చంద్రబాబు మరియు ‘ఏప్రిల్ ఫూల్’ డైలాగులు!

ఫూల్స్ డే సందర్భంగా.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఒక సరదా పుట్టింది. అధికారంలో ఉంటే.. ఎటూ ప్రజల్ని ఎప్పటికప్పుడు ఫూల్స్ చేసే అవకాశం ఉండేది. కానీ నాలుగేళ్లుగా అధికారం లేకుండా అలమటించిపోతున్న నేపథ్యంలో..…

ఫూల్స్ డే సందర్భంగా.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఒక సరదా పుట్టింది. అధికారంలో ఉంటే.. ఎటూ ప్రజల్ని ఎప్పటికప్పుడు ఫూల్స్ చేసే అవకాశం ఉండేది. కానీ నాలుగేళ్లుగా అధికారం లేకుండా అలమటించిపోతున్న నేపథ్యంలో.. ఆయనకు కనీసం ఫూల్స్ డే నాడు అయినా అంటే ఏప్రిల్ 1న అందరినీ ఫూల్ చేయాలనే కోరిక పుట్టింది. అందుకోసం ముఖ్యంగా మీడియా ఫ్రెండ్స్ అందరినీ ఫూల్ చేయాలనుకున్నాడు. వారిని ఫూల్ చేయగలిగితే చాలు.. వారి ద్వారా రాష్ట్రంలోని ఏపీ ప్రజలందరినీ కూడా ఫూల్ చేయడం సాధ్యమవుతుందని ఆయన నమ్మకం. అందుకే ఆయన మీడియా మిత్రులతో ఓ ఇష్టాగోష్టి సమావేశం పెట్టారు. ప్రజలను ఫూల్స్ చేయడానికి తనకు తోచిన ఊహలను చెప్పుకుంటూ పోయారు. 

గతంలో ఆయన గారికి రాజకీయాల్లో మంచి- చెడు అనే విచక్షణ ఉండేదిట. ఇప్పుడు ఎదురుదాడి తప్ప మరొకబాట తొక్కకూడదని డిసైడ్ అయ్యారట.  ప్రజల్ని ఫూల్ చేయడానికి ఆయన చెప్పిన మొదటి డైలాగ్ ఇది. చంద్రబాబునాయుడుకు నలభైనాలుగేళ్ల రాజకీయ కెరీర్లో ఎంత కాలం మంచిచెడుల విచక్షణ ఉన్నదో తెలుగు ప్రజలందరికీ తెలుసు.

కాంగ్రెసు పార్టీలోనే ఉంటూ క్యాంపు రాజకీయాల కుట్రలు నడిపిన నాటినుంచి, తాను తూలనాడిన మామ పంచన చేరి, చివరికి ఆయనను వెన్నుపోటు పొడిచి అధికారం హస్తగతం చేసుకున్న చంద్రబాబు.. తనకు ఇప్పటిదాకా మంచిచెడులు ఉండేవని అనడం ప్రజల్ని ఫూల్ చేయడం కాక మరేమిటి? అలాగే .. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం 175 స్థానాలు గెలస్తామని అనడం.. ఆయన ప్రజల్ని ఫూల్ చేయడానికి చెబుతున్న రెండో డైలాగు. 

ఇన్నాళ్లూ ఆయనకు ఇంత ధైర్యం రాలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కలిగించిన వాపును చూసుకుని బలుపుగా భావిస్తూ చెలరేగిపోవాలని అనుకుంటున్నట్టుగా ఉంది. ‘వైనాట్ `175’ అనే మాట ద్వారా జగన్మోహన్ రెడ్డే అన్ని సీట్లూ గెలవడానికి ప్రయత్నం చేద్దాం అని సంకేతాలు ఇస్తున్నారు. అంతే తప్ప.. 175 మేం గెలిచి తీరుతాం అని చెప్పడం లేదు. ఆ మాట ద్వారా ‘కష్టపడితే ఎందుకు గెలవలేం’ అనే సందేశం ఉంది. కానీ.. చంద్రబాబునాయుడు అతి ఏంటంటే.. 175 స్థానాలు ఖచ్చితంగా గెలిచి తీరుతామని అనడం. అది ప్రజల్ని ఫూల్స్ ని చేయడం కాక ఇంకేమిటి.

మూడో ఫూల్స్ డైలాగ్ మరొకటి ఉంది. తమ పార్టీకి ఉన్న 23 మంది సభ్యుల బలంతోనే తమ ఎమ్మెల్సీని గెలిపించుకున్నట్టుగా కూడా చెబుతున్నారు. 23 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే.. ఈ పార్టీలో ఉంటే భవిష్యత్తు సమాధి అనే భయంతో నలుగురు ఆయనను ఛీకొట్టి వెళ్లి జగన్ పంచన చేరారు. చంద్రబాబు ఊసును కూడా పట్టించుకోలేదు.తీరా నాలుగేళ్లు గడిచాక.. పెర్ఫార్మెన్స్ బాగాలేదని జగన్ పక్కన పెట్టిన నలుగురు అసమర్థులను తన వైపు లాక్కుని వారి ఓట్లతో ఎమ్మెల్సీ సీటు దక్కించుకున్న చంద్రబాబు.. పచ్చిగా, ప్రజలు నవ్వుతారని తెలిసి కూడా, అబద్ధం చెప్పడమే తమాషా. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఓటు వేయడం వల్ల గెలిచాం అంటూ.. ప్రజల్ని ఫూల్స్ ని చేస్తున్నారు. 

ఫైనల్ రౌండ్.. ఫూల్స్ డైలాగ్ మరొకటి ఉంది! చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుతో టచ్ లో ఉన్నారట. అంటే వారందరూ వచ్చే ఎన్నికల్లో ఫిరాయించడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. నమ్మి రాసిన మీడియా మిత్రులు మొదటగా ఫూల్స్ అయిపోయినట్టే.. ఆ తర్వాత ఆ వార్తలు చదివి నమ్మిన ప్రజలు కూడా ఏప్రిల్ ఫూల్స్ అయిపోయి ఉంటారు. చంద్రబాబునాయుడు ఇన్ని అబద్ధాలతో ప్రజల్ని ఫూల్స్ ను చేయడానికి సరైన ముహూర్తంగా ఏప్రిల్ 1ని ఎంచుకోవడమే ఆయన తెలివితేటలకు నిదర్శనం.