడం సమంజసం. అమరావతి (రాజధానిగా) ఎక్కడికీ కదలదని, జగన్‌ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని, కూల్చేదాకా తాను నిద్రపోనని చెప్పాడు. 

అయితే ఈ రెండు పనులూ జరిగే అవకాశం లేదు. అమరావతిని ఆపేందుకు తాను మళ్లీ (ఈరోజు) ఢిల్లీ వెళుతున్నానని, ప్రధానిని, బీజేపీ పెద్దలను కలుసుకొని మాట్లాడతానని చెప్పాడు. అమరావతిని ఆపడం కోసమే తాను బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు పవన్‌ చెప్పాడు. అమరావతి ఆగకపోతే పొత్తు పెటాకులవుతుందా? ఇది కూడా త్వరలోనే తెలిసిపోతుంది. జనసేన-బీజేపీ పొత్తు తాత్కాలికమైంది కాదని ఇదివరకు చెప్పాడు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికలవరకు అంటే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వరకు పొత్తు కొనసాగుతుందన్నాడు. నిన్న రైతులతో మాట్లాడినప్పుడు మాత్రం అమరావతిని ఆపడానికే పొత్తు పెట్టుకున్నానని చెప్పాడు. 

అదే సందర్భంలో జగన్‌ సర్కారును కూలదోసేదాకా నిద్రపోనని అన్నాడు. ఏపీలో ఏడాదిన్నరలో ఎన్నికలు వస్తాయని చెప్పాడు. ఎన్నికల సంగతి తరువాత చూద్దాం. ముందు అమరాతిని బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వం ఆపలేకపోతే పవన్‌ ఏం చేస్తాడు? ఈ సంగతి ఆయన చెప్పాలి. తమ పొత్తుకు అమరావతే కీలకమన్నట్లుగా మాట్లాడాడు కదా. ఇక కేంద్రానికి చెప్పే తాము అన్ని పనులు (రాజధాని సహా) చేస్తున్నామని వైకాపా నాయకులు ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఇది దుష్ప్రచారమంటూ పళ్లు కొరుకుతున్నారు. కేంద్రం తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. 

కాని ఇది నిజం కాదనే అనుమానం కలుగుతోంది. రాష్ట్ర బీజేపీ నాయకులంతా ఇప్పటికీ ఒకే అభిప్రాయం చెప్పడంలేదు. కొందరు కీలక నాయకులు అసలు రాజధాని విషయమే మాట్లాడటంలేదు. గతంలో బాబు సర్కారుపై నిప్పులు చెరిగిన కొందరు నాయకులు ఇప్పుడు జరుగుతున్న ఏ ఒక్క పరిణామంపై కూడా తమ అభిప్రాయం చెప్పడంలేదు. ఇదిలా ఉండగా జగన్‌ అనూహ్యంగా తీసుకున్న 'మూడు రాజధానులు' నిర్ణయానికి కేంద్రం మద్దతు సంపూర్ణంగా ఉందని వైకాపా జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రా రెడ్డి ఈరోజు ఓ టీవీ ఛానెల్‌ చర్చలో కుండబద్దలు కొట్టాడు. 

ఏ శషభిషలు లేకుండా, ఏమాత్రం జంకకుండా మూడు రాజధానులకు కేంద్రం ఆశీస్సులున్నాయని చెప్పాడు. కేంద్రం మద్దతు ఉందంటే పార్టీగా బీజేపీ మద్దతు కూడా ఉన్నట్లే కదా. ఇదే చర్చలో పాల్గొన్న బీజేపీ నేత రామకోటయ్య రాజధాని వికేంద్రీకరణకు కేంద్రం, బీజేపీ మద్దతు లేవని సమర్థించుకోవడానికి నానా తిప్పలు పడ్డాడు. రవిచంద్రా రెడ్డిలా కుండబద్దలు కొట్టినట్లు చెప్పలేకపోయాడు. బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు తేడాగా (కేంద్రం కల్పించుకోదంటూ) ఎందుకు మాట్లాడుతున్నారనే ప్రశ్నకు కూడా రామకోటయ్య సరైన సమాధానం ఇవ్వలేదు. 

ఇక జగన్‌ ప్రభుత్వాన్ని కూలదోస్తానంటూ పవన్‌ కళ్యాణ్‌ రంకెలు వేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ మాట ఏ ప్రాతిపదికన చెప్పాడో, అందుకు ఆధారమేమిటో ఆయనకే తెలియదు. పవన్‌కు 30 మందో, 40 మందో ఎమ్మెల్యేలు ఉంటే ఏదైనా చేస్తాడేమో అనుకోవచ్చు. ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా చేజారిపోయాడు. మిత్ర పార్టీ బీజేపీ ఏమైనా చేయవచ్చని అనుకుంటున్నాడేమో. ఆ పార్టీయే పవన్‌ను ముంచేలా ఉంది. గతంలో 67 మంది ఎమ్మెల్యేలు ఉన్న జగన్‌ కూడా టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చుతానని మూడు నాలుగుసార్లు పబ్లిగ్గానే చెప్పారు. 'త్వరలోనే మన ప్రభుత్వం వస్తుంది' అన్నారు. కాని చివరకు ఏమైంది? 

వైకాపా నుంచే 23 మంది ఎమ్మెల్యేలను బాబు లేగేశాడు. అప్పట్లో జగన్‌కే సాధ్యం కానిది ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పవన్‌కు ఎలా సాధ్యం? దీనిపై జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్‌ను అడిగితే ఆయన పొంతన లేకుండా మాట్లాడాడు. ఇరాక్‌లో విప్లవం వచ్చినట్లే ఏపీలోనూ వస్తుందట…! ఈ ప్రభుత్వం కూలిపోయేదాకా ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తారట…! తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగినప్పుడు, ఒళ్లు కాల్చుకొని విద్యార్థులు చనిపోయినప్పుడు అప్పటి కాంగ్రెసు ప్రభుత్వం కూలిపోయిందా? ఏపీలోనూ ఏమీ కాదు.

బుచ్చయ్య చౌదరి తొడలు కొట్టుకుంటూ అసెంబ్లీ లో తిరుగుతున్నాడు

చేతకాని సంస్కార హీనులు మీరు