వైసీపీని వ్యతిరేకించి చేతులు నరుక్కోవద్దు

ఇది హెచ్చరిక కాదు అభ్యర్ధన కూడా కాదు. హిత బోధ. రాజకీయ నాయకులు జనాలను తమ వైపు తిప్పుకోవడానికి ఎవరి స్టైల్ వారికి ఉంటుంది. చంద్రబాబునాయుడు అయితే తనకు అధికారం లేకపోవడం ఖర్మ అని…

ఇది హెచ్చరిక కాదు అభ్యర్ధన కూడా కాదు. హిత బోధ. రాజకీయ నాయకులు జనాలను తమ వైపు తిప్పుకోవడానికి ఎవరి స్టైల్ వారికి ఉంటుంది. చంద్రబాబునాయుడు అయితే తనకు అధికారం లేకపోవడం ఖర్మ అని అనుకోరు. జనాల చేతనే  ఖర్మ అనిపిస్తారు. ఆయన ఎపుడూ తప్పు చేయరు. జనాలే ఆయన్ని ఓడించి తప్పు చేశారని నిందిస్తారు.

వైసీపీలో చూస్తే సీనియర్ మంత్రులు చాలా మంది ఉన్నారు. వారిలో ధర్మాన ప్రసాదారావు ఒక రకమైన శైలికి అలవాటు పడిన వారు. ఆయన మేధావిగా పేరు గడించిన మాస్ లీడర్. ఆయన ఈ మధ్య వరసగా చేస్తున్న ప్రకటనలు గమనిస్తే వైసీపీకి ఫేవర్ గానే ఉంటున్నాయా లేక కలవరపాటుతో ఉలికిపాటుతో చేస్తున్నారా అన్న డౌట్లు కచ్చితంగా వస్తాయి.

ధర్మాన తన సొంత నియోజకవర్గం శ్రీకాకుళంలో వైఎస్సార్ ఆసరా పధకం లబ్దిదారులు అయిన మహిళలతో మాట్లాడుతూ వైసీపీ మహిళల కోసమే అనేక పధకాలు ప్రవేశపెట్టిందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనన్ని పధకాలు ఠంచనుగా క్రమం తప్పకుండా ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు.

మహిళలను మహరాణులుగా ఆత్మగౌరవంతో బతికేవారిగా తీర్చిద్దిదడానికే తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందని వివరంగా చెప్పారు. అలాంటి ప్రభుత్వాన్ని అధికారం నుంచి దూరం చేసుకోవద్దు అంటూ హితబోధలే చేశారు. వైసీపీని కాదు అనుకున్నా లేక ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినా మీ చేతులు మీరు నరికేసుకున్నట్లే అని మంత్రి గారు తాను చెప్పాల్సింది చెప్పేశారు.

మీ కోసం ఉన్న ప్రభుత్వం ఇది. మళ్ళీ ఇన్నేసి పధకాలను ఏ ప్రభుత్వం వచ్చినా అమలు చేయదు, ఆనక మీ ఇష్టం అన్నట్లుగా ధర్మాన తేల్చేశారు. మీ కోసం పనిచేస్తున్న ప్రభుత్వానికి మీ చేతులు ఆసరాగా పెట్టి అండగా ఉండాల్సిన బాధ్యత మీదే అని ధర్మాన ధర్మంగా చెబుతున్నారు.

మహిళల ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న వైసీపీని ఎపుడు ఎన్నికలు జరిగినా గెలిపించుకోవాలని ఆయన సూచించారు. ఒక పెద్దాయనగా సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా ఇదే నా మాట అని ఆయన చెబుతున్నారు. మహిళామణులు వైసీపీని గెలిపించుకోవాలన్న ధర్మపన్నాలు వింటారా లేదా అన్నది 2024లోనే తేలనుంది.