రాహుల్ మీద పార్లమెంటులో అనర్హత వేటు వేయగానే భూమ్యకాశాలు బద్ధలైపోయినంతగా పాపం కాంగ్రెస్ నాయకులు కుమిలికుమిలి విలపిస్తున్నారు. కాంగ్రెసు నాయకుల్లో సహజంగానే ప్రభువును మించిన ప్రభుభక్తి ఉంటుందనే సంగతి అందరికీ తెలుసు. రాహుల్ మీద పడిన అనర్హత వేటు ద్వారా.. తమ భక్తి ప్రపత్తులను గరిష్టంగా చాటుకోవడానికి, పార్టీకి వీలైనంత మైలేజీ రాబట్టుకోవడానికి వారు పాట్లు పడుతున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే.. కేవీపీ రామచంద్రరావు చంద్రబాబునాయుడు భజన ప్రారంభించడం చిత్రంగా కనిపిస్తోంది.
ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా టెక్నికల్ గా మాత్రమే చెలామణీ అవుతున్న నాయకుడు కేవీపీ రామచంద్రరావు. ఆయనకు హఠాత్తుగా చంద్రబాబునాయుడు ఎంత మహానుభావుడో గుర్తుకు వచ్చింది. ‘‘మీ శక్తి సామర్థ్యాలు తక్కువేం కాదు. ఎంతో రాజకీయ చతురత ఉంది. దేశ రాజకీయాలకు కేంద్ర బిందువు కాగల శక్తి ఉంది. ఎన్డీయే కన్వీనరుగా పనిచేశారు. దిల్లీలో చక్రం తిప్పారు.’’ అని బాబును కేవీపీ కీర్తిస్తున్నారు.
ప్రయోజనం ఆశించకుండా ఇంతలావు పొగడ్తలు ఎందుకు చేస్తున్నట్టు? ఆయన ఆశించే ప్రయోజనం కూడా ఉంది. ఆయన అడుగుతున్నదేమిటో తెలుసా.. ‘‘దేశంలో రాజకీయ పరిస్థితులపై పోరాటంలో మీరు ముందుండండి. మీ వెనక మేం ఉంటాం’’ అని అంటున్నారు. ఇంతకు ఆయన అనుకుంటున్న రాజకీయ పరిస్థితులు ఏమిటో తెలుసా.. రాహుల్ కు జైలుశిక్ష నేపథ్యంలో పార్లమెంటు వేసిన అనర్హత వేటు గురించి గళమెత్తి అడగడం. అంత చిల్లర విషయం కోసం, వైఎస్సార్ ఆత్మగా ముద్రపడిన కేవీపీ ఎన్నోమెట్లు దిగజారి చంద్రబాబు భజన చేయడం అసహ్యంగా కనిపిస్తోంది.
ఇంతకూ కేవీపీ రామచంద్రరావు మీడియా ముందుకు వచ్చి మాట్లాడి ఎన్నాళ్లయింది? ఆయన ఆంధ్రప్రదేశ్ ‘కేడర్’కు చెందిన కాంగ్రెసు నాయకుడిగా చెలామణీ అవుతున్నారే తప్ప.. అక్కడి ప్రజల గురించి వారి కష్టాల గురించి, అక్కడి సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం చేస్తున్న వంచన గురించి మాట్లాడి ఎన్నాళ్లయింది? ఎప్పుడైనా గళమెత్తారా? కేంద్రాన్ని ప్రభుత్వమో, ప్రతిపక్షాల్లో రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం డిమాండ్ చేసినప్పుడు ఆయన గొంతు కలిపారా? అలాంటిదేం జరగలేదు.
కానీ ఇవాళ తమ ప్రభువు రాహుల్ మీద అనర్హత వేటు పడగానే.. ఆయన అందరి కాళ్లూ పట్టుకోవడానికి సిద్ధపడుతున్నారు. అంతగా దిగజారుతున్నారు. పోనీ, ఇలా దిగజారి పొగిడినంత మాత్రాన, ఈయన పొగడ్తలకు చంద్రబాబు పడిపోయి వెంటనే రాహుల్ కు మద్దతుగా పోరాటంచేస్తారనే నమ్మకం ఆయనకు ఉందా? మోడీ గొడుగు కిందకు దూరాలని ఆరాటపడిపోతున్న చంద్రబాబు కేవీపీ మాటలను అసలు పట్టించుకుంటాడా? అనే ఆలోచన కూడా ఆయనకు వచ్చినట్టు లేదు. అందుకే, ప్రజల గోడు ఏనాడూ పట్టించుకోని ఈ నాయకుడు ఈ స్థాయిలో ప్రదర్శిస్తున్న ప్రభుభక్తి కంపరం పుట్టిస్తోంది.