మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు యుద్ధాన్ని తలపించనున్నాయి. ఈ సమరంలో సోషల్ మీడియా అనేది అత్యంత కీలకం. ప్రత్యర్థి పార్టీల విమర్శలను తిప్పికొట్టడంతో సోషల్ మీడియా వేదికగా సక్సెస్ అయ్యేవారే, సార్వత్రిక ఎన్నికల్లో కూడా విజయకేతనం ఎగుర వేసే అవకాశాలున్నాయి. మారిన రాజకీయ పరిస్థితుల్లో సోషల్ మీడియా అనేది అత్యంత ప్రభావశీలమైన వేదిక అని చెప్పక తప్పదు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చెలాయిస్తున్న వైసీపీ సోషల్ మీడియా ఎంత అధ్వానంగా ఉందో, ఆ వ్యవస్థ రథసారథి తాజా పోస్టే నిలువెత్తు నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ దుస్థితిని ఆ పార్టీ సోషల్ మీడియా సైన్యాధ్యక్షుడు సజ్జల భార్గవరెడ్డి ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు తెలియజేస్తోంది. వైఎస్ జగన్‌పై సొంత పార్టీకి చెందిన సోషల్ మీడియా నాయకులు వ్యతిరేక పోస్టులు పెడితే , వారిని వెంటనే పదవుల నుంచి తొలగిస్తామని హెచ్చరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సజ్జల భార్గవరెడ్డి పోస్టు ఏంటో చూద్దాం.
“జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు సోషల్ మీడియాలో పదవులు చేపట్టిన వారెవరైనా వైఎస్సార్‌సీపీకి, అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ గారికి విరుద్ధంగా పోస్టులు పెట్టినా, పార్టీలైన్ దాటి వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టినా రెండో ఆలోచన లేకుండా వెంటనే పదవి నుంచి తొలగించడం జరుగుతుంది”
అంటూ ఏపీ వైసీపీ మీడియా, సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ సజ్జల భార్గవరెడ్డి పేరుతో ఆయన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు ప్రత్యక్షమైంది. ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా నడుచుకున్నట్టు గుర్తించి వుంటే, వారిని తొలగిస్తూ పోస్టు పెడితే ఓ హెచ్చరికగా వుండేది. అంతే తప్ప, సంబంధం లేకుండా వార్నింగ్‌లు ఇవ్వడం ద్వారా అభాసుపాలు కావడం మినహాయించి ఒరిగేదేమీ లేదు. మీడియా, సోషల్ మీడియాకు అనుభవం లేని వారు నాయకత్వం వహిస్తే… ఇంత కంటే మెరుగైన ఫలితాలు వస్తాయనుకోవడం అత్యాశే అవుతుంది. ఇప్పుడు భార్గవరెడ్డి విషయంలో కూడా అదే జరుగుతోంది.
వైసీపీ సోషల్ మీడియాలో పదవులు పొందిన వారే వైఎస్ జగన్‌తో పాటు పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతు న్నారని సజ్జల భార్గవరెడ్డి పోస్టు ద్వారా అర్థమవుతోంది. ఎన్నికల సమయంలో ఎందుకిలా? సొంత వాళ్లే తమకు వ్యతిరేకంగా నడుచుకుం టుంటే, ఇక ప్రత్యర్థులు, తటస్థుల పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సజ్జల భార్గవరెడ్డి పోస్టుపై ప్రతిస్పందన ఆసక్తికరంగా వుంది. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం.
“ఈ రోజు సోషల్ మీడియాకు ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగంలో నిజాయితీపరులకు, పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా ఆ వేదికపై పనిచేస్తున్న సమర్థవంతులకు అవకాశం లేకపోవడమే. పైరవీలు చేసుకునే వారికే ఎక్కువ శాతం పదవులు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది”
” వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా విభాగంలో పదవులు ఇచ్చే ముందు…ప్రతి వ్యక్తి డేటాను పరిశీలించాలి. ఆ వ్యక్తి పార్టీ కోసం ఎప్పటి నుంచి పని చేస్తున్నాడో పరిగణలోకి తీసుకోవాలి. అలా చేసి వుంటే ఈరోజు ఈ స్టేట్మెంట్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా! ఇప్పటికైనా వైఎస్సార్‌కాంగ్రెస్ సోషల్ మీడియాను మరొక్కసారి ప్రక్షాళన చేయండి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో సీనియర్లు ఇప్పటికే చాలా అసహనంతో ఉన్నారు”
రానున్న ఎన్నికల్లో అత్యంత బలీయమైన టీడీపీ, జనసేన సోషల్ మీడియాను ఎదుర్కోవడం అసాధ్యమని సజ్జల భార్గవరెడ్డి పోస్టుతో పాటు దానిపై స్పందనలు చెబుతున్నాయి. అసలు మీడియా, సోషల్ మీడియా బాధ్యతల్ని సజ్జల భార్గవరెడ్డికి అప్పగించే వరకూ… ఆయనకు సోషల్ మీడియాలో ఎలాంటి అకౌంట్ లేకపోవడం గమనార్హం. అధికారానికి ముందు, ఆ తర్వాత వైసీపీ సోషల్ మీడియా గురించి మాట్లాడుకుంటే… ఇప్పుడు ఎంతో దయనీయ పరిస్థితిలో వుందని చెప్పక తప్పదు. ఎందుకంటే గతంలో అభిమానంతో పని చేసిన వారిని ఆదరించకపోవడమే ఇప్పుడీ దుస్థితికి కారణమైంది.