టికెట్ కోస‌మే పల్లె ర‌ఘునాథ‌రెడ్డి స‌ర్క‌స్ ఫీట్స్‌!

కోటి విద్య‌లు కూటికోస‌మే అన్న చందంగా… రాజ‌కీయ నేత‌ల నాట‌కాల‌న్నీ ప‌ద‌వుల కోస‌మే. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా పుట్ట‌ప‌ర్తిలో రాజ‌కీయం ఒక్క‌సారిగా వేడెక్కింది. ప్ర‌శాంత‌త‌కు మారుపేరైన పుట్ట‌ప‌ర్తిలో తాజా రాజ‌కీయ ప‌రిణామాలు ఒకింత ఆశ్చ‌ర్యం…

కోటి విద్య‌లు కూటికోస‌మే అన్న చందంగా… రాజ‌కీయ నేత‌ల నాట‌కాల‌న్నీ ప‌ద‌వుల కోస‌మే. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా పుట్ట‌ప‌ర్తిలో రాజ‌కీయం ఒక్క‌సారిగా వేడెక్కింది. ప్ర‌శాంత‌త‌కు మారుపేరైన పుట్ట‌ప‌ర్తిలో తాజా రాజ‌కీయ ప‌రిణామాలు ఒకింత ఆశ్చ‌ర్యం క‌లిగిస్తున్నాయి. మాజీ మంత్రి ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి వ్య‌క్తిగ‌తంగా మృధు స్వ‌భావిగా పేరు పొందారు. ఆచితూచి మాట్లాడుతుంటారు. వివాదాల‌కు, గొడ‌వ‌ల‌కు దూరంగా వుంటారు. పుట్ట‌ప‌ర్తి ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్‌రెడ్డి కూడా గొడ‌వ‌ల‌కు వెళ్లే ర‌కం కాదు. ఇంత‌కాలం పుట్ట‌ప‌ర్తి రాజ‌కీయాలు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలోనే కొన‌సాగాయి.

లోకేశ్ పాద‌యాత్ర పుణ్య‌మా అక్క‌డ ప్ర‌శాంత‌త‌కు భంగం క‌లిగింది. టీడీపీ, వైసీపీ శ్రేణులు అటూఇటూ గుమికూడా రాళ్లు, చెప్పుల‌తో దాడులు చేసుకునే వర‌కూ వెళ్లాయి. అయితే ఈ ప‌రిణామాల‌కు దారి తీసిన ప‌రిస్థితుల‌కు ఒకే ఒక్క కార‌ణం…ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డికి టికెట్ ఖ‌రారు కాక‌పోవ‌డ‌మే. పుట్ట‌ప‌ర్తిలో త‌న సీటుకు డోకా లేద‌ని ప‌ల్లె భావించి వుంటే, ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి ఇలా రోడ్డెక్కే వారు కాద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  

పల్లెకు ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టపర్తి టీడీపీ టికెట్‌ వచ్చే ప్రసక్తే లేదని తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్‌ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి అనేకమార్లు మీడియా ఎదుట‌ కుండబద్దలు కొట్టిన సంగ‌తి తెలిసిందే. పుట్ట‌ప‌ర్తిలో ప‌ల్లెకు జేసీ ఎస‌రు పెట్టారు. పుట్టపర్తి టీడీపీ టికెట్‌ తన మద్దతుదారుడైన సైకం శ్రీనివాస రెడ్డికి ఇప్పిస్తానని జేసీ బ‌హిరంగంగానే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. జేసీ చ‌ర్య‌ల‌కు టీడీపీ మౌనం పాటిస్తూ ప‌రోక్షంగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తూ వ‌చ్చింది.

దీంతో పల్లెకు టికెట్ ద‌క్క‌ద‌నే భ‌యం ప‌ట్టుకుంది. చంద్ర‌బాబు, లోకేశ్ దృష్టిలో ప‌డేందుకు ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి త‌న స్వ‌భావానికి విరుద్ధంగా రోడ్డెక్కార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇంత చేసినా టికెట్ ప‌ల్లెకు ద‌క్కుతుంద‌నే భ‌రోసా మాత్రం లేదు. ఎందుకంటే ప‌ల్లెకు టికెట్ ఇస్తే… ఓడించ‌డానికి జేసీ బ్ర‌ద‌ర్స్ సిద్ధంగా ఉన్నార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.